Jump to content

Positive Side..


Diana

Recommended Posts

Image result for women are great

అందుకే.. ఆ పాప పేరు హిమబిందు!

అది కడప రిమ్స్‌ ఆసుపత్రి. అక్కడ ప్రసవానంతర వైద్య విభాగం. అందులో చికిత్స తీసుకుంటున్న ఆమె పేరు ఆదిలక్ష్మి. ఆమె పొత్తిళ్లలో పుట్టి 48 గంటలే అవుతున్న ఓ చిట్టిపాప! తల్లినీ, పిల్లనీ చూడటానికి వచ్చే బంధువులందరికీ ఆదిలక్ష్మీ, వాళ్లమ్మ ఎల్లమ్మ ఆ హృద్యమైన సంఘటనని ఓ కథలా వినిపిస్తూనే ఉన్నారు.  కథలాంటి అరుదైన ఆ సంఘటన చెప్పి ముగించాక.. ‘అందుకే ఈ పాపకి హిమబిందు అని పేరుపెట్టాం!’ అని ముగిస్తున్నారు. ఏమిటా సంఘటన అంటారా? చుట్టూ ఉన్న స్వార్థం, యాంత్రికత నడుమ ఎప్పుడూ నక్కి నక్కి ఉండే మంచితనం ఒక్కసారిగా పెల్లుబికిన ఘటన అది.పదిచేతులు కలిసి మానవీయతకి పట్టంగట్టిన వేళ అది! ఆ పదిచేతుల నాయకత్వం.. డాక్టర్‌ హిమబిందుది! 
మే 1, సోమవారం వేకువ 3.30 గంటలు. ఆదిలక్ష్మికి వెన్నులో సన్నగా నొప్పి మొదలైంది. ఎనిమిదినెలల గర్భిణి ఆమె. కడుపులో ఏదో ఇబ్బంది. ఆమె తల్లికి ఆ నొప్పి దేనికో అర్థమైంది. కూతురూ, ఆమె భర్తా, తన పెద్ద కూతురు, పిల్లలు సహా అందర్నీ బయల్దేరదీసింది. ఎక్కడికీ? కడపలోని రిమ్స్‌ ఆసుపత్రికి. ‘అక్కడైతే బాగా చూస్తారంట..!’ అని. సుమారు నాలుగున్నరకి కడపజిల్లా రైల్వే కోడూరు ప్లాట్‌ఫామ్‌కి వచ్చారు అందరూ.. ఏదో ఒక రైలు రాకపోతుందా అని చూస్తున్నారు. చెన్నై నుంచి దాదర్‌ వెళ్లే జయంతి జనతా ఎక్స్‌ప్రెస్‌ 4.30కి వచ్చింది అక్కడికి! జనరల్‌ బోగీ కిటకిటలాడుతోంది.అక్కడ ఎక్కడానికి లేదు. కానీ ఎలాగోలా రిమ్స్‌ వెళ్లితీరాలి. దాంతో పక్కనే ఉన్న వికలాంగుల బోగీ ఎక్కారు. బోగీ మొత్తంలో ఎనిమిది మందే ఉన్నారక్కడ. ఆదిలక్ష్మి పరిస్థితి చూసి వికలాంగులిద్దరూ సీటిస్తే.. దానిపై పడుకోబెట్టారు. రైలు బయల్దేరింది. దాంతోపాటు కాన్పు నొప్పులతో కాబోయే తల్లి పోరాటం కూడా మొదలైంది..

* * *

నొప్పి.. నిమిషనిమిషానికీ పెరుగుతోంది. వెన్ను నుంచి పొట్ట మొత్తానికీ ఓ విద్యుదాఘాతంలా వ్యాపిస్తోంది. అలా నలభై అయిదు నిమిషాలు. ! ఆ కుటుంబానికి పరిస్థితి చేయిదాటిపోతోందని అర్థమైంది. తల్లి, అక్కయ్య, వాళ్ల పిల్లలందరిలో ఏడుపులు మొదలయ్యాయి! కూలీ బతుకులు వాళ్లవి. కష్టం వస్తే రోదనని తోడు తెచ్చుకోవడం తప్ప ఇంకేదీ రాదువాళ్లకి! ఆ దుఃఖం మధ్య రైలు రాజంపేట దాటి, నందలూరు చేరుకుని మళ్లీ బయల్దేరిన విషయం గమనించలేదు వాళ్లెవరూ! నందలూరులో ఎక్కిన ఆ అమ్మాయి వీళ్లని చూడగానే విషయమేంటో గ్రహించింది. దగ్గరకెళ్లి ‘ఏడవకండమ్మా..!’ అని సముదాయిస్తున్నా వాళ్లు వినలేదు. ఆమె ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. ‘నేను డాక్టర్‌ని. అవసరమైతే ఈమెకి ఇక్కడే వైద్యం చేస్తా.. ఇక్కడకాకుంటే నడిరోడ్డులోనైనా ప్రసవం చేయగలను. భయపడొద్దు!’ అంది కాస్త గట్టిగానే! అప్పుడు ఆపారు వాళ్లు ఏడుపు. కడుపు పట్టి చూసింది. ఎనిమిది నెలలైనా.. బిడ్డ బయటకు రావడానికి సిద్ధమైపోయింది. ఆ డాక్టర్‌ కడప 108 విభాగానికి ఫోన్‌ చేసింది. స్ట్రెచర్‌ తీసుకురండంటూ సూచనలిచ్చింది. కానీ, ఆమె ఎదురుచూడని పరిణామం ఆమెకు సవాలు విసిరిందప్పుడే.. నీలాల కుండని చీల్చుకుంటూ ఉమ్మనీరు బయటకు రావడం మొదలైంది! 

