Jump to content

అమరావతి సాక్షిగా... అయోమయాంధ్ర!


trent

Recommended Posts

అమరావతి సాక్షిగా... అయోమయాంధ్ర!
ఒకచోట ఉన్న కార్యాలయాలను మరో ప్రాంతానికి తరలించినంత మాత్రాన అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిపోయినట్టేనా? ఇలాంటి విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఉచిత సలహాలు ఇస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ గానీ, ఆయన మంత్రులు గానీ హైదరాబాద్‌లో కొలువుదీరిన ప్రభుత్వ కార్యాలయాలు కొన్నింటిని అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ఎందుకు తరలించడం లేదు? హైదరాబాద్‌ను మరింత విస్తరించే ప్రణాళికలకు స్వస్తిచెప్పి, ఇతర వెనుకబడిన జిల్లాలపై దృష్టిపెట్టడం లేదు ఎందుకు? రాష్ట్రానికి ఆదాయం సమకూర్చిపెడుతున్న హైదరాబాద్‌ను చంపుకొనేంత తెలివి తక్కువవాడు కాదు కేసీఆర్‌! ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మహానగరం అవసరం లేదని జగన్‌ ప్రభుత్వం భావించడం ఆ రాష్ట్ర ప్రజల దురదృష్టం.
 
తెలంగాణలో అధికారంలో ఉన్నవారు ఆంధ్రాలో అధికారంలో ఉన్నవారిని తక్కువ చేసిమాట్లాడినా లేక ప్రజలను చులకన చేసి మాట్లాడినా అది ఆంధ్రప్రదేశ్‌కే అవమానం! అయినా రాజకీయ అవసరాల కోసమో లేక ఎన్నికల సమయంలో చేసిన సహాయానికి కృతజ్ఞతగానో జగన్మోహన్‌ రెడ్డి ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను ఆలింగనం చేసుకుని గంటల తరబడి మంతనాలు జరుపుతూనే ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాలను తిలకించడానికి వెళ్లిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ను అక్కడి వైసీపీ నాయకులు తులాభారంతో సత్కరించారు. రాష్ట్రం విడిపోయి ఆరేళ్లు కావొస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక్క మంత్రికి కూడా తెలంగాణ గడ్డమీద ఇలాంటి సత్కారం జరగలేదు. జరగదు కూడా! ఈ వ్యత్యాసంపై ఆలోచించాల్సిన వాళ్లు ఆ దిశగా ఆలోచించి ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకుని ఉండేవి కావు.
 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తనను తాను గర్భగుడిలోని మూలవిరాట్టుగా భావిస్తున్నట్టున్నారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని చూశాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ధోరణి ఇందుకు విరుద్ధంగా ఉంది. గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి ప్రతిరోజూ తన క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలను కలిసి విజ్ఞప్తులు స్వీకరించేవారు. ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి ఇందుకు పూర్తి భిన్నం. తనకు నచ్చిన లేదా అవసరమైన అతి కొద్దిమంది వ్యక్తులను మినహా ఎవరినీ ఆయన కలవరు. ఎవరితోనూ మాట్లాడరు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ధోరణి కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉంటుంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో రాజధానికి భూములు ఇచ్చిన రైతులతోపాటు ఇతర వర్గాల ప్రజలు ఆందోళన బాట పట్టినా జగన్మోహన్‌ రెడ్డిలో చలనం ఉండదు. రైతులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి కూడా ఆయనకు మనసు రావడం లేదు. ‘రైతులకు ఏమి కావాలో కనుక్కుని సమస్య పరిష్కరించండి’ అని తమను ఆదేశించినట్టుగా మంత్రులు బయటికి చెబుతున్నారు. లోపల జగన్‌ వారితో ఏమన్నారో ఆ దేవుడికే తెలియాలి! రాజధాని విషయమై ప్రజలలో గందరగోళం నెలకొన్నప్పటికీ ఈ విషయంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి తాను ఏమి అనుకుంటున్నదీ బహిరంగంగా చెప్పరు. కమిటీల ద్వారా లేదా మంత్రుల ద్వారా చెప్పిస్తుంటారు. ఆయన ఈ వైఖరి చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది.
 
రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఒక పెద్ద మనిషి... మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్‌ రెడ్డిని అభినందించాలనుకుని అపాయింట్‌మెంట్‌ కోరారు. తనకు అపాయింట్‌మెంట్‌ కావాలని ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కోరగా.. ‘సారీ! ఎవరినీ కలవకూడదని ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. మీకు ఏదైనా పని ఉంటే చెప్పండి’ అని బదులిచ్చారు. దీంతో అవాక్కయిన ఆయన.. ‘నాకు పనేమీ లేదు! కేవలం అభినందించడానికే కలవాలనుకున్నా’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశారు.
 
‘రాజధానిపై ఇంత గందరగోళం ఎందుకు? కనీసం మీరైనా చెప్పవచ్చు కదా?’ అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరిని హైదరాబాద్‌లో ఉండే మరో పెద్ద మనిషి ప్రశ్నించగా.. ‘సర్లెండి! ఏడు నెలలుగా నాకే అపాయింట్‌మెంట్‌ లేదు! నేనేమి చెప్పాలి!’ అని నిట్టూర్చారట.ఈ ఎమ్మెల్యే తరచుగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి.. మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ.. కళ్లెగరేస్తూ మరీ ప్రతిపక్షాలను తిట్టిపోస్తుంటారు కూడా! అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, శాసన సభ్యులదీ ఇదే పరిస్థితి! అయితే తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు మధనపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని రైతులను జగన్మోహన్‌ రెడ్డి కలుసుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది.
 
అనుకున్నది చేసుకుంటూ...
రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్‌ కమిటీ శుక్రవారంనాడు ముఖ్యమంత్రిని కలిసి తమ నివేదికను అందజేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులైన మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అయితే ఆయన ఏమి చెప్పారో చాలా మందికి అర్థంకాలేదు. అమరావతి భూములు నిర్మాణాలకు అనువైనవి కాదని మద్రాస్‌ ఐఐటీ నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఆ సంస్థ ఖండించిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. బొత్స మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు. దీన్నిబట్టి రాజధానిని తరలించాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఆ క్రమంలో అమరావతిపై అవాస్తవాలు ప్రచారం చేసినట్టు స్పష్టమవుతోంది.
 
రాజధాని ప్రాంతాన్ని ముంపుప్రాంతంగా పరిగణించలేమని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్పష్టంగా తీర్పు ఇచ్చినా.. అది ముంపు ప్రాంతమేనని వాదించేవాళ్లకు ఏమి చెప్పగలం? ముందుగానే తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పుడు ప్రాతిపదికను సిద్ధంచేస్తున్నారు. జరుగుతున్నది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై కోపంతోనా, ఒక సామాజికవర్గంపై ఆగ్రహంతోనా అన్నది వేరే విషయం. జరగబోయేది ఏమిటో కళ్లెదుట కనిపిస్తోంది. జగన్మోహన్‌ రెడ్డి ఉద్దేశాన్ని ముక్కుసూటిగా చెప్పాల్సిన మంత్రి బొత్స తికమక పడి ప్రజలను కూడా తికమక పెట్టారు. బొత్స మాటలను విన్నాక కాంగ్రెస్‌ పార్టీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జీకే మూపనార్‌ గుర్తుకు వస్తున్నారు.
 
ఇందిరాగాంధీ హయాంలో మూపనార్‌కు ఎంతో ప్రాధాన్యం ఉండేది. తమిళనాడుకు చెందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా ఉండేవారు. అప్పట్లో ఆయన రాష్ట్రానికి వచ్చారంటే ముఖ్యమంత్రికి మూడినట్టేనన్న అభిప్రాయం ఉండేది. ముఖ్యమంత్రులతో రాజీనామా చేయించడానికై ఇందిరా గాంధీ ఆయనను రాష్ట్రాలకు పంపేవారు. అలా ఒక వెలుగు వెలిగిన మూపనార్‌ మాతృభాష తమిళంలో మాట్లాడినప్పుడు మాత్రం తమిళులకు అర్థమయ్యేది కాదు. దీంతో ఆయన తమిళంలో ఏమి చెప్పారో మరొకరు తమిళంలోనే అనువాదకుడి తరహాలో వివరించి చెప్పేవారు. బొత్స మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలాగే మరొకరు తెలుగులోనే వివరించి చెప్పాలేమో తెలియదు.
 
