Jump to content

Amaravati ki Nava Shobha


Swas

Recommended Posts

నవశోభ
 
636230615656704796.jpg
  • రాజధాని అమరావతిలో 9 థీమ్‌ సిటీలకు భూకేటాయింపు
  • పర్యాటక నగరానికి 11,574 ఎకరాలు
  • పాలనా నగరికి అత్యల్పంగా 2,702 ఎకరాలు
  • 9 నగరాలను కలుపుతూ విశాలమైన రోడ్లు
  • 134 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం
  • పర్యావరణహిత రాజధానికి ప్రణాళికలు
అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజధాని ప్రాంతంలో నిర్మించదలచిన 9 థీమ్‌ సిటీలకు శనివారం భూములు కేటాయించింది. రాజధానిని కేవలం పరిపాలనకే పరిమితం చేయరాదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. విద్య, వైద్య, పర్యాటక, ఆతిథ్య, సాంస్కృతిక, వాణిజ్య, సాంకేతిక, ఆర్థిక కార్యకలాపాలకు రాజధాని కేంద్రస్థానంగా నిలవాలన్నది సీఎం ప్రగాఢ సంకల్పం. అప్పుడే ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు పెరిగి రాజధాని అభివృద్ధి పరుగులు తీస్తుందన్నది ఆయన విశ్వాసం.
 
   దానికి అనుగుణంగా రాజధానిలో పరిపాలన, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రా‌నిక్స్‌, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటక నగరాలనే తొమ్మిది ప్రత్యేక థీమ్‌ సిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కృష్ణా నదీ తీరాన 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. 53,647 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న అమరావతికి ఈ ‘నవ నగరాలు’ వినూత్న శోభను సమకూర్చనున్నాయి. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే ఆధునికశైలిలో ఈ నగరాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఈ నవ నగరాలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. అందులో పర్యాటక నగరానికి అత్యధికంగా 11,574 ఎకరాలను కేటాయించారు. పరిపాలనా నగరానికి అత్యల్పంగా 2,702 ఎకరాలను కేటాయించారు. ఈ థీమ్‌ సిటీలను అనుసంధానించేందుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన రహదారులు, మెట్రో తదితర రవాణా వ్యవస్థలను నెలకొల్పడంతోపాటు అమరావతి మొత్తాన్నీ సీఎం ఆకాంక్షల మేరకు ‘బ్లూ- గ్రీన కాన్సెప్ట్‌’ (జలవనరులు, పచ్చదనం)తో పూర్తి పర్యావరణహితంగా, కాలుష్యరహితంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
 
CRDA.jpg 
 
 
పర్యాటక నగరం
అమరావతిని పర్యాటకుల స్వర్గథామంగా తీర్చిదిద్దాలనుకుంటున్నందున దీనిని అత్యధికంగా 11,574 ఎకరాల్లో నిర్మించనున్నారు. వీటిల్లో పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు, రిసార్టులు, పర్యాటక రంగానికి చెందిన కార్యాలయాలు, వినోద ప్రదేశాలు తదితరాల కోసం 8,778 ఎకరాలు కేటాయించారు. గృహావసరాలకు 1397, వాణిజ్యావసరాలకు 451, పరిశ్రమలకు 100, ప్రత్యేక జోనకు 156, భవిష్యత్తు అవసరాలకు 692 ఎకరాలను నిర్దేశించారు. 
 
విజ్ఞాన నగరం
రాజధానిని ప్రపంచస్థాయి విద్యా, విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి పరచడం ద్వారా దేశ, విదేశాలకు చెందిన వేలాదిమంది విద్యార్థినీవిద్యార్థులను ఆకర్షించాలని భావిస్తున్న నేపథ్యంలో విజ్ఞాన నగరానికి 8547 ఎకరాలు కేటాయించారు. వీటిల్లో ప్రత్యేక జోనకు 979 ఎకరాలు, విద్యాసంస్థలు, గృహావసరాల కోసం 3562, వాణిజ్యావసరాలకు 1257, వినోదం- ఇతరత్రా ప్రజోపయోగ వినియోగం కోసం 1340, పరిశ్రమలకు 87, భవిష్యత్తు అవసరాల నిమిత్తం 1322 ఎకరాలను కేటాయించారు. 
 
ఆరోగ్య నగరం
ప్రభుత్వ, కార్పొరేట్‌ ఆసుపత్రులతోపాటు వైద్య విశ్వవిద్యాలయాలు, అనుబంధ రంగాలకు చెందిన విద్యాసంస్థలు, కార్యాలయాలు ఏర్పాటవనున్న ఈ హెల్త్‌ సిటీకి 6,511 ఎకరాలను కేటాయించారు. వీటిల్లో ప్రత్యేక జోనకు 1048, గృహావసరాలకు 3306, వినోదం- ఇతరాలకు- బహిరంగా ప్రదేశాలకు 580, వాణిజ్యావసరాలకు 504, భవిష్యత్తు అవసరాలకు 1072 ఎకరాలను కేటాయించారు. 
 ap4.jpg
ఆర్థిక నగరం
ఆర్థిక వ్యవహారాలను నిర్వహించే, పర్యవేక్షించే ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలతోపాటు ప్రైవేటు రంగంలోని పలు ఆర్థిక సంస్థలతో ఏర్పడనున్న ఫైనాన్షియల్‌ సిటీకి 5,618 ఎకరాలు కేటాయించారు. ఇందులో ప్రత్యేక జోనకు 844, గృహావసరాలకు 1389, వినోదం, సామాజిక ప్రయోజనాల కోసం బహిరంగ ప్రదేశాలుగా ఉంచేందుకు 1250, వాణిజ్య అవసరాలకు 828, పారిశ్రామిక రంగానికి 101, భవిష్యత్తు అవసరాలకు 756 ఎకరాలను కేటాయించారు. 
 
