Jump to content

** Dr JP’s article on ‘Status of Union Commitments to Andhra Pradesh’ published in Eenadu today 10th April 2018


BhagBhagDKBose

Recommended Posts

ప్రధాన వ్యాఖ్యానం  

నిపుణులు తేల్చిన నిజాలు

 9opi1a.jpg

విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేసింది. విభజన హామీల అమలును పూర్తిగా విస్మరించారు. 9,10 షెడ్యూల్‌లోని సంస్థల విభజనకు చొరవ తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదు. 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి ప్రత్యేక హోదాకు గండి కొట్టారు. విభజన హామీలను విస్మరించి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారు.

- ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు

 
 

9opi1c.jpg

ప్రత్యేక హోదా రూపంలో వచ్చే ప్రయోజనాల కన్నా ఆంధ్రప్రదేశ్‌కు మేం ఎక్కువే చేశాం. మేం ఇచ్చిన నిధులను సహేతుకంగా ఉపయోగించుకొని, రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విఫలమైంది. నిధుల వ్యయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లెక్కలూ ఇవ్వలేదు.

- ప్రధాని నరేంద్ర మోదీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అంతకుమునుపు ఏర్పడిన కొత్త రాష్ట్రాల తీరుకు భిన్నంగా అసాధారణ పద్ధతిలో జరిగింది. నిజమైన ఫెడరల్‌ వ్యవస్థలో రాష్ట్రాల ఉనికిని యూనియన్‌ ప్రభుత్వం ఏకపక్షంగా మార్చలేదు. అయితే మన రాజ్యాంగంలో ఒక రాష్ట్రం విభజనకు అంగీకరించితేనే రాష్ట్ర విభజన జరగాలన్న నిబంధన లేదన్న సాంకేతిక కారణాన్ని చూపి, రాష్ట్ర శాసనసభ విభజనను తిరస్కరించినా, రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా, అన్ని ప్రాంతాల మధ్య ఒప్పందం లేకుండానే పార్లమెంటు 2014లో ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంప్రదాయమే కొనసాగితే జాతీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి ప్రాంతంలో, రాష్ట్రంలో ఏదో ఒకరకంగా తంపులు తీసుకువచ్చి, రాష్ట్రాల విభజనకు పాల్పడేవారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ విభజన వల్ల ప్రధాన జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలకు ఎలాంటి రాజకీయ లబ్ధి చేకూరలేదు. నిజానికి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దీంతో భవిష్యత్తులో రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల విభజనను ఎత్తుగడగా ప్రయోగించే అవకాశం లేకుండా పోయింది. దేశ ఫెడరల్‌ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం తప్పింది.

9opi1f.jpg

ఆర్థిక లోటుతో సతమతం
ఆంధ్రప్రదేశ్‌ విభజన పర్యవసానాలు నవ్యాంధ్రను ఇంకా బాధిస్తూనే ఉన్నాయి. హైదరాబాదు నగరాన్ని ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ కోల్పోవడం వల్ల రెండు తీవ్ర నష్టాలు వాటిల్లాయి. మహానగరాల్లోనే సంపదసృష్టి ఎక్కువగా జరగడంతో ప్రభుత్వాలకు పన్నుల ఆదాయం అత్యధికంగా నగరాల నుంచే వస్తుంది. హైదరాబాద్‌ నగరంలో 2012-13 సంవత్సరంలోనే ప్రభుత్వానికి రూ.12,000 కోట్లకు పైగా మిగులు ఉండగా, దాన్ని ఆనాటి రాష్ట్రంలో మిగిలిన 22 జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం వినియోగించేది. ఈవేళ ఆ మిగులు బహుశా ఏడాదికి రూ.25-30 వేలకోట్ల దాకా ఉండొచ్చు. ఈ మిగులు అంతా తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది కాబట్టి, ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల ఆదాయంలో గండి పడింది. జీతభత్యాలు, పాలన వ్యయాలు, నడుస్తున్న పథకాలు తగ్గించడం సాధ్యంకాదు కాబట్టి రాష్ట్రానికి ఆర్థికలోటు బాగా పెరిగింది. రెండో సమస్య, గతంలో పాలకులకు దూరదృష్టి లేకపోవటంతో అన్ని విద్య, ఆరోగ్య అవకాశాలు, శిక్షణా సంస్థలు, శాస్త్రపరిశోధన సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ప్రధానంగా హైదరాబాద్‌ నగరంలోనే ఏర్పడ్డాయి. దాంతో విద్య, ఆరోగ్య, పరిపాలన, శాస్త్ర పరిశోధన సంస్థల లోపం ఒకపక్క, కొత్తగా ఉపాధి కల్పించే పరిశ్రమల లోటు మరోపక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలయ్యాయి. రాజధాని మహానగరం ఉన్న ప్రాంతం విడిపోవాలని కోరుకొని సాధించుకోవటం ఇదే తొలిసారి.

