Jump to content

అర్చకుడు అంత అలుసా?


Paidithalli

Recommended Posts

అర్చకుడు అంత అలుసా ?

ఎం.వి.ఆర్.శాస్త్రి 

...........

    పవిత్రమైన తిరుమల ఆలయంలో స్వామివారి కైంకర్యాల విషయంలో , ఆభరణాల విషయంలో  జరుగుతున్న అపచారాల గురించి గళమెత్తిన టి.టి.డి. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ను ఉన్నపళాన తొలగించటం సహించరాని నిరంకుశత్వం. హిందూ దేవస్థానంలో జీతం తీసుకుంటూ చర్చికి పోయి ప్రార్థనలు చేసే అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుబడ్డా ఊరుకుని కడుపులో పెట్టుకుని కాపాడే టి.టి.డి.  ... అనాచారాలను, ఆగమ విరుద్ధ అపచారాలను ప్రశ్నించిన ప్రధాన అర్చకుడికి ఆగమేఘాల మీద ఉద్వాసన చెప్పటం శ్రీవారి భక్తులకు, హిందువులు యావన్మందికీ ఒళ్ళు మండించే కండ కావరం.  ఇది కేవలం టి టి డి  అధికారుల పుర్రెకు పుట్టిన బుద్ది అనుకోలేము. పై స్థాయిలో రాజకీయ పాలకుల ఆమోదం, ప్రేరేపణ లేకుండా ఇటువంటి తీవ్ర చర్యకు పాల్పడ తారని నమ్మలేము.

     రమణ దీక్షితులు నిన్న చెన్నై  లో మీడియా ముందు చెప్పిన మాటలను తేలికగా తీసివేయటానికి వీల్లేదు. ఇన్నాళ్ళూ మిన్నకుండి ఆయన ఇప్పుడే  ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు , ఆయన వెనక ఎవరున్నారు అంటూ పాయింట్లు లాగి దురుద్దేశాలను ఆపాదించటం మూర్ఖత్వం.

     రమణ దీక్షితులు మచ్చ లేని సచ్చరిత్రుడు  అవునా కాదా అన్నది కాదు ప్రశ్న. వి ఐ పి ల సేవల రంధిలో స్వామివారి సేవల పవిత్రతకు   అపచారం చేస్తున్నారు అని ఆయన అధికారులపై ఇప్పుడు చేస్తున్న  అభియోగం లాంటిది గతంలో ఆయన మీద కూడా వినవచ్చిన మాట నిజం. తన కుమారులకు ఆనువంశిక అర్చకత్వం దక్కకుండా స్థానభ్రంశం కలిగించినండువల్లే ఆయన ఆగ్రహించాడన్న అభిప్రాయం లో నిజమెంత అన్నది ఇక్కడ ప్రధానాంశం కాదు.

    ప్రాతఃకాలాన చేయవలసిన సుప్రభాత సేవను అర్ధరాత్రే కానివ్వమని వి.ఐ.పి.ల సేవలో తరించే అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారనీ ..

    తోమాల సేవ వంటివి కూడా సరిగా చేయనివ్వకుండా తొందర పెడుతున్నారనీ ..

    ఆగమ నియమాలకు విరుద్ధంగా ఎన్నో అపచారాలు జరుగుతున్నాయనీ  ..

    కృష్ణ దేవరాయల కాలం నుంచీ ఉన్న అపురూప ఆభరణాలకు సరైన లెక్క , భద్రత కరవైందనీ ..

    ఆలయ పవిత్రతను ఇక భక్తులే కాపాడుకోవాలనీ ...

