Jump to content

Chandrababu: అవిశ్రాంత పోరాటయోధుడు


southyx

Recommended Posts

Chandrababu: అవిశ్రాంత పోరాటయోధుడు

ఈ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి... నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న దార్శనికుడు.. కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న నేత చంద్రబాబు..!

 

14 ఏళ్లు ముఖ్యమంత్రి.. 15 ఏళ్లు ప్రతిపక్ష నేత
28 ఏళ్లకే ఎమ్మెల్యే.. 30 ఏళ్ల వయసులోనే మంత్రి
45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. స్ఫూర్తిదాయకం
రాజకీయ జీవితమంతా సంఘర్షణల మయం
52 రోజులు జైల్లో పెట్టినా తొణకని.. బెణకని ధీశాలి
జాతీయ రాజకీయాల్లోనూ ఆయనది కీలక పాత్ర
అమరావతి రూపశిల్పి.. నవ్యాంధ్రకు సీఈఓ
అంతర్జాతీయ స్థాయిలోనూ అపార గౌరవం
నాలుగోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణం
ఈనాడు - అమరావతి

ap110624main1a.jpg

అసాధారణ రాజకీయ ధురంధరుడు..! 

అనేక ఎన్నికల యుద్ధాల్లో ఆరితేరిన వీరుడు..! 

నిరంతర శ్రామికుడు..! 

అభివృద్ధి కాముకుడు..!

అలుపెరగని నాయకుడు..! 

పడిన ప్రతిసారీ ఉవ్వెత్తున ఎగిసే కెరటం..! 

నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఆద్యంతం సంఘర్షణల మయం..! 

ఆయనే తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు!

ఈ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి... నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న దార్శనికుడు.. కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న నేత చంద్రబాబు..! ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి... జగన్‌ వంటి అరాచక, విధ్వంసకర పాలకుడికి ఎదురొడ్డి పోరాడి, చంద్రబాబు అద్భుత విజయం సాధిస్తారని, మిత్రపక్షాలతో కలసి 164 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తారని, నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేయడం ఆయన నైజం. 1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో ప్రవేశించాక ఇప్పటి వరకు... ఆయన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. 1995లో తెదేపాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో... సెప్టెంబరు 1న ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు దఫాలు, నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన... ఇప్పుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ రికార్డే! ఆయన సాధించిన విజయాల్ని తరచి చూస్తే... వాటి వెనుక ఎన్నో త్యాగాలు, అవిశ్రాంత కృషి, క్రమశిక్షణ కనిపిస్తాయి.


విలక్షణ రాజకీయవేత్త

ap110624main1c.jpg

సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకున్నారు. యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు. 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొందారు.  1980-83 మధ్య పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్థకశాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, చిన్ననీటి పారుదల వంటి శాఖల్ని సమర్థంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ తన కుమార్తె భువనేశ్వరితో ఆయనకు వివాహం జరిపించారు. ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించాక... తొలి ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌ తరఫున చంద్రగిరిలోనే పోటీచేసి ఓడిపోయారు. అనంతరం  తెదేపాలో చేరి తన రాజకీయ దక్షత, సునిశిత మేధతో ఎన్టీఆర్‌కు కుడిభుజంగా మారారు. ఆగస్టు సంక్షోభంలో ఆయనకు వెన్నంటి నిలిచి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించారు. 1989లో కుప్పం నియోజకవర్గానికి మారిన ఆయన అప్పటినుంచీ అప్రతిహతంగా గెలుస్తున్నారు.