ఈ ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ద్వారా, ప్రధానమంత్రి పార్లమెంటులో 2014 ఫిబ్రవరి 20న చేసిన నిర్దిష్టమైన ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చటానికి చట్టబద్ధ ఏర్పాట్లు చేశారు. కాని గత అయిదు సంవత్సరాల్లో ఈ హామీల్లో కొన్ని పాక్షికంగానే అమలయ్యాయి. చాలా వాగ్దానాలు అమలుకు నోచుకోలేదు. చట్టంలోను, సుదీర్ఘ చర్చ, మంత్రిమండలి నిర్ణయాల తరవాత ప్రధాని చేసిన ప్రకటనలో ఉన్న హామీలూ అమలుకాకపోతే చట్టాల మీద, ప్రభుత్వాల మీద, పార్లమెంటు మీద ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. యూనియన్‌-రాష్ట్రాల సంబంధాల్లో అపనమ్మకం చోటుచేసుకుంటే ఫెడరల్‌ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, దేశ ఐక్యతకు దీర్ఘకాలంలో సవాళ్ళు ఎదురవుతాయి. అయితే ప్రతి అంశాన్ని దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోణం నుంచి కాకుండా, పక్షపాత రాజకీయ దృక్పథంతో చూడటం వల్ల, మన బహిరంగ చర్చలో ప్రజల ప్రయోజనాలు కాకుండా పార్టీల అధికార క్రీడ మాత్రమే చోటు చేసుకోవడం వల్ల, అసలు ఏ మేరకు యూనియన్‌ ఇచ్చిన నిర్దిష్ట హామీలు అమలయ్యాయనే వాస్తవాలను తెలుసుకోవడమే కష్టమైంది. అభిప్రాయాలు ఎన్నైనా ఉండవచ్చు కాని, వాస్తవం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. వాస్తవాలతో సంబంధంలేని అభిప్రాయాలు చవకైనవి, నిరర్థకమైనవి, జనహితాన్ని దెబ్బతీసేవి. కాబట్టి ప్రజాస్వామ్య పీఠం చొరవతో స్వతంత్ర నిపుణుల బృందం నిశితంగా పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చింది. ఆ నివేదికను నలుగురు జాతీయ నిపుణులు- తెలుగు రాష్ట్రాలకు చెందనివారు అధ్యయనం చేసి, మెరుగులు దిద్ది ధ్రువీకరించారు. ఆ నిపుణుల నివేదిక ప్రకారం యూనియన్‌ చాలా హామీల విషయంలో రాష్ట్రానికి బాకీ పడింది. 2019 లోక్‌సభ ఎన్నిక తరవాత ప్రభుత్వాన్ని ఏ కూటమి ఏర్పాటు చేసినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా కృషిచేసి హక్కుల్ని సాధించుకోవడం; ఇప్పటి నుంచే సమాజం, పత్రికలు, పార్టీలు అందుకు తగ్గ వ్యూహాన్ని రచించడం అవసరం. అధికారం కోసం జరిగే పోరాటంలో ప్రజల ప్రయోజనాలు మరుగునపడితే చరిత్ర క్షమించదు.
 