    సాక్షాత్తూ శ్రీవారి ప్రధాన అర్చకుడే బాహాటంగా మొత్తుకున్నాడంటే  పరిస్థితి ఎంతగా విషమించిందో అర్థమవుతుంది. నిజానికి ఇవన్నీ కొత్తగా ఇప్పుడే ... రమణ దీక్షితులు చెప్పటం వల్లే లోకానికి తెలిసినవి కావు. మీడియాలో చాలా  కాలంగా బయట పడుతున్నవే , ఎందఱో పెద్దలు, ప్రముఖులు ఎప్పటినుంచో  తీవ్రాందోళన వెలిబుచ్చుతున్న అవకతవకలే ఇవి ! ఇప్పటిదాకా ఇతరులు చెబుతూ వస్తున్నవి ఎంతవరకూ వాస్తవమన్న విషయంలో కొంత సంశయలాభానికి ఆస్కారం ఉండేది. స్వయానా ప్రధాన అర్చకుడే అపచారాలను ధృవీకరించటంతో ఆ అసందిగ్ధతా తొలగింది. ఇక మావల్ల కాదు మీ గుడిని మీరే కాపాడుకోండి అని ప్రధానార్చకుడే చేతులెత్తేసే పరిస్థితి ఎందుకొచ్చింది , ఎవరివల్ల  దాపురించింది , దీనిపై ఏమి చేయాలన్నది భగవంతుడి మీద , సనాతన ధర్మం మీద భక్తీ, విశ్వాసం ఉన్న ప్రతి హిందువూ తనకు తాను ఆలోచించాలి.

    వెంకటేశ్వరుడి సొమ్ముతో బతుకుతూ చర్చికి , మసీదుకు పోయి అన్యమతాలకు భజన చేసే ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారని తెలిసినా చేమ కుట్టినపాటి అయినా చలించని అధికారులూ ..

     హిందూ దేవస్థానాలలో వేరే మతస్థులు కొలువు చేయటం లో తప్పేమిటని ప్రశ్నించే న్యాయమూర్తులూ ...

    వేరే మతస్థులైన ఉద్యోగులకు న్యాయం చేయటానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పే దేవస్థానం చైర్మన్లూ ...

    పెద్ద పెద్ద జడ్జీల , రాజ్యాంగేతర  అధికార కేంద్రాల ప్రాపకంతో ఏళ్ల తరబడి కొండ మీద పాతుకుపోయిన ఉన్నతాధికార గ్రంథ సాంగులూ ..

    బాగ్ లో , కారు లో ఎప్పుడూ బైబిల్ పెట్టుకుని తిరుగుతామనేవారినీ , క్రైస్తవ మత వేడుకలలో గెస్టులుగా పాల్గోనేవారినీ ఏరికోరి బోర్డు మెంబర్లను చేసే రాజకీయ మారాజులూ ...

    అనాదిగా వస్తున్నపవిత్ర సంప్రదాయాలనూ, విదివిధానాలనూ ఇష్టానుసారం మార్చేసే అధికార మదాంధులూ , అపర ఔరంగజేబుల్లా వెయ్యికాళ్ల మంటపం లాంటి  ప్రాచీన కట్టడాలను కూల్చిపారేసే గుడి పెత్తందారులూ   ...

    ఇతర మతాల పవిత్రాలయాలు  వేటికీ లేని దిక్కుమాలిన  ప్రభుత్వ కంట్రోళ్ళను దిక్కులేని హిందూమతానికి మాత్రమే తెచ్చి రుద్దిన పాపిష్టి చట్టాలూ ...

     ఆ చట్టాల ఆసరాతో అడ్డూ అదుపూ లేకుండా బరితెగించిన అవినీతిమయమైన అధికార పిశాచాలూ చల్లగా ఉన్నంత కాలం ...

     తమ పవిత్ర మత సంస్థలనూ , ధార్మిక వ్యవస్థ లనూ, మహిమాన్విత పుణ్య క్షేత్రాలనూ తామే  పరిరక్షించుకోవాలన్న  తెలివి, చేవ , మగటిమి హిందూ సమాజానికి కలగనంతవరకూ..

     హిందూ మత సంస్థలుగా చలామణీ అయ్యే దుకాణాలకు బద్ధకం , పిరికితనం వదలనంతవరకూ ...

     ఈ కథ ఇంతే. అవినీతిపరులదీ , దైవ ద్రోహులదీ ( దేవుడి ఆగ్రహానికి గురి కానంతవరకూ ) ఆడింది ఆటే.

   చెప్పా పెట్టకుండా , ఎలాంటి విచారణా లేకుండా , గుడి పెత్తందారులు, వారి రాజకీయ యజమానులూ తలచిందే తడవుగా ప్రధాన అర్చకుడిని  తొలగించటం పవిత్ర ఆలయ వ్యవస్థకు అపచారం .మొత్తం హిందూ సమాజానికి  అవమానం.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...