Jump to content

చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?


afacc123

Recommended Posts

బ్రిటిష్ దోచుకెళ్లిన సంపద ఎంత?Image copyrightGETTY IMAGES

బాద్షా జన్మదినం. మొఘల్ చరిత్ర ప్రకారం, ఆ సమయంలో ఆయన్ను తులాభారం వేస్తున్నారు. అదే సమయంలో బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రో సభలో ఉన్నారు.

చుట్టూ నీళ్లు మధ్యలో ఉన్న ఒక భవంతిలో ఆ సంబరాలు జరుగుతున్నాయి. భవనం మధ్యలో బంగారం తాపడం చేసిన ఒక భారీ త్రాసు ఉంది. దానిలోని ఒక పళ్లెంలో చాలా బరువుగా ఉన్న పట్టు సంచులున్నాయి. ఇంకో పళ్లెంలో స్వయంగా నాలుగో మొఘల్ చక్రవర్తి నూరుద్దీన్ మొహమ్మద్ జహంగీర్ కూర్చుని ఉన్నారు.

బరువైన దుస్తులు, బంగారు ఆభరణాలతో కలిసి చక్రవర్తి జహంగీర్ బరువు సుమారు 113 కిలోలు ఉన్నట్టు త్రాసుపై కనిపించింది. ఒక వైపు ఇలాహీ కూర్చుని ఉన్నారు. త్రాసు రెండో పళ్లెంలో ఉన్న పట్టు సంచులను మార్చిమార్చి పెడుతున్నారు. మొఘల్ చక్రవర్తి క్షేమంగా ఉండాలంటూ మొదట ఆయన బరువును వెండి నాణేలతో తూచారు. తర్వాత వాటిని పేదలకు పంచిపెట్టారు. ఆ తర్వాత బంగారు నాణేలతో, తర్వాత ఆభరణాలు, తర్వాత పట్టుబట్టలతో, చివరగా మరికొన్ని విలువైన వస్తువులతో చక్రవర్తి బరువు తూచి వాటిని కూడా పంచేశారు.

ఈ దృశ్యం ఇప్పటికి సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం నాటిది. మొఘల్ చక్రవర్తి నూరుద్దీన్ మొహమ్మద్ జహంగీర్ దర్బార్‌లో జరుగుతున్నదంతా బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రో చూస్తున్నారు. తన డైరీలో దాన్ని నోట్ చేశారు. కానీ ఆ కళ్లు చెదిరే సంపద ప్రదర్శన చూస్తున్న సర్ థామస్‌ మనసులో ఒక సందేహం వచ్చింది. ఆ త్రాసులోని పట్టు సంచుల్లో నిజంగానే వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయా లేక బరువైన రాళ్లు పెట్టి అలా చెబుతున్నారా అనే అనుమానం వచ్చింది.

కానీ, ఎక్కడో సుదూరంగా ఉన్న ఒక చిన్న దీవిలోని దేశం నుంచి వచ్చిన రాయబారి ఆ సమయంలో అక్కడేం చేస్తున్నాడు అనేది ఇక్కడ ఆలోచించాలి.

బ్రిటిష్ దోచుకెళ్లిన సంపద ఎంత? చిత్రం శీర్షికఒక చిన్న బ్రిటిష్ కంపెనీ తెరిచే ఒప్పందం కోసం భారత్ వచ్చిన ఇంగ్లాండ్ రాయబారి సర్ థామస్ రో

ఇంగ్లండ్‌తో ఒప్పందం 'పరువు ప్రతిష్టలకే భంగం'

నిజానికి, సర్ థామస్ ఒక ప్రత్యేక పనిపై ఇంగ్లండ్ నుంచి భారతదేశం వచ్చారు. ఆయన ఎలాగోలా ఒక ఒప్పందంపై సంతకాలు పూర్తిచేస్తే, దాని ప్రకారం భారతదేశంలో ఒక చిన్న బ్రిటిష్ కంపెనీ తెరవచ్చని ఆ దేశం ఆశపడుతోంది.

కానీ సర్ థామస్ డైరీని బట్టి ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే.. ఆ పని అంత సులభంగా పూర్తికాలేదు. దాని కోసం ఈ ఆంగ్లేయుల దూత చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా గొప్పలు చెప్పుకోవాల్సి వచ్చింది. దానికి కారణం ఒక్కటే. ప్రపంచంలో ఒక్క ఇరాన్ సఫ్వీ చక్రవర్తి ఉస్మానీ ఖలీఫా మాత్రమే తన ప్రత్యర్థి అని మొఘల్ చక్రవర్తి భావించేవాడు.

ఆయన దృష్టిలో ఇంగ్లండ్ పెద్దగా ప్రాధాన్యం లేని ఒక చిన్న దీవి. దానిని ఒక చక్రవర్తితో, ఒక సామ్రాజ్యంతో పోల్చడం అనేది మొఘలుల పరువుప్రతిష్టలకే భంగం.