9opi1e.jpgక్లుప్తంగా ఏ అంశాల మీద రాష్ట్రానికి యూనియన్‌ నుంచి సహాయం ఇంకా అందాల్సి ఉందో చూస్తే, ఆ సహాయం అందకపోవడం వల్ల అభివృద్ధిరీత్యా గాని, మౌలిక సదుపాయాల కల్పనలో గాని, పెట్టుబడుల్లో గాని రాష్ట్రం ఎంత నష్టపోతోందో అర్థమవుతుంది.

మొదటిది: రాష్ట్ర వనరుల లోటును పూడ్చటం. 2015-20 కాలంలో రెవిన్యూలోటును అంచనా వేసి పూడ్చటానికి 14వ ఆర్థిక సంఘానికి నివేదించారు. 14వ ఆర్థిక సంఘం 2015-20 కాలంలో లోటును రూ.22,112 కోట్లుగా అంచనా వేసి, ఇతర రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కూ ఆ లోటును భర్తీ చేయడానికి వార్షిక గ్రాంటులను మంజూరు చేసింది. కాని రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరం 2014-15లోని లోటు ఆర్థిక సంఘం పరిశీలనలో లేదు కాబట్టి, ఆ లోటును యూనియన్‌ భర్తీ చెయ్యాలి. 2014-15 సంవత్సరానికి రాజ్యాంగ సంస్థ కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ లెక్కల ప్రకారం రెవిన్యూలోటును రూ.16,078.76 కోట్లుగా తేల్చారు. ఇదికాక ఆ సంవత్సరంలో ఖర్చుపెట్టే బాధ్యత ఉన్నా (ప్రధానంగా ఉద్యోగులకు సవరించిన వేతనాలు, ఖజానాలో డబ్బులేక చెల్లించని బిల్లులు కలిపి) రూ.6,870 కోట్ల మేరకు వ్యయాన్ని తరవాతి సంవత్సరానికి వాయిదా వేశారు. 2015-16లో ఆ డబ్బును ఖర్చు పెట్టారు. అయితే ఆ ఖర్చు కిందటి సంవత్సరానిది కాబట్టి లోటు పెరుగుతుంది. కాని ఆర్థికసంఘం ఆ లోటును భర్తీ చేయదు. అందువల్ల వాయిదా వేసిన ఖర్చు 2014-15 వనరుల లోటులో భాగం. ఇలా మొత్తం కలిపి 2014-15లో రూ.22,948.76 కోట్ల వనరుల లోటు తేలింది. ఈ లోటులో నుంచి నిపుణుల కమిటీ రుణమాఫీలపైన ఆ సంవత్సరం పెట్టిన రూ.7,069.67 కోట్లను, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పెంచిన సాంఘిక సంక్షేమ పింఛన్ల మొత్తం రూ.1590.74 కోట్లను తొలగించింది. అవి పోగా, యూనియన్‌ భర్తీ చేయాల్సిన మిగిలిన వనరుల లోటు రూ.14,288.35 కోట్లు. అయితే అయిదేళ్ళ తరవాత ఈనాటి వరకు రాష్ట్రానికి అందింది, లేదా హామీ ఇచ్చింది కేవలం రూ.4117.89 కోట్లు మాత్రమే. అంటే కనీసం రూ.10,308.85 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. కేవలం ఎనిమిది శాతం వడ్డీ వేసుకున్నా ఈ మొత్తం ఈనాటికి దాదాపు రూ.13,800 కోట్లు దాటుతుంది. ఆర్థికంగా లోటును భరిస్తున్న రాష్ట్రానికి ఈ వనరులు అందకపోవటంతో సహజంగానే అభివృద్ధికి ఆటంకం అవుతుంది.