ఎవరికి మేలు...
ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలపై శుక్రవారంనాడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పది జిల్లాలను 31 జిల్లాలుగా.. తర్వాత 33 జిల్లాలుగా విభజించినా ప్రజలలో అలజడి ఏర్పడ
లేదనీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యదక్షతకు ఇది నిదర్శనమనీ చెప్పుకొచ్చిన ఆయన... ఏపీలో రాజధాని మార్పుపై ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు. రాజధానిని మార్చడాన్ని జిల్లాల విభజనతో పోల్చడం అంటే బోడిగుండుకి – మోకాలికి ముడి పెట్టడమే అవుతుంది. తెలంగాణలో జిల్లాల సంఖ్య పెంచాలనుకున్నప్పుడు కూడా పలు ప్రాంతాల వారు తమ ప్రాంతాన్ని కూడా జిల్లా కేంద్రంగా చేయాలని ఆందోళనలు చేశారు.
 
ఈ కారణంగానే ముందుగా ప్రకటించిన 31 జిల్లాలకు అదనంగా మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం, రెండు నియోజకవర్గాలు మాత్రమే ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి. అలాంటి జిల్లాలకు కలెక్టర్‌గా, ఎస్పీగా నియమితులైన అధికారులు అసంతృప్తితో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 13 జిల్లాలను లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికగా 25 జిల్లాలుగా ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. రాజధాని మార్పు అంటే అలా కాదు కదా? ఇప్పటికే అమరావతిని రాజధానిగా గుర్తించి నిర్మాణాలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కోసం పది వేలకోట్ల రూపాయలకు మించి ఖర్చుచేశారు.
 
ఈ దశలో రాజధానిని తరలించడం అంటే ఆందోళనలు తలెత్తకుండా ఎలా ఉంటాయి? ఈ మధ్యనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరు గంటలపాటు సుదీర్ఘంగా మంతనాలు జరిపారు కదా! రాజధాని తరలింపుపై తలెత్తిన ఆందోళనలను పట్టించుకోవలసిన పని లేదనీ, మూడు రాజధానుల ప్రతిపాదనతో ముందుకు వెళ్లమనీ జగన్మోహన్‌రెడ్డికి కేసీఆర్‌ సూచించినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఇరువురు ముఖ్యమంత్రులు ఖండించలేదు కనుక నిజమేనని భావించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలంగాణకు వరప్రసాదంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తున్నా..హైదరాబాద్‌పై దాని ప్రభావం పడకపోవడానికి అమరావతిని పడుకోబెట్టడమే కారణమన్నది అందరూ అంగీకరిస్తున్న విషయం.
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన నిర్ణయాలతో తెలంగాణకు ఎంతో మేలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని ఉద్దేశించా? లేక ప్రజలను ఉద్దేశించా? అనే అంశంపై స్పష్టత రావలసి ఉంది. తెలంగాణలో అధికారంలో ఉన్నవారు ఆంధ్రాలో అధికారంలో ఉన్నవారిని తక్కువ చేసిమాట్లాడినా లేక ప్రజలను చులకన చేసి మాట్లాడినా అది ఆంధ్రప్రదేశ్‌కే అవమానం! అయినా రాజకీయ అవసరాల కోసమో లేక ఎన్నికల సమయంలో చేసిన సహాయానికి కృతజ్ఞతగానో జగన్మోహన్‌ రెడ్డి ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను ఆలింగనం చేసుకుని గంటల తరబడి మంతనాలు జరుపుతూనే ఉన్నారు.
 
సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాలను తిలకించడానికి వెళ్లిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ను అక్కడి వైసీపీ నాయకులు తులాభారంతో సత్కరించారు. రాష్ట్రం విడిపోయి ఆరేళ్లు కావొస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక్క మంత్రికి కూడా తెలంగాణ గడ్డమీద ఇలాంటి సత్కారం జరగలేదు. జరగదు కూడా! ఈ వ్యత్యాసంపై ఆలోచించాల్సిన వాళ్లు ఆ దిశగా ఆలోచించి ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకుని ఉండేవి కావు.
 
