Jump to content

1st anniversary


tom bhayya

Recommended Posts

ఇంకా తేలని ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం.... మెల్లమెల్లగా నీరుగారిపోతున్న కేసు
 

  •  శాసన మండలి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు టీడీపీ వ్యూహం
  •  150 కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర
  •  నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం
  •  లంచం అడ్వాన్స్‌గా ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్‌రెడ్డి
  •  చంద్రబాబు స్వయంగా సాగించిన బేరసారాల ఆడియోలూ బహిర్గతం
  •  అనంతరం సీఎం కేసీఆర్, చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం
  •  చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడన్న కేసీఆర్
  •  కేసీఆర్.. ఖబడ్దార్ అంటూ విరుచుకు పడిన చంద్రబాబు
  •  కానీ కొద్ది కాలానికే స్తబ్దుగా మారిపోయిన ‘ఓటుకు కోట్లు’ కేసు
  •  తెలంగాణలో ఎమ్మెల్యేల ఓట్లకు కోట్లు చెల్లిస్తూ దొరికినా కేసు ముందుకు
  •  నడవకపోవడంతో మరింత రెచ్చిపోయిన చంద్రబాబు
  •  ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ఎమ్మెల్యేలనే కళ్లు తిరిగే రేట్లతో కొంటూ బరితెగింపు
  • పదవులే పరమావధిగా, అడ్డదారిలోనైనా సరే గెలవడమే లక్ష్యంగా, నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీ పాల్పడిన ‘ఓటుకు కోట్లు’ కుట్రకు ఏడాది నిండుతోంది. రూ.150 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన ఆ దుర్మార్గపు ప్రయత్నాన్ని అవినీతి నిరోధక శాఖ విజయవంతంగా ఛేదించింది. శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని.. అడ్వాన్స్ ఇస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసింది. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు చంద్రబాబు పాల్పడిన దిగజారుడు రాజకీయాలను బట్టబయలు చేసింది.
     
     అదే సమయంలో స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు నేరుగా మాట్లాడిన ఆడియో రికార్డులూ బహిర్గతమయ్యాయి. ఆ ఆడియోలు వాస్తవమైనవేనని, అందులో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరించింది. ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేసిన ఏసీబీ పకడ్బందీ ఆధారాలతో చార్జిషీటు దాఖలు చేసింది. అందులో ప్రతి రెండు వాక్యాలకు ఒకసారి చంద్రబాబు పేరును ప్రస్తావించింది. అనుబంధ చార్జిషీటు దాఖలు చేస్తామనీ కోర్టుకు చెప్పింది. కానీ ఇంత పకడ్బందీగా ఉన్న కేసు ఆ తర్వాత అక్కడే ఆగిపోయింది. ‘ఖబడ్దార్.. కేసీఆర్.. నేను కళ్లు తెరిస్తే నీకు కష్టాలు తప్పవు’ అంటూ దుమ్మెత్తి పోసిన చంద్రబాబు... ‘పట్టపగలే దొరికిన దొంగవు నువ్వు.. చంద్రబాబూ బ్రహ్మదేవుడు కూడా నిన్ను కాపాడలేడు..’ అంటూ విరుచుకుపడిన కేసీఆర్ ఆ తర్వాత శాంతించారు.
     
     అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ఇంటికి వచ్చారు. చండీయాగానికి ఆహ్వానించేందుకు కేసీఆర్ స్వయంగా విజయవాడలోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు.. అటు వీడియోలు, ఆడియోలు సహా సాక్ష్యాలన్నీ కళ్లముందే కనిపిస్తున్నా.. ‘ఓటుకు కోట్లు’ కేసు ముందుకు కదలడం లేదేమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు దీని వెనుక ఉన్న మర్మమేమిటని నిలదీస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఎమ్మెల్యేల ఓట్లను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల సాక్షిగా దొరికిపోయినా ఎటువంటి శిక్షా పడకపోవడంతో చంద్రబాబు మరింతగా రెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి తెగించారు.
     