రెండోది: విభజన చట్టంలో దొర్లిన పొరపాటు వల్ల, పరిశ్రమల మీద పన్నుల బాకీలు హైదరాబాదులోనే వాటి కేంద్ర కార్యాలయాలుండటంతో తెలంగాణకు చెందుతాయి. కాని ప్రభుత్వం పరిశ్రమలకు ఏమైనా తిరిగి చెల్లించాల్సి వస్తే, ఆ బరువు పరిశ్రమ ఉన్న రాష్ట్రం మీద పడుతుంది. ఉదాహరణకు కృష్ణపట్నం పోర్టు తీరప్రాంతంలో ఉన్నప్పటికీ, ఆ కంపెనీ చెల్లించాల్సిన రూ.92.98 కోట్ల బకాయిలు తెలంగాణకు చేరింది. కాని ఆ కంపెనీకి ప్రభుత్వం ఏమన్నా గత వసూళ్ళను తిరిగి చెల్లించాలంటే ఆ భారం ఆంధ్రప్రదేశ్‌ మీద పడుతుంది. అలాకాక పన్నుల వసూళ్ళు, తిరిగి చెల్లింపుల భారం- రెండింటినీ జనాభా దామాషా పద్ధతిలో పంచుకుంటే, ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా రూ.3,820.36 కోట్లు రావాలి. ప్రస్తుతం ఈ మొత్తాన్ని రాష్ట్రం కోల్పోయింది. పొరపాటు పార్లమెంటు చేసిన చట్టం వల్ల జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చే బాధ్యత యూనియన్‌ ప్రభుత్వమే తీసుకోవాలి.

మూడోది: ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు అందుతున్న రీతిలో కేంద్ర ప్రతిపాదిత పథకాల్లో 90 శాతం నిధులు యూనియన్‌ నుంచి వస్తే, అయిదేళ్ళ కాలంలో రాష్ట్రానికి రూ.16,447 కోట్లు గ్రాంటుగా రావాలి. ఇందుకు యూనియన్‌ అంగీకరించింది. అయితే ఒక మడత పేచీ పెట్టింది. ఈ డబ్బును విదేశీ రుణాలతో అమలుచేసే ప్రాజెక్టుల ద్వారా మాత్రమే ఇస్తామని షరతు పెట్టింది. కాని ఈ ప్రాజెక్టుల ద్వారా దేశమంతా వచ్చే డబ్బు ఏడాదికి సగటున రూ.10,000 కోట్లు మాత్రమే. వీటి ద్వారా రాష్ట్రానికి 2018 డిసెంబరు దాకా అందింది కేవలం రూ.16 కోట్లు లోపే. అంటే నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుంది. ఈ రూ.16,447 కోట్ల డబ్బును ఇతర అప్పుల చెల్లింపు రూపంలో రాష్ట్రానికి అందించే ఏర్పాటు చెయ్యడం సమంజసం. అదే నిపుణుల కమిటీ తీర్మానించింది.

నాలుగోది: పోలవరం ప్రాజెక్టు. యూనియన్‌ ఇస్తున్న సాయంతో పోలవరం ప్రాజెక్టు వేగంగా అమలవుతోంది. యూనియన్‌ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మిస్తోంది. దేశంలో ఇంత వేగంగా, రికార్డు స్థాయిలో అమలవుతున్న ఏకైక జాతీయ ప్రాజెక్టు ఇదే. అయితే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పోలవరం మీద చేసిన వ్యయం మార్చి 31, 2019నాటికి రూ.11,210.74 కోట్లు. యూనియన్‌ విడుదల చేసింది ఇప్పటివరకు రూ.6,727.26 కోటు.్ల అంటే రాష్ట్రం ఖర్చు చేసి, రావాల్సిన బకాయిలు రూ.4,483.48 కోట్లు ఉన్నాయి. వెంటనే బకాయిలు చెల్లించి, ప్రాజెక్టును వేగంగా గడువు లోపలే పూర్తి చేసే ఏర్పాట్లు చేయడం అవసరం. అయితే ఇక్కడ వనరుల విడుదలలో జాప్యం తప్ప, మరే వివాదం ప్రస్తుతానికి లేదు.

