Jump to content

రాజధానికి ప్రజాధనం!


TampaChinnodu

Recommended Posts

రాజధానికి ప్రజాధనం! 
సేకరణ పద్ధతులపై పెద్ద ఎత్తున కసరత్తు 
వినూత్న విధానం రూపకల్పనపై  కమిటీ అధ్యయనం 
ప్రవాసాంధ్రుల నుంచీ రుణాలు తీసుకోవడంపై పరిశీలన 
బాండ్లు, డిపాజిట్లు, విరాళాల రూపంలో స్వీకరణ? 
ఈనాడు - అమరావతి 
1ap-main1a.jpg

రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి నిధులు సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రజలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలతోపాటు, ప్రవాసాంధ్రుల నుంచి నిధులు సమీకరించేందుకు ఒక విధానాన్ని రూపొందించనుంది. విరాళాలు, సంస్థాగత, రీటెయిల్‌ బాండ్లు, మసాలా బాండ్లు, ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) ద్వారా డిపాజిట్‌లు స్వీకరించడం... వంటి అందుబాటులో ఉన్న మార్గాలన్నీ పరిశీలిస్తోంది. విధివిధానాల రూపకల్పనకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు అధ్యక్షతన కమిటీ నియమించింది. ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థ అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ సభ్యులుగా ఉన్నారు.

ఇప్పటిదాకా ఎవరెలా చేస్తున్నారంటే..! 
మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం ప్రజల నుంచి బాండ్లు, డిపాజిట్ల రూపంలో నిధులు సమీకరించడం ఎప్పటి నుంచో ఉంది. 
* జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), హడ్కో, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వంటి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని సంస్థలు బాండ్లు జారీ చేస్తున్నాయి. 
* కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా బాండ్ల ద్వారా నిధులు సమీకరించాయి. 
* కేరళ ట్రాన్స్‌పోర్టు డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సంస్థ... బస్‌ స్టేషన్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కోసం ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో నిధులు సమీకరిస్తోంది. ఇలా రూ.2 వేల కోట్ల వరకు ఆ సంస్థ సేకరించే నిధులకు కేరళ

1ap-main1b.jpg
రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అప్పు ఇవ్వాలి. డబ్బున్నవారు బ్యాంకుల్లో దాచుకోకుండా ప్రభుత్వానికి అప్పిస్తే బాండ్లు జారీ చేస్తాం. బ్యాంకుల కంటే రెండు నుంచి మూడు శాతం ఎక్కువ  వడ్డీ చెల్లిస్తాం.
- శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటన

ప్రభుత్వం హామీ ఇచ్చింది. 
* కేరళలో రహదారులు వంటి ప్రధాన మౌలిక వసతుల నిర్మాణానికయ్యే నిధుల సమీకరణకు కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ బోర్డు పేరుతో ఒక ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ జనరల్‌ ఆబ్లిగేషన్‌ బాండ్లు, రెవెన్యూ బాండ్లు, ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లు, ఇన్విట్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెట్‌ ఫండ్‌ల వంటి రూపాల్లో నిధుల సమీకరిస్తోంది. మసాలా బాండ్లు విడుదలకూ సన్నాహాలు చేస్తోంది. 
* మహారాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ప్రజల నుంచి నిధులు సమీకరించింది. 
* తమిళనాడులో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల రూపంలో నిధులు సమీకరించే ప్రయత్నం చేశారు. కానీ దీనికి పెద్దగా స్పందన రాలేదు.

అనుకూలతలు: 
* రాజధాని నిర్మాణానికి ఇప్పటికే కొందరు విరాళాలు ఇస్తున్నారు. తాజా పరిణామాలు, ముఖ్యమంత్రి పిలుపు తర్వాత మరింత మంది స్పందిస్తున్నారు. విరాళాలు ఇచ్చేందుకు ఒక విధానం రూపొందిస్తే విరాళాలు పెరిగే అవకాశం ఉంది.  ప్రవాసాంధ్రులు కూడా ముందుకొస్తారు. ఈ ప్రక్రియంతా పారదర్శకంగా జరగాలి. 
* అమెరికా వంటి దేశాల్లో బ్యాంకులు ఇచ్చే వడ్డీ శాతం చాలా తక్కువ. సుమారు 1.5 శాతం వడ్డీ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రవాసాంధ్రులు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. 
* రాజధాని నిర్మాణానికి హడ్కో వంటి సంస్థల నుంచి రుణాలు తీసుకుంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావడంతో పాటు... సీఆర్‌డీఏ భూమిని కూడా తనఖా పెట్టాల్సి వస్తోంది. బాండ్లు, డిపాజిట్ల రూపంలో తీసుకున్నప్పుడు భూమి తనఖా అవసరం ఉండదు.