     ఒక్కో ఎమ్మెల్యేకు ఇరవై నుంచి ముప్పై కోట్లు చెల్లిస్తూ.. ఇప్పటికే 17 మందిని కొనుగోలు చేశారు. మరింత మందిని కొనుగోలు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు కొన్ని వందల, వేల కోట్ల డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారని నిలదీయలేకపోవడం మన సమాజ దౌర్బల్యం. దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయినా జైల్లో పెట్టలేకపోయిన మన అశక్తతకు సిగ్గుపడదాం. రెండేళ్లలో లక్ష కోట్లకుపైగా అవినీతికి పాల్పడి వేలకోట్ల రూపాయలతో ప్రజాస్వామ్యాన్ని చెరబడుతున్న ఒక హీన చరిత్ర ఇప్పుడు నడుస్తోంది.

     
     
    కుట్రకు బీజం పడింది మహానాడులోనే..
    శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొనేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నింది. టీడీపీ పెద్దలు ఏటా నిర్వహించే మహానాడు వేదికగానే కుట్రకు బీజం పడింది. ఈ వ్యవహారంలో భాగస్వాములైన వ్యక్తుల ద్వారానే ఈ విషయం వెల్లడైంది. మహానాడు పనుల కంటే ఎమ్మెల్యేల కొనుగోలే ముఖ్యమని తమ పార్టీ నేత సెబాస్టియన్‌తో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పిన విషయాలు వెలుగు చూశాయి.

    ‘ఓటుకు కోట్లు’ వ్యవహారాన్ని పక్కాగా అమలు చేసే కుట్రలో పార్టీ ‘బిగ్ బాస్’ నుంచి చిన్నాచితకా నాయకుల దాకా భాగం పంచుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా ఎమ్మెల్సీ స్థానం నెగ్గాక... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్నే పడగొట్టే కుటిలయత్నానికి వ్యూహ రచన చేశారు. అందుకోసం భారీగా డబ్బు సమకూర్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో బేరసారాలూ మొదలుపెట్టారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు.
     
     రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్
    ఎమ్మెల్యేల కొనుగోలు కోసం టీడీపీ బిగ్‌బాస్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బరిలోకి దిగారు. తొలుత నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి బేరసారాలు చేశారు. అయితే వారి వలకు చిక్కని స్టీఫెన్‌సన్ టీడీపీ నేతల కుటిల యత్నాలపై ఏసీబీకి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు... ఈ వ్యవహారంలో పెద్ద పెద్ద వారు ఉండడంతో రెడ్ హ్యాండెడ్‌గా బహిర్గతం చేయాలని నిర్ణయించారు. 

    మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేసేందుకు రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. రేవంత్ వచ్చి స్టీఫెన్‌సన్‌తో బేరసారాలు సాగించారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఏం కావాలన్నా చూసుకుంటామంటూ ఆశ చూపారు. అంతేకాదు ఏపీలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఎంపిక ఇంకా పూర్తికాలేదని, ఏమైనా తేడా జరిగితే అక్కడ అవకాశం కల్పిస్తామనీ ప్రలోభపెట్టారు. ఏ చిన్న అవసరమొచ్చినా చేసి పెడతామని ఆశ చూపారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరే నేరుగా కూర్చోబెట్టి మాట్లాడిస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏసీబీ ఏర్పాటు చేసిన రహస్య కెమెరాల్లో రికార్డయ్యాయి.
     
     ‘బ్రీఫ్’ చేసిన చంద్రబాబు
    ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగినట్లు అనేక సందర్భాల్లో రుజువైంది. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ.. మీకేం ఫర్వాలేదు’ అని భరోసా కల్పించారు. ఈ సంభాషణల ఆడియో టేపులు సైతం బహిర్గతమయ్యాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సైతం ఆ ఆడియో టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబుదేనని నిర్ధారించింది. ఇక ఈ ‘ఓటుకు కోట్లు’ ఆపరేషన్‌ను విజయవంతం చేసేందుకు చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్ సైతం ప్రయత్నించినట్లు పలు అంశాల ఆధారంగా వెలుగు చూసింది. దాంతో లోకేశ్ డ్రైవర్, వ్యక్తిగత, సన్నిహిత వ్యక్తులను ఏసీబీ విచారించింది కూడా.
     