అయిదోది: వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేకసాయం అందజేస్తామని యూనియన్‌ హామీనిచ్చింది. అయితే 1.83 కోట్ల జనాభా ఉన్న బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి 2009-2017 మధ్య మొత్తం రూ.11,866 కోట్ల సాయం అందింది. ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడిన ప్రాంతాల (ప్రకాశం జిల్లా మార్కాపూర్‌ డివిజన్‌తో కలిపి) జనాభా 2.52 కోట్లుంది. ఈ జనాభాను, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు కనీసం రూ.25,302 కోట్లు సాయం అందాలి. కాని ఇప్పటివరకు కేవలం రూ.1,050 కోట్లు మాత్రమే రాష్ట్రానికి అందింది.

ఆరోది: దుగరాజపట్నంలో రూ.7,988 కోట్ల ఖర్చుతో మేజర్‌పోర్టు నిర్మాణం. గతంలోనే మంజూరైన ఈ ప్రాజెక్టును విభజన చట్టంలో చేర్చారు. కాని ఆ స్థలం అనువుగా లేదన్న కారణంతో యూనియన్‌ ప్రభుత్వం ఇప్పటిదాకా పోర్టు నిర్మాణాన్ని చేపట్టలేదు. సాంకేతికంగా అనువైన స్థలంలో మేజర్‌పోర్టును నిర్మించడం, లేదా దానికి ప్రత్యామ్నాయంగా అంత ఖర్చుకు తగ్గకుండా అదనపు మౌలిక సదుపాయాలు రాష్ట్రం కోరిన రీతిలో నిర్మించడం అత్యవసరం.

ఏడోది: పదకొండు జాతీయ ప్రాధాన్యతగల విద్య, ఆరోగ్య సంస్థలను యూనియన్‌ ఏర్పాటు చేయాలని చట్టంలో ఉంది. వీటి కోసం కేంద్రం చెయ్యాల్సిన మొత్తం వ్యయం రూ.12,746.38 కోట్లు. రాష్ట్రం తన వాటాని భూమి, మౌలిక సదుపాయాల రూపంలో ఇప్పటికే ఖర్చు చేసింది. అయితే యూనియన్‌ ఇప్పటికి రూ.845.42 కోట్లు- అంటే 6.63 శాతం మాత్రమే విడుదల చేసింది. మిగిలిన 93 శాతాన్ని వేగంగా విడుదల చేసి అన్ని సంస్థలను పూర్తిస్థాయిలో వచ్చే అయిదేళ్ళలో ఏర్పాటు చెయ్యడం అవసరం.

ఎనిమిదోది: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అదనపు సాయాన్ని ఇస్తామని, కొత్త రాష్ట్ర రాజధానికి రోడ్లు, రైలు, ఇతర రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్న హామీని చట్టంలో చేర్చారు. ఇప్పటివరకు 13వ షెడ్యూల్‌లో ఉన్న అంశాల్లో అయిందింటిని అసలు అమలు చేయలేదు. మూడు పథకాలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి. ముఖ్యంగా పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, రాజధానికి రోడ్డు, రైలు సౌకర్యాలు రాష్ట్రాభివృద్ధికి కీలకం. వాటిని వేగంగా అమలు చేయడం, ఉదారంగా సాయం చేయడం అవసరం.

తొమ్మిదోది: రాజధాని నిర్మాణం కోసం సాయం. అమరావతిని ఒక ప్రధాన నగరంగా తీర్చిదిద్దడానికి రూ.1,09,023 కోట్లతో బృహత్తర పథకాన్ని రూపొందించి రాష్ట్రం అమలు చేస్తోంది. ఇప్పటిదాకా కేవలం రూ.1,500 కోట్లు రాజధానికి, మరో రూ.1,000 కోట్లు గుంటూరు, విజయవాడ నగరాల డ్రైనేజీ వ్యవస్థకు యూనియన్‌ విడుదల చేసింది. రాష్ట్రం ప్రతిపాదించిన మొత్తం పథకాన్ని యూనియన్‌ మంజూరు చెయ్యడం సాధ్యం కాదు. కాని ప్రభుత్వ కార్యాలయాలు వగైరాలతోపాటు, ఒక మంచి నగర నిర్మాణానికి కావలసిన మౌలిక సదుపాయాలు- రోడ్లు, వరద నివారణ, మురికినీటి పారుదల, మంచినీటి సదుపాయం, ప్రజారవాణా, నగరానికి కావలసిన రోడ్డు, రైలు సౌకర్యాలు... ఈ మేరకు అంచనా వేసి రాష్ట్రానికి సాయం చేయడం అవసరం. ఈ అవసరమైన మౌలిక సదుపాయాలకు సాయం అందించాలని చట్టంలోని 93వ సెక్షన్‌ నిర్దేశించింది.