‘లెక్కలేని’ డబ్బులు...
ఈ విషయం అలా ఉంచితే, హైపవర్‌ కమిటీలోని మంత్రులు తనను కలిసినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డబ్బంతా అమరావతిపై ఖర్చుచేస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధి మాటేమిటి? అని జగన్మోహన్‌ రెడ్డి ప్రశ్నించారట! దీనిపై ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ స్పష్టత ఇవ్వాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద అభివృద్ధి చేయడానికి డబ్బు ఉందా? ఉంటే సంక్షేమ పథకాల కోసం ఎప్పటికప్పుడు అప్పులుచేయడం ఎందుకు? ఒకచోట ఉన్న కార్యాలయాలను మరో ప్రాంతానికి తరలించినంత మాత్రాన అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిపోయినట్టేనా? ఇలాంటి విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఉచిత సలహాలు ఇస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ గానీ, ఆయన మంత్రులు గానీ హైదరాబాద్‌లో కొలువు దీరిన ప్రభుత్వ కార్యాలయాలు కొన్నింటిని అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ఎందుకు తరలించడం లేదు? హైదరాబాద్‌ను మరింత విస్తరించే ప్రణాళికలకు స్వస్తిచెప్పి, ఇతర వెనుకబడిన జిల్లాలపై దృష్టిపెట్టడం లేదు ఎందుకు? సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మాత్రమే కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు పరిమితం అయినట్టు? రాష్ట్రానికి ఆదాయం సమకూర్చిపెడుతున్న హైదరాబాద్‌ను చంపుకొనేంత తెలివి తక్కువవాడు కాదు కేసీఆర్‌! ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మహానగరం అవసరం లేదని జగన్‌ ప్రభుత్వం భావించడం ఆ రాష్ట్ర ప్రజల దురదృష్టం.
 
రాజధాని నిర్మాణానికి కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి అన్న మాట నిజమేననీ, అయితే ఆ వెంటనే అది ప్రభుత్వ భూమి అయి ఉండాలని కూడా సూచించారనీ బొత్స సత్యనారాయణ చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో ఉన్న భూమి ప్రభుత్వానిది కాదా? రైతులకు పరిహారం చెల్లించి భూసేకరణ చేయలేదు కదా? ఉచితంగా సమకూరిన భూమిలో కొంత భాగం అమ్ముకుని రాజధానిని నిర్మించవచ్చునని చెబుతున్నా పాలకుల చెవికి ఎక్కకపోవడానికి దురుద్దేశాలే కారణమని స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే రాజధాని తరలింపు నిర్ణయానికి వచ్చినట్టు మంత్రులు చెబుతున్నది నిజమే అనుకుందాం! అధికారంలోకి వచ్చి 8 మాసాలు అవుతున్నా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడానికి కారణం ఏమిటి? ఖజానా నిండుకోవడంతో అభివృద్ధి స్తంభించిన విషయం వాస్తవం కాదా? పోలవరం ప్రాజెక్టుకు కూడా అతీగతి లేకుండా పోయిందే! కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసే నిధులను కూడా సంక్షేమ కార్యక్రమాలకే మళ్లించడం వాస్తవం కాదా? కేంద్రం ఇటీవల వెయ్యి కోట్లకుపైగా ‘కంపా’ నిధులను రాష్ట్రానికి విడుదల చేసింది.
 
ఈ నిధులను అటవీ అభివృద్ధికి ఖర్చుచేయాలి. రాష్ట్రప్రభుత్వం ఆ డబ్బును కూడా సంక్షేమానికే ఖర్చుచేసింది. కేంద్రం నుంచి నిధులు విడుదల అయ్యాయన్న ఉత్సాహంతో అటవీ విస్తరణకు కొంతమంది అధికారులు చర్యలు తీసుకుని 30 కోట్లు ఖర్చుచేశారు. ఇప్పుడు ఆ స్వల్ప ఖర్చుకు కూడా నిధులు లేవని పెండింగులో పెట్టారు. వాస్తవ పరిస్థితి ఇది కాగా.. 13 జిల్లాలను అభివృద్ధి చేస్తామని మంత్రులు గొప్పలు చెబుతున్నారు. ‘ఏమి జరుగుతున్నదో, ఏమి జరగబోతున్నదో మాకు అర్థమవుతోంది. అయినా అంతఃపురం నుంచి వచ్చే ఆదేశాల మేరకు మాట్లాడుతున్నాం’ అని హైపవర్‌ కమిటీలోని ఒక మంత్రి వాపోయారు. రోజూ చచ్చేవాడి కోసం ఏడుపు ఎందుకు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే జీవచ్ఛవం అయ్యింది. ఘనత వహించిన జగన్మోహన్‌ రెడ్డి పుణ్యమా అని రాష్ట్రానికి పెట్టుబడులు రావుగాక రావు! మూడు రాజధానుల విషయం అలా ఉంచితే ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చెందదు. అభివృద్ధి చేయడానికి అవకాశమున్న అమరావతిపై ముఖ్యమంత్రికి మొహం మొత్తింది. చేసేది ఏముంది – అనుభవించడమే!
 
