Jump to content

Bob Interview


BabuRa0

Recommended Posts

నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి

మహేష్‌బాబు... ఈ పేరు వింటే అభిమానికి పూనకమొచ్చేస్తుంది. బాక్సాఫీసుకి కొత్త ఉత్సాహం వస్తుంది. మహేష్‌ సినిమా అంటే పరిశ్రమకి ఓ భరోసా. సగటు ప్రేక్షకుడి వినోదానికి ఓ గ్యారెంటీ. తన అందంతో, నటనతో వెండితెరకి కొత్త శోభను తీసుకొస్తుంటాడు మహేష్‌. భాష తెలిసినా తెలియకపోయినా మహేష్‌ సినిమా చూడాల్సిందే అంటూ థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకులూ ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు వసూళ్ల పండగ చేసుకొంటాయి. ‘శ్రీమంతుడు’తో ఇంటిల్లిపాదినీ అలరించిన ఆయన ‘బ్రహ్మోత్సవం’తో ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సందర్భంగా మహేష్‌బాబుతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ...

15tollywood6a.jpg

‘బ్రహ్మోత్సవం’తో వేసవినే లక్ష్యంగా చేసుకొని వస్తున్నట్టున్నారు... 
అవునండీ...ఈ సినిమాని వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మొదట్లోనే నిర్ణయించాం. నిజానికి ఏప్రిల్‌లోనే విడుదల చేయాలి. చిత్రీకరణ సమయంలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురయ్యాయి. చాలామంది నటులున్న సినిమా ఇది. అనుకొన్న సమయానికి అనుకున్నట్టుగా ఓ సన్నివేశం చేయలేకపోయినా మళ్లీ ఆ నటుల కాల్షీట్లన్నీ దొరకడానికి చాలా సమయం పట్టేది. అలా ఈ సినిమా కాస్త ఆలస్యమైందంతే. ఈ నెల 20 కూడా మంచి సమయమే.

ఇటీవల కుటుంబ కథలపైనే దృష్టిపెట్టినట్టు అనిపిస్తోంది. ఆ విషయంలో ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికలున్నాయా? 
ప్రణాళికలు వేసుకొని సినిమాలు చేయడం నాకు అలవాటు లేదు. దేవుడి ఆశీర్వాదంతోనే ‘బ్రహ్మోత్సవం’ చేశాననుకొంటున్నా. ‘శ్రీమంతుడు’ చిత్రీకరణ సమయంలోనే ఈ కథ విన్నా. బాగా నచ్చింది. ‘శ్రీమంతుడు’లాంటి ఓ మంచి సినిమా తర్వాత మరోసారి బలమైన కథ నాకు దొరకడం అదృష్టం. ‘బ్రహ్మోత్సవం’కు ఇంత స్పందన వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ప్రచార చిత్రం విడుదలైనప్పట్నుంచి ప్రేక్షకులు మరింత ఆసక్తిగా సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఆ విషయంలో నేను చాలా ఆనందంగా ఉన్నా.

మొన్నటివరకు కుటుంబ కథ అనగానే కాలం చెల్లిన జోనర్‌ అని పెదవి విరిచేవారు. ఈమధ్య ఆ తరహా కథలకే పట్టం కడుతున్నారు. ఈ మార్పు ఎలా ఉంది? 
కుటుంబ కథలు చాలా శక్తిమంతమైనవి. కాస్త వెనక్కి వెళ్లి చూస్తే మన తెలుగులో ఎన్నో క్లాసిక్స్‌ కనిపిస్తాయి. అలాంటి కథలకి కాలం చెల్లడమంటూ ఉండదు. కాకపోతే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు ముందు కొంతకాలం కుటుంబ అనుబంధాలతో కూడిన కథలేవీ తెరపైకి రాలేదు. అంతా యాక్షన్‌ పంథాలోనే కథల్ని వండేవారు. కానీ ‘సీతమ్మ...’లాంటి సినిమా తర్వాత మంచి కథయితే చాలు, కుటుంబ కథల్నీ ప్రేక్షకులు ఆదరిస్తారన్న విషయం అర్థమైంది. ‘బ్రహ్మోత్సవం’ కుటుంబ కథల్లోనే మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది.

