Jump to content

ధర్మపోరాట శంఖారావం


TampaChinnodu

Recommended Posts

ధర్మపోరాట శంఖారావం 
నేడు తిరుపతిలో తెదేపా బహిరంగ సభ 
శ్రీవారి దర్శనానంతరం సీఎం రాక 
తెదేపా ప్రజాప్రతినిధులంతా హాజరు 
1.50 లక్షల మందితో నిర్వహణ 
మోదీ వాగ్దాన భంగంపై పోరుబాట 
29ap-main5a.jpg

ఈనాడు, తిరుపతి:  తెలుగుదేశం పార్టీ సోమవారం తిరుపతి వేదికగా ధర్మపోరాట శంఖారావం పూరిస్తోంది. ‘నమ్మక ద్రోహం- కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం’ సభా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు గళమెత్తనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ సుమారు లక్షన్నర మంది సమరశంఖం పూరించనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని తారకరామ మైదానం వేదికవుతోంది. ఈ సభకు రాష్ట్రంలోని తెదేపా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరూ హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తెదేపా చేస్తున్న రాజీలేని పోరాటాన్ని ప్రజలకు తెలియజేయడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా పక్కన పెట్టారన్నది వివరించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయమేఉండటం, తిరుపతి నుంచే తెదేపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే సంప్రదాయం కలిగి ఉండటాన్ని బట్టి ఇది ఎన్నికల ప్రచారానికి నాందిగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. ప్రధాని అభ్యర్థిగా నాడు నరేంద్ర మోదీ తిరుపతిలోని తారకరామ మైదానం వేదికగా రాష్ట్రానికి అనేక వరాలను ప్రకటించారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 30న ఇదే వేదికగా ప్రత్యేక హోదాసహా అనేక హామీలిచ్చారు. రాష్ట్రంలో నిర్మించే రాజధాని.. దిల్లీ కంటే మిన్నగా ఉంటుందని, దేశ రాజధాని రాష్ట్ర రాజధాని ముందు చిన్నబోయేలా ఉండేలా తన వంతు కృషి చేస్తామని వాగ్దానం చేశారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు సహాయం చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత నాలుగేళ్లు పూర్తయినా నాటి హామీల్లో ఒక్కటీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొంటూ తిరుపతి సభా వేదికగా ప్రజలకు వెల్లడించేందుకు ముఖ్యమంత్రి ఉద్యుక్తులయ్యారు. నాడు వాగ్దానం చేసిన వేదికపై నుంచే ప్రధాని మోదీ నమ్మక ద్రోహాన్ని బహిర్గతం చేయనున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

29ap-main5b.jpg

తొలిసారి బహిరంగ సభ 
గత నాలుగేళ్లుగా ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్న సభల్లోనే ముఖ్యమంత్రి పాల్గొంటూ ప్రసంగిస్తున్నారు. అప్పుడప్పుడు నవ నిర్మాణ దీక్ష, పార్టీ కార్యక్రమాలు చేపట్టినా.. ‘పార్టీ బహిరంగ సభ’గా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా పార్టీపరంగా.. తిరుపతి వేదికగా భారీ బహిరంగసభ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెదేపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలో కేంద్రంపై పోరాటానికి తిరుపతినే వేదికగా ఎంచుకున్నారని అవగతమవుతోంది. ఈ సభ తర్వాత రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లోనూ సభలు నిర్వహించే యోచనలో పార్టీ ఉందని సమాచారం. ఇది ఓ రకంగా రానున్న ఎన్నికలకు శంఖారావంగా విశ్లేషిస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు చిత్తూరు జిల్లా శ్రేణులతో పాటు పార్టీ అధినాయకత్వం కృషి చేస్తోంది.

29ap-main5c.jpg

ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. 
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సభా వేదికకు చేరుకుంటారు. అనంతరం నాడు ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా మోదీ ప్రసంగ పాఠాన్ని ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శించనున్నారు. అందులో మోదీ పేర్కొన్న ప్రతి అంశాన్నీ ప్రస్తావిస్తూ నాడు ఏమి హామీ ఇచ్చారు? ఇప్పుడు ఎలా వాగ్దాన భంగానికి పాల్పడ్డారో.. వివరించనున్నారు. తెలుగు ప్రజల ఇలవేల్పు సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే ఇచ్చిన హామీని ఏ విధంగా విస్మరించారనేది విశదీకరించనున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా కేంద్ర ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందో తెలియజేయనున్నారు. పోలవరం, రాజధాని నిర్మాణాలకు ఇప్పటివరకూ నిధులివ్వకుండా ఎలా సహాయ నిరాకరణ చేస్తోందనే విషయాన్ని విపులీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వైపు పయనిస్తుంటే అందుకు కేంద్రం మోకాలడ్డుతోందనేది తెదేపా అభియోగంగా ఉంది. కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. విదేశీ కంపెనీలు రాష్ట్రానికి ఎలా రాగలిగాయి? ఎలా ఆకట్టుకున్నది ఈ సభా వేదికగా ముఖ్యమంత్రి వివరించనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏర్పాట్లు పూర్తి... 
మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో బహిరంగసభ ప్రారంభం కానుంది. మైదానంలో రెండు వేదికలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఒక వేదికను పూర్తిగా సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించారు. మరో వేదికపై నుంచి ముఖ్యమంత్రితోపాటు పార్టీ నాయకులు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బహిరంగసభకు సుమారు లక్షన్నర మంది వస్తారని అంచనా వేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సీసాలు, ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. చిత్తూరు జిల్లాతోపాటు పక్కనే ఉన్న నెల్లూరు, కడప నుంచి పార్టీ శ్రేణులు ఎక్కువ సంఖ్యలో రానున్నారు. రాయలసీమ జిల్లాలపై.. మరీ ప్రత్యేకంగా యువత, మహిళలపై దృష్టి సారించారు. 10వేల మంది కార్యకర్తలకు ఈ బాధ్యతను అప్పగించారు. మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలన్నింటికీ తిరుపతి శివారులోని ఆవిలాల చెరువులో పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా పోలీస్‌ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. వాస్తవానికి వేదికకు చంద్రబాబు సహా నాయకులంతా ర్యాలీగా తరలి రావాలని తొలుత నిర్ణయించారు. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ర్యాలీ యోచనను విరమించుకున్నారు.  సభను విజయవంతం చేసేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేశారు. 15 అంశాలతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం తిరుపతితోపాటు విజయవాడ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి. ఈ సభకు సన్నాహకంగా ఆదివారం ఉదయం తిరుపతిలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు కాగడాల ప్రదర్శన చేపట్టారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియరు నేతలు ఆదివారం రాత్రే నగరానికి చేరుకున్నారు. వేదిక వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, శాసనమండలి చీప్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌ నాలుగు రోజులుగా ఇక్కడే మకాం వేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...