కొత్త పొత్తులు... ఎత్తులు
ఈ విషయం అలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. హుటాహుటిన ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకులను కలిసి మంతనాలు జరిపివచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రస్థాయిలో జరిగిన ఉమ్మడి సమావేశం తర్వాత బీజేపీ–జనసేన మధ్య పొత్తు పొడిచిందని ప్రకటించారు. దీంతో ఆయా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును రక్షించడంతోపాటు మున్ముందు ఆయనను బీజేపీకి సన్నిహితం చేయడానికే పవన్‌ కల్యాణ్‌ ఈ పొత్తు నిర్ణయం ప్రకటించారని అధికార పార్టీ నాయకులు ముక్తకంఠంతో విమర్శల వర్షం కురిపించారు. డామిట్‌... మరి మా సంగతి ఏమిటి? అనుకున్న తెలుగుదేశం పార్టీ చేయగలిగింది ఏమీ లేనందున – ‘మీరు కలిస్తే కలిశారు గానీ, రాజధానిని తరలించకుండా అడ్డుకోండి.
 
లేనిపక్షంలో మీకు ప్రజల ఆదరణ లభించదు’ అని బీజేపీ–జనసేనలను ఇరకాటంలో నెట్టడానికి ప్రయత్నించింది. నిజానికి తెలుగుదేశం లేకుండా బీజేపీ–జనసేన మాత్రమే కలిసి పనిచేస్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్టే అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం వల్ల అధికార పార్టీనే లాభపడుతుంది. ఈ సంగతి తెలుసు కాబట్టే భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీని బీజేపీ–జనసేన కలుపుకోకూడదన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులు విమర్శలు మొదలెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉండి ఉండకపోతే భారతీయ జనతా పార్టీని జనసేనాని కూడా పట్టించుకుని ఉండేవారు కాదు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పెట్టుకుంటే తమ నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా ఆ నాయకులకు ఎదురు వెళ్లడానికి వైసీపీ నాయకులు జంకుతున్నారు.
 
తమతో కలవకుండా బీజేపీ–జనసేన విడిగా పోటీచేస్తే రాజకీయంగా నష్టమని తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా భయం ఉంది. ఈ కారణంగానే రాజధాని అంశాన్ని ఆ పార్టీ తెరమీదకు తెచ్చింది. ఇక జన సైనికులు కూడా తెలుగుదేశం పార్టీ లేకుండా కేవలం బీజేపీతో కలిస్తే ఒరిగేది ఏమీ ఉండదని అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అయినా కొన్ని స్థానాల్లో గెలవవచ్చునన్న ఆశతో జన సైనికులు ఉన్నారు. జన సేనాని దూరం కావడంతో వామపక్షాలు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నాయి. రాజధాని ఉద్యమం పుణ్యమా అని సీపీఐ నాయకులు తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఎటువైపు వెళ్లాలో తెలియక సీపీఎం నాయకులు దిక్కులు చూస్తున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ రాజకీయ పార్టీల్లో మాత్రం హడావుడి మొదలైంది. జన సేనాని అండ లభించడంతో బీజేపీ నాయకులు మాత్రం ప్రస్తుతానికి సంతోషంగా ఉన్నారు.
 
బీజేపీ–జనసేన మధ్య ఇప్పుడు కుదిరిన పొత్తు అక్కడికే పరిమితమైతే దానివల్ల ఆ రెండు పార్టీలకు పెద్దగా లాభించేది ఏమీ ఉండదన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. రాజకీయ పార్టీల లాభనష్టాల విషయం ఎలా ఉన్నా కమలం–సేన కలయిక వల్ల రాజధాని రైతులకైనా ఉపశమనం లభిస్తుందో లేదో వేచిచూడాలి. అయినా పరపతి, విశ్వసనీయత కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ఎవరితో కలిసినా, విడిపోయినా, ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. ఈ పరిస్థితులలో ప్రజలే తమ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మించుకోవడానికై ఉద్యుక్తులు కావడం ఒక్కటే మార్గం. రాజకీయ ప్రత్యర్థులను లం..కొడుకు, దొంగముండా కొడుకు అని బహిరంగంగా తిట్టగలుగుతున్న నాయకులను ఎమ్మెల్యేలుగా గెలిపించినందుకు గర్వపడండి అప్పటిదాకా! 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...