Jump to content

potti thaliva into Janasean???


spider_reddy

Recommended Posts

రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. అధికార సాధన పరమార్థంగా, విజయం తీరం చేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచించుకునే నేపథ్యంలో, అందునా కుల సమీకరణలే విజయ సోపానాలుగా మారిపోయిన రాజకీయాల్లో, ఎవరెవరైయినా దగ్గర కావాల్సిందే.. ఎవరు, ఎవరినైనా చేర దీయాల్సిందే. అందువల్ల ఈ ఈక్వేషన్ సాధ్యపడుతుంది.. ఈ ఈక్వేషన్ సాధ్యం కాదు అన్నది లేదు. ఎవరి ప్రయత్నాలు వారివి.. అదే సమయంలో ఎవరి రాజకీయ ఊహాగానాలు వారివి. 

ప్రస్తుతం ఆంధ్ర రాష్ర్టంలో 2019 ఎన్నికలు లక్ష్యంగా రాజకీయ వ్యూహ రచనలు సాగుతున్నాయి. ప్రస్తుతానికి రంగంలో రెండే ప్రధాన పార్టీలు కనిపిస్తున్నాయి. ఒకటి అధికారంలో వున్న తెలుగుదేశం. రెండవది ప్రతిపక్షంలో వున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్. రెండు మూడేళ్ల క్రితం వరకు అధికారంలో వున్న కాంగ్రెస్ ఇప్పుడు చిరునామా లేక, నడిరోడ్డులో కూడా నిల్చోడానికి అవకాశం లేక దిక్కులు చూస్తూ వుండిపోయింది. ఇక కొత్తగా మొగ్గ తొడిగిన జనసేన పార్టీ చిత్రాతి చిత్రమైన రాజకీయాలు చేస్తోంది.’ మీరు ఒకందుకు పోస్తే, నేను ఒకందుకు తాగుతా’ అన్న సామెత మాదిరిగా, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ పైకి తెలుగుదేశం పార్టీ అధికార పల్లకీకి ఓ కొమ్ము కాస్తున్నట్లు కనిపిస్తున్నా, తెర వెనుక ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. వినిపిస్తోంది.

వీలయినంత వరకు తెలుగుదేశం పార్టీకి దగ్గరగా వుంటూనే, అవసరం అయితే ఒంటరిగా జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో పవన్‌తో దగ్గరగా వుంటూనే, పవన్ లేకుండా కూడా కాపుల మద్దతు ఎలా పొందాలన్నదానిపై జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది తెలుగుదేశం పార్టీ. ఇలా ఈ రెండు పార్టీలు ఒక పక్క కౌగిలించుకుంటూనే, మరోపక్క ఎవరి జాగ్రత్తలో వారున్నారు. 

అధికారం కావాలంటే..

ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అండగా వున్నారు. అందులో సందేహం లేదు. ఎక్కడ భాజపా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందో అన్న భయంతో, హోదా వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని, పవన్ కళ్యాణ్ ద్వారా ఆ పార్టీని ప్రజల్లో బద్ నామ్ చేసే పనికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. తిరుపతి, కాకినాడ సభల్లో అది స్పష్టమయింది. అయితే పవన్ అసలు అంతరంగం ఏమిటి? ఎప్పటికీ తెలుగుదేశంతో వుండాలనా? లేదా ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనా?

ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసే వ్యవహారాలు అయితే ఎంతమాత్రం కావు. ఎందుకంటే బాబు వున్నన్నాళ్లు ఆయన లేదూ అంటే ఆయన వారసుడిగా లోకేష్ ముఖ్యమంత్రులుగా వుంటారు కానీ, పవన్ తమతో వున్నాడని అతనికి ఛాన్స్ ఇవ్వడం మాత్రం అసాధ్యం. పొత్తుతో పోటీ చేసినా కూడా అత్యథిక స్థానాలు అయితే జనసేనకు ఇవ్వరు. అది వాస్తవం. అందువల్ల పవన్ మదిలో ముఖ్యమంత్రి పదవీ సాధన కనుక వుంటే, ఇవ్వాళ కాకుంటే రేపయినా తెలుగుదేశంతో తెగతెంపులు తప్పవు. అప్పుడేమిటి పరిస్థితి? కేవలం కాపుల ఓట్లతో అధికార సాధన అన్నది పవన్ కళ్యాణ్‌కు సాధ్యమేనా? అభిమానుల సంఖ్య అపరిమితం కావచ్చు కానీ, అవన్నీ ఓట్లుగా మారే అవకాశం వుంటుందా? వుండదని మెగాస్టార్ ప్రజా రాజ్యం విషయంలో రుజువయింది కదా? అప్పటికీ అపట్లో కాపు ఓట్లకు షెడ్యూలు కులాల ఓట్లు తోడు చేసుకోవాలని చిరంజీవి వ్యూహరచన చేసి విఫలమయ్యారు. 