     మత్తయ్యకు టీడీపీ అండ
     ‘ఓటుకు కోట్లు’ కేసులో నాలుగో నిందితుడు, టీడీపీకి సన్నిహితంగా ఉండే జెరూసలెం మత్తయ్య వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ను ప్రలోభపెట్టేందుకు మధ్యవర్తిగా మత్తయ్య వ్యవహరించాడని ఏసీబీ స్పష్టం చేసింది. రేవంత్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగానే మత్తయ్య హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ విజయవాడ సిటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ నేతలు తనను బెదిరిస్తున్నారని, చంపుతామంటూ ఫోన్లు వస్తున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

    తర్వాత చాలా రోజులు అక్కడే ఉండి.. ఏదో స్టేట్‌మెంట్ ఇస్తూ వచ్చారు. ఏసీబీ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరిగారు. ఇక ఏసీబీకి మత్తయ్య దొరికితే చాలా ఇబ్బందులొస్తాయని గ్రహించిన టీడీపీ నేతలు ఆయనను రక్షించే పనిలో పడ్డారు. తనపై తెలంగాణ ఏసీబీ అధికారులు పెట్టిన కేసు కొట్టేయాలంటూ మత్తయ్యతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై వాదనలు వినిపించేందుకు ఏకంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదినే రంగంలోకి దింపారు. వాదనలు విన్న హైకోర్టు.. మత్తయ్య అరెస్టుపై స్టే విధించింది. అయితే ఈ సమయంలో హైకోర్టులో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు మత్తయ్య పిటిషన్‌పై ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్ జరిగేంత వరకు వెళ్లింది. వాదనలు విన్న న్యాయమూర్తి గత నెలలో తీర్పును వాయిదా వేశారు.
     
     వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఏసీబీ
    ‘ఓటుకు కోట్లు’ కుట్రను ఏసీబీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఛేదించింది. రహస్య కెమెరాలు అమర్చి పక్కాగా సాక్ష్యాధారాలను సేకరించగలిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు అమల్లోకి వస్తూనే రంగంలోకి దిగిన ఏసీబీ.. ఎక్కడా చిన్న అనుమానం రాకుండా ఆపరేషన్‌ను విజయవంతం చేసింది. స్టీఫెన్‌సన్‌ను రేవంత్, ఆయన అనుచరులు కలసి అడ్వాన్స్‌గా లంచం చెల్లించడాన్ని రహస్య కెమెరాల్లో రికార్డు చేసింది.

    ఆ కుట్ర కోణాలను బహిర్గతం చేసింది. కేసు విచారణ సందర్భంగా నిందితులను, అనుమానితులను రకరకాల కోణాల్లో విచారించి.. అవసరమైన సమాచారాన్ని రాబట్టింది. దాదాపు వంద మందికి పైగా స్టేట్‌మెంట్లు రికార్డు చేసింది. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత దాదాపు మూడు నెలల పాటు రోజూ పత్రికల్లో విస్తృత స్థాయిలో కథనాలు వచ్చాయి.

    కానీ క్రమంగా ఏసీబీ వేగం తగ్గిపోయింది. ఈ కేసులో ఏం జరుగుతోందో కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది. మారిన రాజకీయ పరిస్థితులే దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసు ఇక మూలనపడినట్లేనా, లేక ‘బిగ్‌బాస్’ల పూర్తి వ్యవహారాలు వెలుగులోకి వచ్చి న్యాయస్థానం ముందు నిలబడతారా? అనే దానిపై అధికారులే సమాధానం చెప్పలేకపోతున్నారు.
     