అన్నేళ్లూ ఒకెత్తు... గడచిన ఐదేళ్లూ ఒకెత్తు

సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కిందపడిన ప్రతిసారీ అంతే ఉత్సాహంతో పోరాటం ప్రారంభించి మళ్లీ గెలిచి చూపించారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటి నాలుగు దశాబ్దాలు ఒకెత్తు... గడచిన ఐదేళ్లూ ఒకెత్తు. గతంలో ఎందరో కాకలు తీరిన నాయకులతో కలసి పనిచేశారు. మహామహా యోధుల్ని ఢీకొట్టారు. రాజకీయ పోరాటాలు, గెలుపోటములు ఆయనకు కొత్తకాదు. ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేని జగన్‌ వంటి నాయకుడి ఐదేళ్ల పాలనలో... చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనన్ని అవమానాలు, కక్షసాధింపులు ఎదుర్కొన్నారు. తెదేపా  నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల ఆర్థిక మూలాల్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జగన్‌ ఐదేళ్లూ విశ్వప్రయత్నం చేశారు. తెదేపా నేతలు,  కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయించారు. భౌతిక దాడులు, హింసాకాండ యథేచ్ఛగా సాగాయి. జోగి రమేష్‌ మందీ    మార్బలాన్ని వెంటేసుకుని చంద్రబాబు ఇంటిపైకే దండయాత్రకు వచ్చారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకలు దాడికి తెగబడి, విధ్వంసం సృష్టిస్తే అప్పటి ప్రభుత్వం ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు వయసు, రాజకీయ అనుభవానికి కనీస గౌరవం ఇవ్వకుండా... వైకాపా ఎమ్మెల్యేలు వెకిలి మాటలు, వ్యక్తిగత దూషణలతో చెలరేగిపోతుంటే... నిరోధించాల్సిన జగన్‌ వెకిలి నవ్వులతో ప్రోత్సహించినా ఆయన సహించారు. చివరకు అసెంబ్లీలో తన భార్య వ్యక్తిత్వాన్నే కించపరిచేలా వ్యాఖ్యలు చేసేసరికి... సహించలేక మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసి బయటకు వచ్చేశారు. ఆయనపై జగన్‌ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి...    52 రోజులు జైల్లో పెట్టినా మౌనంగా భరించారు. ఇన్ని అవమానాలు, దాడులు ఎదురైనా చెక్కుచెదరని స్థైర్యంతో పోరాడి ఈ ఎన్నికల్లో వైకాపా మూకల్ని మట్టికరిపించారు. పార్టీ చరిత్రలోనే అనన్య సామాన్యమైన  విజయాన్ని నమోదుచేసి.... మరో 40 ఏళ్లకు సరిపడా పార్టీకి అవసరమైన జవసత్వాల్ని అందజేశారు.


చేయూతలో ఆయనకు ఆయనే సాటి..

ap110624main1d.jpg

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పాలనను పరిచయం చేశారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం-పరిశుభ్రత, గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రాసంఘాల ఏర్పాటు, రైతుబజార్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్థాపించిన స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేద మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. డ్వాక్రా సంఘాల విజయ గాథలు తెలుసుకోవడానికి దేశ, విదేశీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన మహిళా ఆర్థిక స్వావలంబన గురించి బ్రిటన్‌ పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘పనిచేసే ముఖ్యమంత్రి’ అన్న పేరు చాలా త్వరగా వచ్చింది. భారీ వర్షాలు, తుపానుల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు 24 గంటల్లోపే అక్కడికి చేరుకుని పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు దగ్గరుండి పర్యవేక్షించిన ముఖ్యమంత్రిని ఆయనకు ముందు ఎవరినీ చూడలేదు. 1996లో కోనసీమను భారీ తుపాను అతలాకుతలం చేసినప్పుడు, ఆయన నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టాక హుద్‌హుద్, తిత్లీ వంటి తుపానులు ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించినప్పుడు ఆయన వారం, పది రోజులపాటు అక్కడే మకాం వేసి పరిస్థితి చక్కదిద్దాకే వెనుతిరిగారు.