క్రీడా నగరం
అమరావతి క్రీడల స్వర్గథామంగా వెలుగొందాలని, జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాపోటీలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్‌ సిటీకి 4150 ఎకరాలను కేటాయించింది. వీటిల్లో ప్రత్యేక జోన్లకు 436, గృహావసరాలకు 1819, సామాజిక ప్రయోజనాల నిమిత్తం బహిరంగ ప్రదేశాలుగా ఉంచేందుకు 555, వాణిజ్య అవసరాలకు 513, పరిశ్రమలకు 134, భవిష్యత్తు అవసరాలకు 693 ఎకరాలను నిర్దేశించింది.

న్యాయనగరం
ఇందులో హైకోర్టు, ఇతర న్యాయస్థానాలు, న్యాయవ్యవస్థకు సంబంధించిన పరిపాలనా కార్యాలయాలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి ఆ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగుల వరకు అందరి నివాసగృహాలు ఏర్పాటవుతాయి. 3,438 ఎకరాల్లో నిర్మితమవనున్న ఈ జస్టిస్‌ సిటీలో ప్రత్యేక జోనకు 458, గృహావసరాలకు 1276, వినోదం- ఇతర సామాజికావసరాలకు 692, వాణిజ్యావసరాలకు 467, భవిష్యత్తు అవసరాలకు 545 ఎకరాలను కేటాయించారు. 
 
మీడియా సిటీ
ప్రింట్‌, ఎలక్ట్రా‌నిక్‌, వెబ్‌ మీడియాలకు చెందిన పలు సంస్థల కార్యాలయాలు, వాటి ఉద్యోగుల గృహాలు ఇందులో ఏర్పాటవుతాయి. 5107 ఎకరాల్లో నిర్మితం కానున్న ఈ నగరంలో ప్రత్యేక జోన్లకు 346, గృహావసరాలకు 1862, వినోదం- ఇతర సామాజికావసరాల కోసం బహిరంగ ప్రదేశంగా ఉంచేందుకు 1291, వాణిజ్య అవసరాలకు 791, పారిశ్రామికావసరాలకు 250, భవిష్యత్తు అవసరాలకు 567 ఎకరాలను కేటాయించారు.
ap5.jpg
విశాల రహదారులు.. మెట్రో అనుసంధానం 
తొమ్మిది థీమ్‌ సిటీలను అనుసంధానించేందుకు విశాలమైన రహదారులను నిర్మిస్తారు. వీటిల్లో 60 మీటర్ల వెడల్పు ఉండే 3 ప్రధాన రహదారులతోపాటు 50 మీటర్ల వెడల్పుతో 275 కి,మీ. పొడవైన అంతర్గత రహదారులు, 25 మీటర్ల వెడల్పు ఉండే రోడ్లు ఉంటాయి. అదనంగా 186 కి.మీ. పొడవైన 8 వరుసల అవుటర్‌ రింగ్‌ రోడ్డు, 97.5 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కూడా నిర్మిస్తారు. 134 కి.మీ. మెట్రో రైలు మార్గం నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. 
 
పరిపాలన నగరం
రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు కేంద్రనాడిగా నిలిచే ఈ అడ్మినిస్ట్రే‌టివ్‌ సిటీలో శాసనసభ, శాసనమండలి, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల నివాసగృహాలు ఇత్యాదివి ఉంటాయి. దీనికి కేటాయించిన 2,702 ఎకరాల్లో ప్రత్యేక జోన్లకు 638 ఎకరాలు, గృహావసరాలకు 833, వినోదం- ఇతర సామాజికావసరాలు- బహిరంగస్థలాలకు 567, వాణిజ్య కార్యకలాపాలకు 237, భవిష్యత్తు అవసరాలకు 427 ఎకరాలను కేటాయించారు. 
 
ఎలక్ట్రా‌నిక్స్‌ నగరం
6,582 ఎకరాల్లో ఇది ఏర్పాటుకానుంది. ఇందులో ప్రత్యేక జోనకు 645, పారిశ్రామిక రంగానికి 1618, గృహావసరాలకు 1862, వాణిజ్యావసరాలకు 682, వినోదం- ఇతర ప్రయోజనాల కోసం 757, భవిష్యత్తు అవసరాలకు 503 ఎకరాల చొప్పున కేటాయించారు. 
 
త్వరలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ ముసాయిదా డిజైన్లు
తొమ్మిది థీమ్‌సిటీలను అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రపంచస్థాయి నిపుణులతో ప్రణాళికలు రూపొందింపజేస్తున్నారు. పరిపాలనా నగరంలోని 900 ఎకరాల్లో నిర్మించనున్న గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌, ఐకానిక్‌ బిల్డింగులైన అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను రూపొందిస్తున్న లండనకు చెందిన నార్మన ఫోస్టర్‌ సంస్థ వాటి ముసాయిదా డిజైన్లను ఈ నెల 22న అందజేయనుంది. దీంతో రాజధాని నిర్మాణ ప్రక్రియ మరొక కీలక దశను అధిగమించినట్లవుతుంది. కొద్ది నెలల్లోనే ఫైనల్‌ డిజైన్లను ఖరారు చేసి, ఆ వెంటనే నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. 
crda4.jpg
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...