     
    ఖబడ్దార్.. కేసీఆర్
     నాకూ ఏసీబీ ఉంది.. పోలీసులున్నారు: చంద్రబాబు
     ‘‘ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక.. అసమర్థుడైన తెలంగాణ సీఎం కేసీఆర్ నాపై కుట్రపన్నుతున్నాడు. నేను నీతివంతంగా బతికాను. ప్రజాసేవ కోసం జీవిస్తున్నాను. కానీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలు ఓర్వలేని తనంతో నాపై కుట్ర రాజకీయాలు జరుపుతున్నాయి. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారు. కేసీఆర్ ఖబడ్దార్.. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని.

       నీకెంత హక్కుందో.. నాకూ అంతే హక్కుంది. ఖబడ్దార్ గుర్తుంచుకో.. స్టింగ్ ఆపరేషన్ల పేరుతో ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేయడం నీచాతి నీచం. నేను కూడా ముఖ్యమంత్రిని అని తెలియదా..? నీకు ఏసీబీ ఉంది. మాకు ఏసీబీ ఉంది. మీ ఏసీబీ హైదరాబాద్‌లో ఉంది. నా ఏసీబీ కూడా హైదరాబాద్‌లోనే ఉంది. 

    మీ పోలీసులు హైదరాబాద్‌లో ఉంటే.. నా పోలీసులు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మా ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్‌ను నీ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి డబ్బులిచ్చి సిగ్గులేకుండా పోలీసు భద్రతతో పంపావు. మంత్రి పదవి కట్టబెట్టి ప్రమాణం చేయించావ్. ఎవరు లాలూచీ పడింది? నాకు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేనెందుకు లాలూచీ పడతాను? హైదరాబాద్‌లో ఆంధ్రవాళ్ల ఇళ్లు కూల్చి వేయడానికి ఈ పెద్ద మనిషి (కేసీఆర్) సిద్ధమయ్యాడు. 

    నన్ను బెదిరిస్తున్నారు. నగరానికి వస్తే దాడులు చేస్తామంటున్నారు. బెదిరింపులకు భయపడను. హైదరాబాద్‌లో సెక్షన్-8 అమల్లో ఉండగా.. నాఫోన్ ట్యాప్ చేయడానికి, నాపై పెత్తనం చేయడానికి మీరెవరు? ఫోన్లో ఏవేవో మాట్లాడుకుంటాం. అవన్నీ ట్యాప్ చేస్తే కడుపు మండదా? పదేళ్ల పాటు హైదరాబాద్‌లో గౌరవంగా బతికే అధికారం మాకుంది. కాదనే అధికారం తెలంగాణకు ఎక్కడిది? గవర్నర్ నిర్ణయించాలి. 

    నేను కళ్లు తెరిస్తే కేసీఆర్‌కు కష్టాలే..! రాష్ట్రాల మధ్య తగాదాలు వద్దు. కాదని మొండికేస్తే విషయం చాలా దూరం వెళ్తుంది. నీకు (కేసీఆర్) ఎన్ని అధికారాలు ఉన్నాయో... నాకూ అన్ని అధికారాలున్నాయి. మంచికి మంచిగా ఉంటా. చెడు తలపెడితే ఊరుకోం. సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క అస్త్రం వదులుతాం..’’
     - గత ఏడాది జూన్ 8న గుంటూరులో కేసీఆర్‌కు చంద్రబాబు చేసిన హెచ్చరికలివి

     
     బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు
     పట్టపగలే దొరికిన దొంగ చంద్రబాబు: కేసీఆర్
     ‘‘చంద్రబాబూ.. లఫంగితనంతో ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి, రాజకీయాలను చెడగొట్టి భ్రష్టుపట్టించే పనిచేసినవ్.. తెలంగాణ బిడ్డ స్టీఫెన్‌సన్ నీ దుర్మార్గాన్ని బయటపెట్టిండు. ఇప్పుడు నీ ఎమ్మెల్యే (రేవంత్) జైల్లో ఉన్నడు. నీ చరిత్ర బయటకొస్తున్నది. నువ్వు ఫోన్లో మాట్లాడింది బయటపడింది. పట్టపగలు దొరికినా నీ అరుపులతో ఏదో చేయాలనుకుంటున్నవ్. నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. నిన్ను ఎవడూ కాపాడలేడు. ఎక్కువగా మాట్లాడితే నీకే శాస్తి జరగాల్నో అదే జరుగుతది. 