అకుంఠిత దీక్ష... తిరుగులేని దార్శనికత

ap110624main1b.jpg

అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం చేసుకుంటూ పరిపాలనను పరుగులు పెట్టించారు. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్నది చంద్రబాబు తరచూ చెప్పే మాట..! చెప్పడమే కాదు... దాన్ని ఆయన ఆచరణలో చూపించారు. 2014లో రూ.16వేల కోట్ల ఆర్థిక లోటుతో, రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన... అత్యంత వేగంగా పరిస్థితులను గాడిలో పెట్టారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి భూసమీకరణ విధానంలో రెండు నెలల్లోనే 33వేల ఎకరాలు సమీకరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 2023 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని మూడు అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029కి దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. అదే సమయంలో సామాజిక పింఛన్లను రూ.2వేలకు పెంచడం, అన్న క్యాంటీన్లు, ఆదరణ వంటి కొన్ని పదుల సంక్షేమ కార్యక్రమాల్ని అమలుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండగా... రాష్ట్ర అభివృద్ధికి విజన్‌-2020 తయారుచేశారు. విద్య ఒక్కటే పేదరికాన్ని పారదోలే ఆయుధమని గ్రహించి.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంజినీరింగ్‌ కళాశాలలను ఏర్పాటుచేశారు. ఆ తర్వాత కాలంలో హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా మారడానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేలసంఖ్యలో ఐటీ నిపుణులు తయారవడానికి దోహదం చేసింది ఆ దార్శనికతే..! హైదరాబాద్‌ నగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఐటీ హబ్‌గా మార్చడంతో పాటు, ఐఎస్‌బీ, ఐఐఐటీ వంటి అనేక అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్ని ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలను ఆహ్వానించి, వారికి విందులో ఆయన స్వయంగా వడ్డించేవారు. అప్పుడే ఆయనకు రాష్ట్రానికి ‘సీఈఓ’ అని పేరు వచ్చింది. అప్పటికి పారిశ్రామిక ర్యాంకులలో 22వ స్థానంలో ఉన్న ఏపీ... ఆయన కృషి వల్ల నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆయన నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా... ఐఎస్‌బీ వంటి సంస్థలు ప్రత్యేక ఉత్సవాలకు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించాయంటే ఆయన వేసిన ముద్ర ఎలాంటిదో అర్థమవుతుంది. 


నవ్యాంధ్ర రూపశిల్పి

రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ వంటి మహా నగరాన్ని కోల్పోయి, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు లేక, ఆర్థిక లోటుతో భవిష్యత్తుపై అనిశ్చితి మేఘాలు ముసురుకున్న పరిస్థితుల్లో... రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పెద్ద దిక్కయ్యారు..! ఆయన అపార పరిపాలనా అనుభవం, దార్శనికత, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడే తపన.... రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతాయని ప్రజలు బలంగా నమ్మారు. 2014లో రాష్ట్ర పాలనా పగ్గాలు ఆయనకు కట్టబెట్టారు. చంద్రబాబు అహరహం శ్రమించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ చేసి, నిర్మాణం పరుగులు పెట్టించారు. పట్టిసీమ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేశారు. కరవు సీమ... రాయలసీమకు సాగునీరు అందించారు. పట్టుబట్టి పోలవరం ప్రాజెక్టును 70 శాతానికి పైగా పూర్తిచేశారు. గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించారు. కియా వంటి భారీ పరిశ్రమల్ని, రూ.వేల కోట్ల పెట్టుబడుల్ని తెచ్చారు. అంతర్జాతీయంగా రాష్ట్రానికి ఒక మంచి బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రాన్ని నం.1 స్థానంలో నిలిపారు. 22 మిలియన్‌ యూనిట్ల కరెంటు లోటుతో ఉన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ కలిగిన రాష్ట్రంగా మార్చారు. దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాల్లో ఒక సీఈఓలానే రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాల్ని వివరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల సదస్సులు నిర్వహించారు. కాలికి బలపం కట్టుకుని అనేక దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆయన కృషి ఫలితంగానే.. ఐటీ, ఆటోమొబైల్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి రంగాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కియా, హీరో మోటార్స్, ఇసుజు, అశోక్‌ లేలాండ్, హెచ్‌సీఎల్, ఏషియన్‌ పెయింట్స్, బెర్జర్‌ పెయింట్స్, రామ్‌కో, ఫ్లోరా సిరామిక్స్, అపోలో టైర్స్‌ వంటి అనేక పరిశ్రమలు, సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు రాష్ట్రానికి తరలి వచ్చాయి. రాష్ట్ర తలసరి ఆదాయం 15% పెరిగింది. జీఎస్‌డీపీ వృద్ధి రేటు 11.2% మేర నమోదైంది. సేవారంగంలో 29%, పారిశ్రామిక రంగంలో 9% వృద్ధి రేటు నమోదయ్యాయి.