9opi1b.jpg

కంటితుడుపు చర్యలు
ఇక ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్న రీతిలో పెట్టుబడులపైన పన్ను రాయితీల అంశం! ఇప్పుడిచ్చిన పన్ను రాయితీలు కేవలం నామమాత్రం, కంటితుడుపు చర్యలే. యూనియన్‌ ఆంధ్రప్రదేశ్‌తోను, ఇతర రాష్ట్రాలతోను చర్చించి ఆమోదయోగ్యమైన మేరకు రాయితీలు ఇవ్వాలి. పన్ను రాయితీలతోపాటు రాష్ట్రంలో పారిశ్రామికీకరణ కోసం మొత్తం పెట్టుబడులను యూనియన్‌ భరిస్తూ మెగా ప్రాజెక్టులు, క్లస్టర్‌ అభివృద్ధి పథకాలు చేపట్టాలి. సంకల్పం ఉంటే రాష్ట్రానికి చిత్తశుద్ధితో సాయం చేయటం సాధ్యం. ఈ మొత్తం అందాల్సిన సాయం వెంటనే నగదు రూపంలోనే ఇవ్వాలంటే యూనియన్‌కూ సాధ్యం కాకపోవచ్చు. వనరుల కొరత ఉంటే ఇతర రూపాల్లో సాయాన్ని అందించవచ్చు. రాష్ట్రం యూనియన్‌కు ఇవ్వాల్సిన బాకీలు చాలా ఉంటాయి. వాటిని చెలు్లవేస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది. అదే సమయంలో యూనియన్‌కు అదనపు భారం పడదు. అలాగే రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక బాండులని విడుదల చేసి సేకరించిన డబ్బును రాష్ట్రానికి గ్రాంటు రూపంలో ఇవ్వవచ్చు. తిరిగి చెల్లించే బాధ్యతను యూనియన్‌ తీసుకుంటుంది. ఇలా వివిధ రూపాల్లో యూనియన్‌కి వెంటనే నగదు రూపంలో ఖర్చు కాకుండా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించడం అవసరం.

ఆంధ్రప్రదేశ్‌ విభజన ఫెడరల్‌ సూత్రాలకు విరుద్ధంగా, ఏకపక్షంగా, బలవంతంగా జరిగిన ప్రక్రియ. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గమనించి చట్టపరంగా నిర్దిష్ట హామీలను ఇచ్చారు. వాటిని వేగంగా, సంతృప్తికరంగా, నిజాయతీగా అమలు చెయ్యకపోతే యూనియన్‌ విశ్వసనీయత, చట్టబద్ధపాలన, ఫెడరల్‌ వ్యవస్థ దెబ్బతింటాయి. ఇప్పటికే యూనియన్‌ ప్రభుత్వం జాప్యం వల్ల, పెడసరి ధోరణి వల్ల చాలా నష్టం వాటిల్లింది. 2019 ఎన్నికల తరవాత రాష్ట్ర ప్రయోజనాలను, దేశ ఐక్యతను కాపాడే రీతిలో నిర్మాణాత్మక పరిష్కారాన్ని సాధించడానికి అన్ని వర్గాలు సంఘటితంగా పనిచేయడం అవసరం. రాజకీయ విద్వేషాలతో, తాత్కాలిక అధికార కాంక్షతో, మన వేళ్ళతో మన కళ్ళనే పొడుచుకుంటే నష్టపోయేది తెలుగు ప్రజలు, జాతి ఐక్యత!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...