      తనను అన్యాయంగా ఇరికించిండ్రని చంద్రబాబు అంటున్నడు. ఇరికిస్తే ఇరికే మనిషివా నువ్వు చంద్రబాబూ? కొంపలు కూల్చెటోడివి నువ్వు. నీ మీద అన్యాయంగా కేసు పెట్టారా.. పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి మా రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కుంటుంటే చేతులు ముడుచుకు కూర్చోవాలా? పట్టపగలే దొంగతనం చేస్తూ దొరికినోడిని దొంగ అనొద్దంట.. పట్టుకోవద్దంట. పట్టపగలే దొరికిన దొంగ నువ్వు. నిన్ను ఇరికించే ఖర్మ మాకెంటి? రామేశ్వరం పోయినా శనేశ్వరం వదల్లేదన్నట్టు.. ఈ దిక్కుమాలిన దందా మాకొద్దన్నా... ఆనాడు కాంగ్రెస్ సన్నాసులు ఒప్పుకోవడం వల్ల హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధాని చేసిండ్రు. 

    కేసీఆర్‌కు ఎంత హక్కు ఉందో హైదరాబాద్‌పై తనకూ అంతే హక్కుంటదని బాబు అంటున్నడు. హైదరాబాద్ నీ అబ్బ జాగీరా..  నీ తాతదా.. హైదరాబాద్‌కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి.. హైదరాబాద్‌లో నీ ఏసీబీ ఉండదు. నగ్నంగా, పచ్చిగ దొరికినవ్. అట్ల దొరికి కూడా అరిచి, పెడబొబ్బలు పెట్టి భయపెట్టాలనుకుంటున్నవా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెల్సు నీ బతుకేందో... నీ రాజకీయాలేందో! నీ లుచ్చా, లత్కోరు పనేందో దేశానికి తెలిసిపోయింది. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు. తెలంగాణ ప్రజానీకమే నీకు శాస్తి చేస్తుంది. నీకు కూడా ఏసీబీ ఉందంటున్నవు. కానీ కేసీఆర్ నీ లెక్క దొంగ కాదు.. నీ లాగా దొంగ రాజకీయాలు రావు, నీ లెక్క లత్కోరు పనిచేయడు. అసలు గెలిచే మెజార్టీ లేకపోయినా ఎన్నికల బరిలోకి దిగింది నీ పార్టీ కాదా, ఎమ్మెల్సీ స్థానం గెలిచే ఓట్లు నీకున్నాయా? ఎందుకు దిగినవ్? ఇది తెలంగాణ. ఉద్యమ బెబ్బులి. స్వయం పాలన. తస్మాత్ జాగ్రత్త..’’
     - గత ఏడాది జూన్ 8న నల్లగొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై కేసీఆర్ ఆగ్రహమిది.