ఇవన్నీ పవన్‌కు గుర్తున్న పాఠాలే. అందుకే ఆయన ఆచితూచి అడుగేస్తున్నట్లు కనిపిస్తోంది. అన్నింటికన్నా మందుగా తనకు కులం లేదు.. కులం లేదు అంటూ పదే పదే జనసేనకు కాపుకుల పార్టీ లేబుల్ అంటుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో వైకాపాకు అండగా వున్న క్రిస్టియన్ ఓట్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. మా ఆవిడ, కుమార్తె క్రిస్టియన్లు అంటూ పదే పదే చెప్పడం అందుకోసం తప్ప మరెందుకోసమూ కాదని పరిశీలకుల అభిప్రాయం.

ఏదో ఒక కులం

సంఖ్యాబలం తక్కువైనా ఇటు కమ్మ, అటు రెడ్డి ఈ రెండింటిలో ఏదో ఒక అండ లేకుండా కేవలం కాపుల ఓట్లతో ముందుకు సాగడం అసాధ్యం అని పవన్‌కు తెలియంది కాదు. అన్న చిరంజీవి, బంధువు అల్లు అరవింద్ రెడ్లతో వియ్యం అందారు. అందువల్ల ఆ సెక్షన్‌తో పెద్దగా ఇబ్బంది వుండదు. కానీ ఎటొచ్చీ కమ్మ సామాజిక వర్గం అండదండలే అంత సులువుగా లభించే అవకాశం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ చాలా పెద్ద స్కెచ్‌నే రచిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నారు. 

బావ చంద్రబాబు దూరం పెట్టడంతో అసంతృప్తిగా వున్న నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని దగ్గర చేసుకునే వ్యూహానికి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్‌గా తెరతీసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది హరికృష్ణ మీద ప్రేమతో కాదు, తమ పార్టీకి కమ్మ సామాజిక వర్గం, అందునా తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల అండను సంపాదించడం అన్నది కీలకం. పైగా హరికృష్ణ ఒంటరిగా రారు. పవన్‌తో సమానంగా కాకున్నా, దాదాపు ఆ మేరకు మాస్ ఫాలోయింగ్ వున్న హీరో ఎన్టీఆర్‌ను కూడా తీసుకుని వస్తారు. అది అసలు ఎత్తుగడ.

జగన్‌ను వదిలేస్తారా?

2014 ఎన్నికల సమయంలో పైకి తేలకున్నా, ఎన్టీఆర్ పరోక్షంగా జగన్ వైపు మొగ్గారన్నది తెలుగుదేశం వర్గీయుల ప్రగాఢ నమ్మకం. జగన్‌ను ఎన్టీఆర్ వ్యక్తిగతంగా, నేరుగా హైదరాబాద్‌లోనే ఓ స్టార్ హోటల్‌లో కలిసారని, పైగా జగన్ అధికారంలోకి వస్తారని బలంగా నమ్మారని తెలుగుదేశం అభిమానులు ఇప్పటికీ బల్ల గుద్ది మరీ వాదిస్తుంటారు. అందుకే ఎన్టీఆర్‌ను బాలయ్య, చంద్రబాబు పూర్తిగా దూరం పెట్టారన్నది వారి వాదనలో మరో పాయింట్. 

సరే, ఇవన్నీ ఎంతవరకు నిజాలైనా కాకున్నా, భవిష్యత్‌లో కూడా ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ దగ్గరకు తీస్తుందన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే లోకేష్‌కు సుదూర భవిష్యత్‌లో అయినా థ్రెట్‌గా మారతారు అనుకున్నవారిని ఎవరినీ బాబు దగ్గరకు తీయరు. ఎదిగేందుకు వీలుగా వదిలేయరు. అదే సమయంలో బాలయ్య వుండగా, హరికృష్ణకు అంత సులువుగా పదవులు అందవు. అందువల్ల హరికృష్ణ తన కుమారుడు ఎన్టీఆర్‌తో కలిసి 2019 నాటికి ఏదో ఒక పార్టీని చూసుకోవాల్సిందే. 

ఇప్పటికే హరికృష్ణకు పొగ పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పొలిట్ బ్యూరో సమావేశానికి కూడా హరికృష్ణ హాజరు కాలేదు. మరోపక్క హరికృష్ణకు వున్న ఏకైక అనుచరుడు కొడాలి నానిని ఎలాగైనా బుజ్జగించి, తెలుగుదేశంలోకి లాక్కురావాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతం అంతా మరిచిపోదామని, కలిసి పని చేసుకుందామని కొడాలి నానికి రాయబారాలు వెళ్తున్నాయి. 

నాని ప్రస్తుతం వైకాపాలో వున్నారు. నాని కనుక తెలుగుదేశంలో చేరితే ఇక హరికృష్ణకు, వైకాపాకు మధ్య సంధానకర్త లేనట్లే. అదీ కాక జగన్‌కు వున్న రాజకీయ అపరిపక్వత కావచ్చు, ఏటిట్యూడ్ కావచ్చు, అతనిపై వున్న విమర్శలు కావచ్చు, అధికార సాధనకు అడ్డం పడతాయేమో అన్న అనుమానాలు వున్నాయి. పైగా 2019 నాటికి జనసేన ఒంటరిగా రంగంలోకి దిగితే, మళ్లీ జగన్ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం వుంది. ఇలాంటి నేపథ్యంలో జగన్ వెంట వెళ్లడం ఏమేరకు ప్రయోజనకరం అన్న ఆలోచన హరికృష్ణ క్యాంప్‌లో బయల్దేరింది అని తెలుస్తోంది. 