అవరోధాలు: 
* ఏ అవసరం కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోవాలంటే అది ఎఫ్‌ఆర్‌బీఎం(ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) పరిమితికి లోబడే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి జీఎస్‌డీపీ(గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రోడక్ట్‌)లో 3 శాతం ఉంది. దీన్ని 3.5 శాతానికి పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నా స్పందనలేదు. బాండ్లు, డిపాజిట్ల రూపంలో ప్రజల నుంచి నిధులు ఎలా సమీకరించాలన్నా ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధన అవరోధంగా ఉంటుంది. 
* ప్రభుత్వం నేరుగా అప్పు తీసుకోకుండా... సీఆర్‌డీఏ వంటి సంస్థల ద్వారా నిధులు సమీకరిస్తే ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధన వర్తించదు. కానీ సీఆర్‌డీఏ వంటి సంస్థలు సమీకరించే నిధులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే మాత్రం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధన వర్తిస్తుంది. 
* ప్రజల నుంచి బాండ్ల రూపంలో నిధులు సమీకరించాలంటే సెబీ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా నిధులు సమీకరించాలన్నా ఆర్బీఐ అనుమతులు తప్పనిసరి. బాండ్ల స్ట్రక్చరింగ్‌, అనుమతులకు ఎక్కువ సమయం పడుతుంది. 
* బాండ్లలో పెట్టుబడి పెట్టేవారికి కేంద్రం ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ ఆకర్షణీయంగా ఉండాలి. ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకులు 6.75-7.25 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్లకు 7.25-7.5 శాతం మధ్య వడ్డీ ఉంటోంది.

అందుబాటులో ఉన్న ప్రధాన మార్గాలు... 
1.  అమరావతి  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  బాండ్లు: ఈ బాండ్ల పేరుతో ప్రజల నుంచి (రీటెయిల్‌ ఇన్వెస్టర్స్‌) పెట్టుబడులు స్వీకరించే ఆలోచనలో ఉంది. దీనిపై సీఆర్‌డీఏ ఇది వరకు ఒక ప్రతిపాదన సిద్దం చేసింది. అప్పట్లో ఈ బాండ్ల ద్వారా రూ.10 వేల కోట్లు వరకు సమీకరించాలని భావించింది. ఇప్పుడు దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. అప్పట్లో ఇక్కడి ప్రజల నుంచే నిధులు సమీకరించాలనుకోగా, ఇప్పుడు ప్రవాసాంధ్రుల నుంచి పెద్ద ఎత్తున అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. సీఆర్‌డీఏ, ఏడీసీ వంటి సంస్థల ద్వారా అప్పు తీసుకోవాలా? ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలా? ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా అప్పు తీసుకునే మార్గాలేమైనా ఉన్నాయా? ప్రవాసాంధ్రుల నుంచి పెట్టుబడులు స్వీకరించాలంటే ఉన్న ఇబ్బందులేంటి? ఇలాంటి అన్ని అంశాలపైనా ప్రభుత్వం నియమించిన కమిటీ కసరత్తు చేస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ పరిశీలించి, ఒక వినూత్న విధానాన్ని రూపొందించనున్నట్టు కమిటీ సభ్యుడొకరు పేర్కొన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కొన్ని రాష్ట్రాలు బాండ్లు, డిపాజిట్ల ద్వారా ప్రజల నుంచి నిధులు సమీకరించేందుకు అనుసరించిన ప్రక్రియల్నీ కమిటీ అధ్యయనం చేస్తోంది. 
ఎక్కువ వడ్డీ ఇవ్వడం ద్వారా...:  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లకు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తే ఎక్కువ మంది పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ రాజధాని కోసం సేకరించే బాండ్లకూ ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించలేదు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కంటే ఎక్కువ శాతం వడ్డీ ఇవ్వడం ద్వారా ప్రజల నుంచి పెట్టుబడులు ఆకర్షించాలన్నది ప్రభుత్వం ఆలోచన. 
2. విరాళాలు: రాజధాని నిర్మాణం తెలుగు ప్రజల భావోద్వేగంతో ముడిపడిన అంశంగా భావిస్తున్నారు కాబట్టి, ప్రజల నుంచి విరాళాలు సేకరించడం ఒక విధానం. ‘నా అమరావతి-నా ఇటుక’ పేరుతో ఇలాంటి ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. ఆర్‌బీఐ అనుమతులు లేకపోవడంతో ఇది వరకు ప్రవాసాంధ్రులు దీనిలో పాలుపంచుకోలేకపోయారు. ఇప్పుడు వారి నుంచీ విరాళాలు సేకరించేందుకు అవసరమైన విధానం రూపొందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి విదేశీ నగదు నియంత్రణ చట్టాన్ని అనుసరించి ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలి. 
3. ప్రత్యామ్నాయ పెట్టబడి నిధి (ఆల్టర్నేట్‌ ఇన్వెస్ట్‌మెండ్‌ ఫండ్‌): దీనిలో కేటగిరీ-1, కేటగిరీ-2 ఉన్నాయి. మొదటి కేటగిరీ డెట్‌ ఫండ్‌. అంటే అప్పు రూపంలో మాత్రమే నిధులు తీసుకోగలుగుతారు. రెండోది డెట్‌ కం ఈక్విటీ ఫండ్‌. ఈ కేటగిరీలో ఈక్విటీల (పెట్టుబడులు) రూపంలో నిధులు సమీకరించవచ్చు. రాజధానిలో చేసేది ప్రధానంగా మౌలిక వసతుల నిర్మాణం కాబట్టి, వాటిపై తిరిగి వచ్చే ఆదాయం ఏమీ ఉండదు. ఇక్కడ డెట్‌ ఫండ్‌ ద్వారా నిధుల సమీకరణకే ఎక్కువ అనుకూలం. ఇందులో ఇక్కడి ప్రజలతో పాటు, ప్రవాసాంధ్రులూ పెట్టుబడులు పెట్టొచ్చు. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (రీట్స్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (ఇన్విట్స్‌) వంటి మార్గాలు మన దేశంలోను ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటినీ రాజధానికి నిధుల సమీకరణ కోసం పరిశీలించనున్నారు. 
4. విదేశీ వాణిజ్య రుణాలు (ఎక్స్టర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్స్‌): ప్రవాసాంధ్రులు, ఎన్‌ఆర్‌ఐలు విదేశాల్లో ఏర్పాటు చేసిన సంస్థల ద్వారా నిధులు సమీకరించే విధానం. 
5. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీఎఫ్‌సీ): ప్రభుత్వం ఏదైనా ఎన్‌బీఎఫ్‌సీని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించవచ్చు. సేకరించిన నిధుల్ని ఎన్‌బీఎఫ్‌సీ రాజధాని నిర్మాణానికి ప్రభుత్వానికి అప్పుగా ఇస్తుంది. ఇప్పటికే ఎన్‌బీఎఫ్‌సీ ఏదైనా ఉంటే సరే... కొత్తగా ఎన్‌బీఎఫ్‌సీ ఏర్పాటు చేసేటట్టయితే... సంస్థ ఏర్పడిన మూడేళ్ల తర్వాతే డిపాజిట్లు స్వీకరించేందుకు వీలుంటుంది. అప్పటి వరకు డిబెంచర్ల రూపంలో నిధులు సమీకరించవచ్చు.