మీ సినీ ప్రయాణంలో యాక్షన్‌, కుటుంబ కథల్లోనూ మెప్పించారు. ఏ జోనర్‌ సంతృప్తినిచ్చింది? 
సినిమా ప్రయాణంలో ప్రతి నటుడికి మైలురాయిల్లాంటి కొన్ని సినిమాలుంటాయి. ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’... ఇవన్నీ నా కెరీర్‌కి మైలురాళ్లు. ఆ సినిమాలకి ముందు, తర్వాత అని నా కెరీర్‌ని చూసుకోవచ్చు. ‘శ్రీమంతుడు’ ఒక శక్తిమంతమైన సినిమా. అది ఎప్పుడు గుర్తుకొచ్చినా గర్వంగా అనిపిస్తుంటుంది. అలాంటి ఓ కుటుంబ కథ పెద్ద విజయం సాధించడం ఒకెత్తైతే, అందులోని సందేశం అందరికీ చేరువైందన్న విషయం మరింత ఆనందాన్నిస్తుంటుంది. నేను చేసిన ప్రతి సినిమా నాకు సంతృప్తినిస్తుంది.

కథల ఎంపికలో మీ ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది? 
చేసే కథలో వాణిజ్యాంశాలు ఉండాలి. అదే సమయంలో ఆ కథతో నటుడిగా నేనూ ఎదగాలి. లేదంటే తెరపై నాకు నేనే బోర్‌ కొట్టేస్తా. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కథల్ని ఎంచుకొంటుంటా.

శ్రీకాంత్‌ అడ్డాల కథలు సున్నితమైన అంశాల చుట్టూ తిరుగుతుంటాయి. ఆయన శైలికి మీరు బాగా దగ్గరైనట్టున్నారు... 
నేనే కాదండీ, 80 శాతం మంది ప్రేక్షకులు శ్రీకాంత్‌ అడ్డాలగారి కథలు, ఆలోచనల్లో తమని తాము చూసుకుంటున్నారు. నిజ జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన కథల్ని రాస్తుంటారు. ఆయన్నుంచి వచ్చే ప్రతి ఆలోచనలోనూ ఓ ఆత్మ, సహజత్వం కనిపిస్తుంటుంది. చిన్న చిన్న విషయాల్నే చాలా అందంగా చూపిస్తుంటారు. ఆధునిక జీవితంలో మనం మరిచిపోయిన విషయాల్ని ఆయన తన కథలతో మరోసారి గుర్తు చేస్తుంటారు. ఆ విలువలే నాకు బాగా నచ్చుతుంటాయి.

‘బ్రహ్మోత్సవం’తో ఏం చెప్పబోతున్నారు? 
ఆధునిక జీవితంలో కుటుంబాలు చిన్నవైపోయాయి. అందరూ కలుసుకుంటే ఓ ఉత్సవంలా ఉంటుంది కదా అనే చెబుతున్నాం. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఒక రకమైన ఆనందానుభూతికి గురవుతారు. ఇందులోని భావోద్వేగాలన్నీ ప్రేక్షకులకు చేరువవుతాయని నా నమ్మకం.

ఇందులో నటించేటప్పుడు మీ కుటుంబం గుర్తుకొచ్చిందా? 
కుటుంబం ఎప్పుడూ గుర్తుకొస్తుంటుంది. కానీ ప్రత్యేకంగా కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి. ఇందులో కుటుంబమంతా కలిసి విహారం కోసం వూటీకి వెళ్లే ఓ సన్నివేశం ఉంటుంది. అందరూ కలిసి రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తుంటారు. అంతమంది నటులతో కలిసి ఆ సన్నివేశం చేసేటప్పుడు నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. ఇలాంటివి ఎంత ప్రత్యేకమైన సందర్భాలో కదా అనిపించింది.

మీ కుటుంబ సభ్యులు కూడా అలా కలుసుకుంటుంటారా? 
క్రమం తప్పకుండా కలుసుకుంటుంటాం. ఆ క్షణాల్లో ఓ మంచి అనుభూతి కలుగుతుంటుంది. అక్కడ మాట్లాడుకునేది అన్నీ చిన్న విషయాలే. అయినా అదో ఆనందం.

ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో మీ కుటుంబమంతా ఒక చోట కలుస్తుంటుంది? 
ఖాళీ దొరికినప్పుడు లంచ్‌కి కలుస్తుంటాం. భోజనం చేసి అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటాం. ఇక వేడుకలు ఏవైనా ఉంటే వాటికి తప్పనిసరిగా అందరం హాజరవుతుంటాం.

మీ పిల్లలు గౌతమ్‌, సితారలకి మీ ఇంట్లో ఎవరితో అనుబంధం ఎక్కువ? 
వాళ్ల నానమ్మ దగ్గరికి వారానికొకసారైనా తీసుకెళ్లాల్సిందే. అక్కడే ఆడుకొని వస్తుంటారు.

మీరు చెప్పులు తొడుగుతున్నట్టుగా ఓ ప్రచార చిత్రం బయటికొచ్చింది. ఆ సన్నివేశం ఏ సందర్భంలో వస్తుంది? ఆ ఆలోచన విన్నప్పుడు మీకేమనిపించింది? 
దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఆ ఆలోచన చెప్పగానే వెంటనే కనెక్ట్‌ అయిపోయా. తండ్రికి చెప్పులు తొడిగి ఆశీర్వాదం తీసుకొనే సన్నివేశమది. అది తెరపై చాలా బాగుంటుంది. ఆ సన్నివేశం తీసేటప్పుడు అందరికీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తెరపై చూసినప్పుడూ అదే అనుభూతి కలుగుతుంది.

మీ నాన్నగారికి ఈ సినిమా చూపించబోతున్నారా? 
నాన్నతో కలిసి సినిమా చూడాలంటే నాకు భయం. ఆయన నాకు చెప్పకుండానే సినిమా చూసేస్తారు. చూశాక ఆయనే నాకు ఫోన్‌ చేస్తుంటారు. ఆ ఫోన్‌ కాల్‌ కోసం ఎదురు చూస్తుంటా.

ఈ సినిమా నిర్మాణంలో మీరూ ఓ భాగస్వామి. కథానాయకుడు నిర్మాతైతే సౌలభ్యాలేంటి? 
కథానాయకుడు సినిమా నిర్మాణ వ్యవహారాల్లో భాగం పంచుకోవడం మంచిదే. అదో మంచి పరిణామం. నిర్మాణ వ్యవహారాలు మన నియంత్రణలో ఉంటాయి. అయితే మంచి కథ అనుకొంటేనే నేను నిర్మాణంలో భాగస్వామినవుతా. కథ వింటున్నప్పుడే ఆ నిర్ణయం జరిగిపోతుంటుంది. ప్రస్తుతానికి మంచి నిర్మాణ సంస్థలతో కలిసి భాగం పంచుకొంటున్నా, భవిష్యత్తులో సమయం దొరికితే పూర్తిస్థాయిలో సినిమా నిర్మాణం చేపడతా.

మీ నిర్మాణ సంస్థ ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి సంబంధించిన వ్యవహారాలన్నీ నమ్రత చూసుకొంటున్నట్టున్నారు కదా...? 
ఆ విషయంలో నమ్రతకి కృతజ్ఞతలు చెప్పాలి. నిర్మాణ వ్యవహారాలతో పాటు, సినిమా ప్రచార వ్యవహారాలన్నిటినీ తనే చూసుకొంటుంది. నా బాధ్యత కేవలం మంచి కథల్ని ఎంచుకోవడం, సెట్‌కి వెళ్లి నటించి రావడమంతే (నవ్వుతూ).

కథానాయకులంతా గేరు మార్చి వేగంగా సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నారు. దానికి తగ్గ సంఖ్యలో దర్శకులున్నారా? వాళ్లూ స్పీడు పెంచాల్సిన అవసరం ఉందా? 
పరిశ్రమలో ప్రతిభావంతులైన దర్శకులు చాలామంది ఉన్నారు. నాకైతే ఎప్పుడూ దర్శకుల కొరత రాలేదు. రెండు మూడేళ్ల వరకూ నేను బిజీ. అంతమంది దర్శకులు నాకు కథలు వినిపించారు.