ఇదే సమయంలో పవన్ కళ్యణ్ మెలమెల్లగా ఎన్టీఆర్‌ను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును ఢీకొని ఎన్నికల్లో నిలబడాలంటే ఎన్టీఆర్ లాంటి మాస్ ఇమేజ్ ప్లస్ ప్రధాన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి తోడుగా వుంటే మంచిది అని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా నందమూరి ఫ్యామిలీ టాగ్ వుండనే వుంటుంది. 

ఎన్టీఆర్‌కు మద్దతుగా

ఎన్టీఆర్‌కు మెగా క్యాంప్‌కు మధ్య అనుబంధం ఎప్పటి నుంచో వుంది. ఎన్టీఆర్ అంటే ఇటు చిరుకు కూడా అభిమానమే. ఆ మధ్య ఏరి కోరి మెగాక్యాంప్‌కు అవకాశం వున్న మా టీవీ ఉత్తమ నటుడు అవార్డును కూడా ఎన్టీఆర్‌కు అందించారు. అందువల్ల పవన్ వైపు వెళ్లడానికి ఎన్టీఆర్‌కు పెద్దగా అభ్యంతరం వుండకపోవచ్చు. 

లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్‌తో ఆత్మ పరమాత్మ లాంటి బంధం వున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు. పవన్‌తో డిస్కషన్ లేకుండా, పవన్ సలహా సూచనలు లేకుండా త్రివిక్రమ్ ఈ సినిమాను ప్లాన్ చేసారని అనుకోవడానికి లేదు. ఇప్పుడు పవన్ తలుచుకుంటే, తన సినిమాను కాస్త వెనక్కు జరిపి అయినా ఎన్టీఆర్‌కు అవకాశం ఇవ్వగలరు. లేదూ అంటే ఎన్నికల వేళకు పనికి వచ్చేలా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాను 201 నాటికి రెడీ చేయించగలరు. 

మెగా క్యాంప్ అండ

టాలీవుడ్‌లో ఎన్టీఆర్ ఒక విధంగా ఒంటరి అని చెప్పాలి. సరైన అండదండలు ఏవీ లేవు. ఇప్పుడు పవన్‌కు కనుక దగ్గరయితే మెగా క్యాంప్ అండ లభిస్తుంది. టాలీవుడ్‌లో అన్ని విధాల మంచి ఇన్ ఫ్రాస్టక్చర్ మెగా క్యాంప్‌కు వుంది. అలాంటి క్యాంప్ అండ వుండడం ఎన్టీఆర్‌కు అన్నివిధాలా లాభమే. ఇక ఇప్పుడు పవన్ వైపు ఒదగడం వల్ల చంద్రబాబుతో కొత్తగా వచ్చే విబేధం ఏదీ లేదు. 

ఇన్నాళ్లు తెరవెనుక వున్నది ముందుకు వస్తుందంతే. జగన్‌తో మరీ రాసుకుపూసుకున్నదీ లేదు. ఇన్నాళ్లు వున్నది జగన్ అంటే కాస్త సాఫ్ట్ కార్నర్ మాత్రమే. అందువల్ల ఎన్టీఆర్ పెద్దగా ఆలోచించి, బుర్ర బద్దలు కొట్టుకోవడానికి ఏమీ లేదు.  కానీ ఒక్కటే పాయింట్. పవన్ నిజంగా తెలుగుదేశం పార్టీని ఢీకొనడానికి సిద్ధం అవుతారా?  కారా? అన్నది ఒక్కటే. తీరా పవన్ వైపు ఎన్టీఆర్ వెళ్లిన తరువాత, జన సేన ఇప్పటి లాగే ఎప్పటికీ తెలుగుదేశం పల్లకి మోసే అలవాటను వదులుకోకపోతే మాత్రం, ఎన్టీఆర్ అక్కడకు వెళ్లీ ప్రయోజనం ఏమీ వుండదు.

కానీ అలా ఒంటరి పోరుకు రెడీ కాకపోతే, చంద్రబాబుకు ఇష్టం లేని ఎన్టీఆర్‌ను దగ్గరకు తీయాలని పవన్ మాత్రం ఎందుకు అనుకుంటారు? అందువల్ల పవన్ దగ్గరకు ఎన్టీఆర్ వెళ్లారన్నా, ఎన్టీఆర్‌ను పవన్ దగ్గరకు తీసారన్నా, చంద్రబాబుకు ఎదురుగా నిల్చోవడానికి పవన్ రెడీ అవుతున్నారనే అనుకోవాలి. ఆ విధంగా జనసేనకు ‘కాపు’ కాయడానికి ఓ ‘కమ్మ’ని హీరోని తోడు చేసుకుంటున్నారనే అనుకోవాలి. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...