కేంద్ర రాజకీయాల్లో మరోసారి కీలక భూమిక

దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న అతి కొద్దిమంది సీనియర్‌ నాయకుల్లో చంద్రబాబు ఒకరు. గతంలో యునైటెడ్‌ ఫ్రంట్, ఎన్డీయేలకు కన్వీనర్‌గా పలువురు ప్రధానులు, రాష్ట్రపతుల ఎంపికతో పాటు, యావత్‌ దేశాన్ని ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యభూమిక నిర్వహించిన చంద్రబాబు... ఈ ఎన్నికల తర్వాత జాతీయస్థాయిలో మరోసారి కీలక వ్యక్తిగా మారిపోయారు. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనన్ని సీట్లు భాజపాకు దక్కకపోవడంతో తెదేపా మద్దతు కీలకమైంది. ఎన్డీయే పక్షాల్లో భాజపా తర్వాత, అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ తెదేపానే కావడంతో మరోసారి దిల్లీలో చంద్రబాబు ప్రాభవం మొదలైంది. ఎన్టీఆర్‌ హయాం నుంచి చంద్రబాబుకు వివిధ పార్టీలకు చెందిన జాతీయ నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పరిస్థితుల్లో ఆయన యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు చొరవ చూపి, దానికి కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌లను ప్రధానులుగా రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో ఆయన క్రియాశీలక పాత్ర నిర్వహించారు. అప్పట్లో యునైటెడ్‌ ఫ్రంట్‌ సమావేశాలకు చంద్రబాబు బస చేసే ఏపీ భవన్‌ కేంద్రస్థానంగా ఉండేది. 1998లో కేంద్రంలో భాజపాకు తెదేపా మద్దతిచ్చింది. చంద్రబాబు కన్వీనర్‌గా ఎన్డీయే ఏర్పాటైంది. వాజపేయీ ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు కీలకపాత్ర నిర్వహించారు. ఆ ప్రభుత్వానికి బయటి నుంచే మద్దతిచ్చారు. రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలాం ఎంపికలోనూ ఆయనదే ముఖ్య భూమిక. ఎస్సీ వర్గానికి చెందిన జీఎంసీ బాలయోగిని లోక్‌సభకు స్పీకర్‌గా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా, భాజపా కలసి పోటీచేశాయి. ఈ కూటమికి జనసేన పార్టీ మద్దతిచ్చింది. తెదేపా కేంద్రప్రభుత్వంలో చేరింది. ప్రత్యేకహోదా, విభజన హామీల వంటి కొన్ని అంశాల్లో విభేదించి 2019 ఎన్నికలకు ఏడాది ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి తెదేపా వైదొలగింది. ఈసారి ఎన్నికల్లో భాజపా, జనసేనలతో పొత్తు పెట్టుకున్న తెదేపా సొంతంగా 16 లోక్‌సభ స్థానాల్ని, మిత్రపక్షాలతో కలసి 21 స్థానాల్ని గెలుచుకుంది. 