ఇది వరకు రెండేళ్లకు ఓ సినిమా చేసేవారు... ఇప్పుడు పూర్తిగా పద్ధతి మార్చినట్టేనా? 
మధ్యలో ఓసారి గ్యాప్‌ వచ్చింది. ఆ తరవాత స్పీడు పెంచా. అయితే ఇదివరకు ఓ సినిమా చేసిన తరవాత మరో సినిమా ఒప్పుకొనేవాణ్ని. ఇప్పుడు ఓ సినిమా సెట్‌పై ఉండగానే మరో కథ ఓకే అయిపోతోంది. మంచి కథలు రావడంతోనే.. వేగంగా సినిమాలు చేయగలుగుతున్నా.

ఈ మధ్య సమంత మాట్లాడుతూ ‘సితార పెద్ద హీరోయిన్‌ అయిపోతుంది’ అన్నారు. మీ అమ్మాయిలో ఆ లక్షణాలు మీకూ కనిపిస్తున్నాయా? 
తను సరదాగా అందేమో? సితార చిన్న పిల్ల. తను ఏం అవుతుందో అప్పుడే ఎలా చెప్పగలం. కానీ చాలా హుషారుగా ఉంటుంది. పాటలు పాడుతుంది.

మురుగదాస్‌తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతోంది? 
మురుగదాస్‌ నా అభిమాన దర్శకుడు. ‘గజిని’ నుంచే ఆయనతో ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నా. నా ‘ఒక్కడు’ సినిమా అంటే ఆయనకు బాగా ఇష్టం. ‘శ్రీమంతుడు’ ప్రచారంలో భాగంగా ఓసారి చెన్నై వెళ్లా. అప్పుడు మురుగదాస్‌ని కలిశా. ఆయన ఓ లైన్‌ చెప్పారు. చాలా బాగా నచ్చింది. ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. ‘బ్రహ్మోత్సవం’ తరవాత 15 రోజులు విశ్రాంతి తీసుకొని చిత్రీకరణ మొదలెడతాం.

24 కథ విక్రమ్‌ కె.కుమార్‌ మీకు చెప్పినప్పుడు ‘ఇది సూర్యకి అయితే బాగుంటుంది’ అని మీరే సలహా ఇచ్చారట.. 
నేనేం సలహా ఇవ్వలేదు. కొన్ని కథలు తమకు తగ్గ వ్యక్తుల్ని వెదుక్కొంటూ వెళ్తాయి. అలా ‘24’ సూర్యని వెదుక్కొంటూ వెళ్లింది. నాకు ఆ కథ బాగా నచ్చింది. కాకపోతే కథ చెబుతున్నప్పుడు నన్ను నేను తెరపై చూసుకోలేకపోయా. మొన్నే ‘24’ సినిమా చూశా. సూర్య మాత్రమే ఆ కథ చేయగలరు అనిపించింది.

‘మనం’ ‘క్షణం’, ‘వూపిరి’, ‘24’ లాంటి సినిమాల ఫలితాలు చూసినప్పుడు మన ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారిందేమో అనిపిస్తుంటుంది. మీరూ అలానే అనుకొంటున్నారా? 
ప్రేక్షకులు రోజురోజుకీ మారుతున్నారు. వాళ్లకు ఏదైనా సరే కొత్తగా చెప్పాలి. అందుకే ఫ్రెష్‌ సినిమాలొస్తున్నాయి. మరీ సినిమాటిక్‌గా ఉన్న సన్నివేశాల్ని అస్సలు చూడడం లేదు. బీ, సీ సెంటర్లతోపాటు, మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులకు నచ్చేలా కథల్ని ఎంచుకొంటే అద్భుతాలు సృష్టించొచ్చు. ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలే అందుకు ఉదాహరణ. అలాగని ఓ సెక్షన్‌ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేస్తూ సినిమాలు తీయలేం. మంచి కథ ఎంచుకోవడం ఒక్కటే మన చేతుల్లో ఉంది.

ఈమధ్య బుర్రిపాలెం వెళ్లారు. అక్కడి స్పందన చూస్తే ఏమనిపించింది? 
అంతమంది జనాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఆనందంతో మాటరాలేదు. అక్కడికి మళ్లీ వెళ్లాలనిపిస్తోంది. బుర్రిపాలెంలో చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టాం. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో కలసి సంక్షేమ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేయాలనుకొంటున్నాం.