     
     అయామ్ విత్ యూ.. డోంట్ బాదర్
    చంద్రబాబు అనుచరుడు: హలో.. యా బ్రదర్.. బాబుగారు గోయింగ్ టు టాక్ టు యూ.. బి ఆన్ ద లైన్ (హలో బ్రదర్, బాబు గారు మీతో మాట్లాడతారు. లైన్‌లో ఉండండి)
     స్టీఫెన్‌సన్: యా..
     చంద్రబాబు: హలో..
     స్టీఫెన్‌సన్: సార్.. గుడ్ ఈవెనింగ్ సార్..
     చంద్రబాబు: గుడ్ ఈవినింగ్ బ్రదర్.. హౌ ఆర్ యూ (మీరు ఎలా ఉన్నారు?)
     స్టీఫెన్‌సన్: ఫైన్.. థాంక్యూ సర్
     చంద్రబాబు: మన వాళ్లు బ్రీఫ్‌డ్ మి.. అయామ్ విత్ యూ... డోంట్ బాదర్ (మన వాళ్లు అంతా వివరించారు. మీకు అండగా నేనున్నాను. కంగారు పడాల్సిందేమీ లేదు)
     స్టీఫెన్‌సన్: యస్ సార్.. రైట్ సార్ (మంచిది సర్)
     చంద్రబాబు: ఫర్ ఎవ్రీ థింగ్ అయామ్ విత్ యూ... వాట్ ఆల్ దే స్పోక్... విల్ ఆనర్ (దేనికైనా మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం)
     స్టీఫెన్‌సన్: యస్ సార్... రైట్ సార్
     చంద్రబాబు: ఫ్రీలీ యూ కెన్ డిసైడ్.. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ (మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. ఎలాంటి సమస్యా లేదు)
     స్టీఫెన్‌సన్: ఓకే సార్.. (మంచిది సర్)
     చంద్రబాబు: దటీజ్ అవర్ కమిట్‌మెంట్... వియ్ విల్ వర్క్ టుగెదర్ (అది మా హామీ. మనం కలిసి పనిచేద్దాం)
     స్టీఫెన్‌సన్: రైట్.. థాంక్యూ సార్
     చంద్రబాబు: థాంక్యూ
     (స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు సంభాషణ)

     
     