అంతర్జాతీయ ఖ్యాతి

ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబితే... వారిలోని ఆత్మవిశ్వాసాన్ని, ప్రతిభా పాటవాల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. రాజకీయ నాయకుల్లో ఐటీ జ్ఞానిగా, ఈ-గవర్నెన్స్‌ను ప్రజలకు పరిచయం చేసిన దార్శనికుడిగా ఆయనకు పేరుంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు 1998లో అమెరికాలోని ఇలినాయి గవర్నర్‌ జిమ్‌ ఎడ్గార్‌ చంద్రబాబు గౌరవార్థం సెప్టెంబరు 24వ తేదీని ‘నాయుడు డే’గా ప్రకటించారంటే ఆయన విజన్‌ను అర్థం చేసుకోవచ్చు. ఆయన సీఎంగా ఉండగానే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్, బ్రిటన్‌ ప్రధాని టోనీ బ్లెయిర్, సింగపూర్‌ ప్రధాని, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ వంటివారు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించారు. బిల్‌గేట్స్‌ వెంటపడి, ఒప్పించి మైక్రోసాఫ్ట్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించేలా చంద్రబాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే..! పలు పత్రికలు ఆయన చేసిన కృషికి అనేక బిరుదులు ఇచ్చాయి. ‘ఐటీ ఇండియన్‌ ఆఫ్‌ ద మిలేనియం’గా, ‘బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’, ‘సౌత్‌ ఏషియన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ వంటి బిరుదులతో సత్కరించాయి. అమెరికాకు చెందిన ఒరాకిల్‌ కార్పొరేషన్‌ ప్రచురించే మాసపత్రిక ప్రాఫిట్‌ చంద్రబాబును ‘హిడెన్‌ సెవెన్‌ వర్కింగ్‌ వండర్స్‌’లో ఒకరుగా అభివర్ణించింది. బీబీసీ... ‘సైబర్‌ శావీ సీఎం’ అని కొనియాడింది. సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ ‘సీఈఓ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని ప్రశంసించింది.


ఆయన చేతుల్లోనే రాష్ట్ర పునర్నిర్మాణం

ap110624main1e.jpg

విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన దగా కంటే... 2019 నుంచి ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువన్నది చంద్రబాబు తరచూ చెప్పే మాట..! జగన్‌ పాలనలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టి, రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై ఉంది. ఐదేళ్లపాటు ఆయన అలుపెరగకుండా శ్రమించినా... జగన్‌ వచ్చి ఒక్క ఛాన్స్‌ అనడంతో ప్రజలు ఆయనను నమ్మారు. చంద్రబాబు కంటే బాగా అభివృద్ధి చేస్తారేమోననుకుని 2019లో ఒక్క ఛాన్స్‌ ఇచ్చారు. ఐదేళ్ల విధ్వంసకర పాలన చూశాక.... చంద్రబాబు విలువేంటో, రాష్ట్రానికి ఆయన అవసరమేంటో గుర్తించారు. రాష్ట్ర విభజన కంటే ఐదేళ్ల జగన్‌ విధ్వంసక పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని తెలుసుకున్నారు. ఈసారి అసాధారణ సంఖ్యలో సీట్లు కట్టబెట్టి, కనీవినీ ఎరుగని మెజారిటీలతో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టారు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు చేతుల్లోనే ఉంది..! రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. జగన్‌ పాలనలో అన్ని వ్యవస్థలూ విధ్వంసమయ్యాక... ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యాక... వచ్చే ఐదేళ్లూ రాష్ట్రాన్ని పరిపాలించడం నల్లేరు మీద బండి నడక కానేకాదు. దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టడం, తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన యువతకు మళ్లీ భరోసా ఇచ్చి, ఉపాధి కల్పనకు బాటలు వేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తిచేయడం, పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసాన్ని పాదుకొల్పి పరిశ్రమల్ని తేవడం అంత ఆషామాషీ కాదు..! సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకం తప్పకుండా పాలనా రథాన్ని పరుగులు పెట్టించడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న అసలైన సవాలు..!

ap110624main1g.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...