ఏప్రిల్‌ నెలాఖరుకు సంస్థాగత బాండ్లు విడుదల..!

రాజధాని నిర్మాణానికి వివిధ సంస్థల నుంచి బాండ్ల రూపంలో నిధుల సమీకరణకు అవసరమైన ప్రక్రియను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) చాలా రోజుల క్రితమే ప్రారంభించింది. మొదట దేశీయ సంస్థాగత మదుపరుల నుంచి నిధులు సమీకరించేందుకు బాండ్లు విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు అంగీకరించింది. ‘బ్రిక్‌ వర్క్స్‌’ సంస్థ క్రెడిట్‌ రేటింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తోంది. మరో రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని ఏప్రిల్‌ నెలాఖరులోగా బాండ్లు జారీ చేయాలన్నది సీఆర్‌డీఏ ఆలోచన. దాదాపు రూ.2 వేల కోట్లు ఈ మార్గంలో సమీకరించాలన్నది లక్ష్యం. మార్కెట్‌ డిమాండ్‌ని బట్టి రూ.2 వేల కోట్లకు ఒకేసారి బాండ్లు విడుదల చేయాలా? దశలవారీగా వెళ్లాలా? అన్నది నిర్ణయిస్తారు. దేశీయ సంస్థాగత బాండ్లు విడుదల చేసిన రెండు నెలల తర్వాత విదేశాల్లోని సంస్థాగత మదుపరుల నుంచి నిధుల సమీకరణకు ‘మసాలా బాండ్లు’ విడుదల చేయాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. విదేశాల్లోని మదుపరుల నుంచి రూపాయి మారకం విలువలో నిధులు సమీకరించేందుకు ఉద్దేశించినవే ‘మసాలా బాండ్లు’. లండన్‌, సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజిల ద్వారా ఈ బాండ్లు విడుదల చేసే అవకాశం ఉంది. దీని కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ సంస్థను మర్చంట్‌ బ్యాంకర్‌గా నియమించుకుంది. ప్రస్తుతం బాండ్‌ రూపకల్పన దశలో ఉంది. విదేశాల్లో ఈ బాండ్లకు విలువ (క్రెడిట్‌ వర్తీనెస్‌) పెంచేందుకు ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) వంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఐఎఫ్‌సీ ప్రపంచబ్యాంకుకి అనుబంధ సంస్థ. అలాంటి సంస్థలు మసాలా బాండ్లలో పెట్టుబడి పెడితే పలు అంతర్జాతీయ సంస్థలూ ముందుకు వస్తాయని, నిధుల సమీకరణ తేలికవుతుందని సీఆర్‌డీఏ భావిస్తోంది. మసాలా బాండ్ల ద్వారా మరో రూ.1,000 కోట్ల నుంచి 2,000 కోట్ల నిధులు సమీకరించాలన్నది ఆలోచన.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...