‘బ్రహ్మోత్సవం’ ప్రచార చిత్రాల్ని చూస్తుంటే మహేష్‌ పదేళ్లు వెనక్కి వెళ్లాడేమో అనిపిస్తోంది..అంటున్నారు! 
ఆలోచనలు బాగుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఆ ప్రభావం మన ముఖంలో కనిపిస్తుంది. ఆందోళనల్ని నా దగ్గరకు రానివ్వను. అందుకే అలా కనిపిస్తున్నానేమో?

ఓ పుస్తకం చదివి ధూమపానం మానేశా అని అప్పట్లో అన్నారు. అలా మీలో మార్చుకోవాల్సిన లక్షణాలేమైనా ఇంకా ఉన్నాయా? 
జీవితం ఓ ప్రయాణం. ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదు. రోజూ మనల్ని మనం మార్చుకొంటూనే ఉండాలి. ‘మనం మారిపోవాలి’ అనుకొంటే కుదరదు. అదో ప్రోసెస్‌. కాలమే మనల్ని మారుస్తుంటుంది. 


ఓ చిన్న గీత ఉంటుంది 
15tollywood6b.jpg

‘‘మన ప్రేక్షకులు తాజాదనంతో కూడిన కథల కోసం వెదుకుతున్నారు. అవి అందిస్తే సరిపోతుంది. మరీ బుర్రకి పదును పెట్టేంత ప్రయోగాల్నేం కోరుకోవడం లేదు. ప్రయోగం పేరుతో గందరగోళానికి గురిచేస్తే తిరస్కారానికి గురికాక తప్పదు. ప్రయోగానికీ, రొటీన్‌ సినిమాలకీ మధ్య ఓ చిన్న గీత ఉంటుంది. అది గమనించి వెళ్లాలి. ‘బాహుబలి’ ఉందనుకోండి అది కొత్త ఆలోచన. ‘శ్రీమంతుడు’ కమర్షియల్‌ ఫార్మాట్‌ కథని కొత్తగా చెప్పిన చిత్రం. ఇలాంటివి తెలుగు ప్రేక్షకులు కోరుకొంటున్నారు’’. 


ప్రతి మూణ్నెళ్లకి...

‘‘సినిమా వ్యాపారంలో ప్రతి మూణ్నెళ్లకి మార్పులు చోటు చేసుకొంటున్నాయి. సినిమా పరిధి రోజు రోజుకీ విస్తృతమవుతోంది. మన దగ్గరే కాదు, హిందీలోనూ అలాగే ఉంది. థియేటర్లు పెరుగుతున్నాయి. జనం పెరుగుతున్నారు. ‘బాహుబలి’ లాంటి సినిమాలతో ఇంటికి పరిమితమైన ప్రేక్షకులు మళ్లీ బయటికొచ్చారు. వాళ్లంతా ఇప్పుడు కొత్త సినిమాలేమున్నాయా? అని బాక్సాఫీసువైపు చూస్తున్నారు. ఇంతకంటే మంచి పరిణామం ఏముంటుంది?’’ 


షారుఖ్‌ విస్మయ పరిచారు 
15tollywood6c.jpg

‘‘బ్రహ్మోత్సవం’ చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్నప్పుడు సెట్‌కి షారుఖ్‌ ఖాన్‌ రావడం మా అందరికీ షాక్‌. పదినిమిషాలు మాట్లాడి వెళ్లారు. సెట్లో అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఓ సూపర్‌ స్టార్‌ అంతలా ఒదిగి ఉండడం విస్మయపరిచింది. 


వారం ఆగి చెప్పను

‘‘ఓ కథ నాకు నప్పుతుందో లేదో అనుభవం ద్వారా తెలిసిపోతుంది. నేను కనెక్ట్‌ అయిన కథలనే చేస్తా. అలాగని ఎలాంటి సినిమాలు చేయాలో తెలిసిపోయింది అని చెప్పను.. కొన్ని తప్పులు చేస్తాం. కానీ ఇప్పటి వరకూ నేను నమ్మిన కథల్నే ఒప్పుకొన్నా. ఓ కథ వింటున్నప్పుడు చేయాలా, వద్దా అనేది అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకొంటా. ‘ఓ వారం ఆగి చెప్తా’ అనే మాటే ఉండదు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...