    ఎప్పుడేం జరిగింది?
        2015, మే 28: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ తనకు రూ. 5కోట్లు లంచం ఇవ్వజూపుతున్నారంటూ ఏసీబీకి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఫిర్యాదు.
     మే 31: సాయంత్రం 5 గంటల సమయంలో మాల్కం టేలర్ ఇంట్లో స్టీఫెన్‌సన్‌కు లంచం అడ్వాన్స్‌గా ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన రేవంత్‌రెడ్డి. నాలుగు గంటల పాటు విచారించిన తర్వాత బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి రేవంత్, ఉదయసింహ, సెబాస్టియన్‌లను తరలించిన పోలీసులు
     జూన్ 1: ఉదయం 9 గంటలకు రేవంత్, ఉదయసింహ, సెబాస్టియన్‌లను న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచిన పోలీసులు. వారిని 14 రోజుల పాటు కస్టడీ కోరిన ఏసీబీ. ‘ఓటుకు కోట్లు’ కేసు వివరాలు, రికార్డులు ఇవ్వాలంటూ కోర్టులో మెమో దాఖలు చేసిన ఎన్నికల సంఘం.
     జూన్ 5: రేవంత్‌ను నాలుగు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించిన సిటీ సివిల్ కోర్టు.
     జూన్ 7: స్టీఫెన్‌సన్‌తో  చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన ‘మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ’ ఆడియో టేపులు లీక్. అదే రోజు ఏపీ ఉన్నతాధికారులతో చంద్రబాబు అత్యవసర భేటీ. తమ నాయకుడి వాయిస్‌ను ఎడిట్ చేశారంటూ పరకాల ప్రభాకర్ ఆరోపణ.
     జూన్ 8: నల్లగొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై సీఎం కేసీఆర్ ఫైర్.. అదే రోజున గుంటూరులో కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం.
     జూన్ 9: రేవంత్, సెబాస్టియన్ నివాసాల్లో ఏసీబీ సోదాలు.
     జూన్ 10: కోర్టులో రేవంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం. రేవంత్‌కు కుమార్తె నిశ్చితార్థానికి వెళ్లేందుకు 12 గంటల అనుమతి.
     జూన్ 10: ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పయనం. తెలంగాణ సర్కారు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందంటూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు.
     జూన్ 11: హైదరాబాద్‌లో తన కుమార్తె నిశ్చితార్థానికి 12 గంటల బెయిల్‌పై బయటకొచ్చిన రేవంత్.. సమయం ముగిశాక చర్లపల్లికి జైలుకు తరలింపు. కోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి వ్యాఖ్యలూ చేయని రేవంత్.
     జూన్ 15: హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన రేవంత్.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని విచారించిన ఏసీబీ
     జూన్ 16: విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ నోటీసులు.
     జూన్ 19: ఏసీబీ నోటీసులపై పది రోజుల గడువు కోరిన సండ్ర.
     జూన్ 25: ‘ఓటుకు కోట్లు’ కేసు వివరాలు ఇవ్వాలంటూ కోర్టులో రిమైండర్ దాఖలు చేసిన ఈసీ
     జూన్ 30: రేవంత్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
     జూలై 1: చర్లపల్లి జైలు నుంచి విడుదలైన రేవంత్
     జూలై 3: రేవంత్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏసీబీ.. పిటిషన్ కొట్టివేత.
     జూలై 5: ఎమ్మెల్యే సండ్రకు మరోసారి నోటీసులు. టీడీపీ కీలక నేత జిమ్మిబాబుకు కూడా జారీ చేసిన ఏసీబీ.
     జూలై 6: ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన సండ్ర. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించి.. తర్వాత అరెస్టు చేసిన ఏసీబీ.
     జూలై 7: సండ్రను కస్టడీకి కోరిన ఏసీబీ.
     జూలై 8: సండ్రను రెండు రోజుల కస్టడీకి అప్పగించిన కోర్టు.
     జూలై 14: సండ్రకు బెయిల్ మంజూరు చేసిన సిటీ సివిల్ కోర్టు.
     జూలై 16: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌ను విచారించిన ఏసీబీ.
     జూలై 18: వేం నరేందర్‌రెడ్డి డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడిని, మరో అనుచరుడిని విచారించిన ఏసీబీ.
     జూలై 24: ఆడియో, వీడియో టేపులపై కోర్టుకు ప్రాథమిక నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ.
     జూలై 25: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికను తమకు ఇవ్వాలంటూ కోర్టులో మెమో దాఖలు చేసిన ఏసీబీ.
     జూలై 26: ఏసీబీ చేతికి వచ్చిన ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక. ‘ఓటుకు కోట్లు’ కేసులో స్వాధీనం చేసుకున్న ఆడియో, వీడియో టేపులు అసలైనవేనంటూ ఎఫ్‌ఎస్‌ఎల్ తుది నివేదిక.
     జూలై 28: చార్జిషీట్ దాఖలు చేసిన ఏసీబీ.
     ఆగస్టు 12: చంద్రబాబు తనయుడు లోకేశ్ డ్రైవర్‌కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ.. ప్రతిగా కేటీఆర్ గన్‌మన్, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. మత్తయ్యను వారు బెదిరించారని ఆరోపణలు. రెండు రోజుల్లో విచారణకు హాజరుకావాలంటూ ఆదేశం.
     ఆగస్టు 20: తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు తెలంగాణ సచివాలయానికి వచ్చిన ఏపీ పోలీసులు.
     నవంబర్ 21: ఆడియో టేపులపై కోర్టుకు మరో నివేదిక సమర్పించిన ఎఫ్‌ఎస్‌ఎల్.

Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Sandrayya kuda pink lungi kattukuntundanta ga inkem case vaa

+- KCR andhari politicians la kaadhu neethi ki nijaayithiki nyayam ki prathi roopam, nakka ni bokka loki veseysthaadu

Link to comment
Share on other sites

6 minutes ago, tom bhayya said:

+- KCR andhari politicians la kaadhu neethi ki nijaayithiki nyayam ki prathi roopam, nakka ni bokka loki veseysthaadu

Yeha nakka mukkonni phone tap case Lo 140 ias officers ni tap chesinamdhhku bokka Lo veyisthadannantha nijam :)

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Yeha nakka mukkonni phone tap case Lo 140 ias officers ni tap chesinamdhhku bokka Lo veyisthadannantha nijam :)

nakka elago corrupt kadha andhukey em peekalekapoyaadu, kcr anna nippu so nakka ki bokka ney

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...