* * *

చీకట్లో.. సుదూరంలో వైద్యసదుపాయాలేవీ లేని ఆ వేళలో కాన్పుపరంగా చాలా తీవ్రమైన పరిస్థితి అది! ఆమె వైద్యవృత్తి చేపట్టి మూడేళ్లు కూడా దాటలేదు. అయినా ఆ చిన్న వయసులోనే పులివెందుల మండలంలోని ఓ పీహెచ్‌సీకి డ్రాయింగ్‌ అధికారిణిగా బాధ్యతలు చూస్తోంది! అక్కడికి వందకిలోమీటర్ల దూరంలో ఉండే నందలూరు ఆమె సొంతూరు. ప్రతి శని, ఆదివారాల్లో అమ్మా, నాన్నలని చూడటానికి అక్కడికి వచ్చి.. సోమవారం ఉదయానే ఏదో ఒక రైలు పట్టుకుని ఇలా బయల్దేరుతుంది. ఆరోజు రైలుని చివరి క్షణంలోనే ఎక్కింది. ఎక్కడ ఎక్కుతున్నామో చూసుకోకుండా వికలాంగుల బోగీ ఎక్కింది. అదే.. ఆ నిరుపేద కుటుంబానికి వరమైంది. ఉమ్మనీరు రావడంతో చకచకా నిర్ణయాలు తీసుకుందామె! అప్పటికే.. శిశువు తల బయటకు వస్తోంది. బయట చూస్తే.. రైలు ఒంటిమిట్ట స్టేషన్‌కి కాస్త చేరువలో ఉంది. ఈసారి ఆమె స్థానిక 108కి ఫోన్‌ చేసి సూచనలిచ్చింది. ఇచ్చింది సరే.. ఆ ఎక్స్‌ప్రెస్‌ రైలు అక్కడ ఆగాలి కదా! ‘ఎవరైనా చెయిన్‌ లాగండి!’ అని పెద్దగా అరిచిందామె! లాగారు. గార్డు వస్తే.. విషయం చెప్పింది. ఆయన ఒప్పుకోలేదు. ఆమె పరిస్థితిని కాస్త గట్టిగానే వివరించాల్సి వచ్చింది. ‘వద్దమ్మా! నీకూ, నాకూ ఇద్దరికీ రిస్కు. కడపకి తీసుకెళ్తే వాళ్లే చూసుకుంటారు!’ అన్నాడాయన. ఈమె ఒప్పుకోలేదు. ‘అంతదాకా ఆగడానికి లేదండీ..!’ అని చెప్పింది. ఆమె పట్టుదలకి ఆయన దిగి రాక తప్పలేదు!

* * *

రైలు రెండో నెంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. మరి అక్కడి నుంచి ఆదిలక్ష్మిని ఎవరు మోసుకెళ్తారు? అంత బలం ఎవరికుంది? అని పెద్దగా అరవడం మొదలుపెట్టిందా వైద్యురాలు. ఓ చూలాలి కోసం ఆమె పడుతున్న తపనలో కేవలం వైద్యురాలేకాదు.. అసలైన మానవతామూర్తి అక్కడివాళ్ల కళ్లకి కనిపించింది. ‘నేనున్నానమ్మా!’ అంటూ వచ్చాడు ఓ జెండా సిబ్బంది! మాజీ సైనికాధికారి ఆయన. ఆ యువవైద్యురాలు సూచనలు ఇస్తూ ఉండగా.. రెండో ప్లాట్‌ఫాం చివరి నుంచి మొదటి ప్లాట్‌ఫాంకి మోసుకొచ్చాడు! అప్పటికే 108 సిబ్బంది స్ట్రెచర్‌ పెట్టారు. అంబులెన్స్‌ ఎక్కించారు. ఆసుపత్రికి కూడా తీసుకెళ్లే సమయం లేదని అర్థమైంది ఆ వైద్యురాలికి! అక్కడున్న పరికరాలతో తానే ప్రసవం చేయడానికి పూనుకుంది. మొక్క నుంచి ఓ పువ్వుని తీసినంత నాజూకగా ఆడబిడ్డని బయటకుతీసింది. తక్కువ నెలలూ.. బరువూ తక్కువున్న ఆ ఆడశిశువు ఆమె చేతిలోనే ‘క్యార్‌’ మంది. ఆ తర్వాతి ఐదు నిమిషాలకి.. వ్యాను ఒంటిమిట్ట పీహెచ్‌సీకి చేరింది! ఆదిలక్ష్మి కంటే ముందు.. బిడ్డతో కిందకి దిగింది ఆ వైద్యురాలు. అక్కడివారికి చకచకా సూచనలిచ్చి గంటపాటు ఆ తల్లీ, పిల్లని పర్యవేక్షించి.. ఆసుపత్రికి బయల్దేరిందామె! విషయం బయటకు పొక్కి స్థానిక విలేకరులూ ఆమెని చుట్టుముట్టారు. ‘ఓ వైద్యురాలిగా నా బాధ్యత చేశానంతే!’ అని మాత్రమే జవాబు ఇచ్చిందామె! అలా సమాధానాలిచ్చి వెళ్తూ ఉండగా.. ఆదిలక్ష్మి తల్లి ఎల్లమ్మ అడిగిందట. ‘నీ పేరేమిటమ్మా!’ అని. ‘డాక్టర్‌ హిమబిందు..’ అని చెబుతూ ‘ఎందుకు?’ అని ప్రశ్నించిందట. ‘నా మనవరాలికి.. నీ పేరే పెడదామని!’ అందట ఎల్లమ్మ కళ్లలో చెమ్మతో!!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...