అయితే సర్ థామస్ మాత్రం తన ధైర్యం కోల్పోలేదు. మూడేళ్లు కష్టపడి ప్రయత్నించి దౌత్య ముడుపులు, బహుమతులు ఇచ్చి జహంగీర్‌ను కాకపోయినా ఆయన సంరక్షకుడు అహద్ షాజహాన్‌ను బుట్టలో వేసుకోగలిగారు. నాలుగు వందల ఏళ్ల క్రితం 1618లో ఒక ఒప్పంద పత్రంపై సంతకం చేయించుకోగలిగాడు. దాని ప్రకారం ఆ కంపెనీకి సూరత్‌లో వ్యాపారం చేసుకోడానికి జహంగీర్ అనుమతి లభించింది.

1608వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్‌కు ఇంగ్లండ్ రాజు జేమ్స్ 1 తరపున లేఖ అందజేస్తున్న కెప్టెన్ విలియం హాకిన్స్Image copyrightGETTY IMAGES చిత్రం శీర్షిక1608వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్‌కు ఇంగ్లండ్ రాజు జేమ్స్ 1 తరపున లేఖ అందజేస్తున్న కెప్టెన్ విలియం హాకిన్స్

దాని పేరు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ ఘటన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మొఘల్ పాలకులు నేరుగా ఒక యురోపియన్ దేశంతో న్యాయసమ్మతంగా వ్యాపారం చేయడం అదే మొదటి సారి. అలా వారు ఆ కంపెనీని ప్రోత్సాహించారు.

ఈ ఘటన.. ఒక ఒంటె గుడారంలో తల పెట్టి లోపలికి వచ్చేందుకు అనుమతి కోరిన కథను గుర్తు చేసింది.

జహంగీరును బంగారు, వెండితో తులాభారం వేయడం చూసి సర్ థామస్‌ రో ఆశ్చర్యపోయారు. కానీ అతడు చేసుకున్న ఒప్పందం ఫలితంగా తర్వాత 350 ఏళ్లలో భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద సేకరించి తీసుకెళ్లింది అనేదానిపై ఎంతోమంది ఆర్థికవేత్తలు అంచనాలు వేసేందుకు ప్రయత్నించారు.

ఆ విషయం మనం ముందు ముందు తెలుసుకుందాం. దానికి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ పాలకుల వల్ల భారతదేశంపై పడిన ప్రభావం, దేశంలోని సంపద దోపిడీ కంటే ఎన్నో రెట్లు భయంకరమైనది.

బ్రిటిష్ దోచుకెళ్లిన సంపద ఎంత?Image copyrightGETTY IMAGES చిత్రం శీర్షికఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ పాలన సమయంలో వచ్చిన కరువుతో 3 కోట్ల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు

చరిత్రలో నాలుగో భయానక ఘటన

అమెరికా చరిత్రకారుడు మాథ్యూ వైట్ 'ద గ్రేట్ బుక్ ఆఫ్ హారిబుల్ థింగ్స్' అనే ఒక పుస్తకం రాశారు. చరిత్రలో ఎక్కువ మరణాలకు కారణమైన అత్యంత భయానకమైన వంద ఘటనల గురించి అందులో చెప్పారు. దీని ప్రకారం బ్రిటిష్ పాలనలో భారతదేశంలో వచ్చిన కరువు చరిత్రలో నాలుగో భయానక ఘటనగా నిలిచింది. ఆ పుస్తకంలో వైట్ వివరించిన దాని ప్రకారం ఆ కరువు కాలంలో 2 కోట్ల 66 లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్‌ కరువులో చనిపోయినవారిని ఈ మృతుల సంఖ్యలో వైట్ కలపలేదు. ఆ కరువులో సుమారు 30 లక్షల నుంచి 50 లక్షల మంది మృత్యువాతపడ్డారు.

ఈ కరువు లెక్కలను కలిపితే ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ పాలన సమయంలో భారతదేశంలో కరువుకాటకాల వల్ల మూడు కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది.

భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన భూభాగంగా భావిస్తారు. అలాంటప్పుడు అంత మంది ఆకలితో ఎందుకు చనిపోయారు.

ఈ కరువుకు కారణం వ్యాపార దోపిడీ అని వైట్ వర్ణించారు. దీన్ని వివరించడం కోసం మనం కేవలం 1769లో వచ్చిన కరువు గురించి ప్రస్తావిస్తాం.

నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త అమర్త్యసేన్ ఈ కరువు వల్ల కోటి మంది చనిపోయారని చెప్పారు. ఆ సమయంలో పరిస్థితిని ఒక ఆంగ్లేయుడు ఇలా వివరించారు:

‘‘పంట చేతికి రావడం కోసం కొన్ని లక్షల మంది ఎదురుచూశారు. కనీసం కొన్ని వారాలైనా ప్రాణాలు నిలుస్తాయని ఆశపడ్డారు. వాళ్ల కళ్లు ఆ పంటలనే చూస్తుండేవి. కానీ పంట పండి తమ కడుపు నిండుతుంది అనుకునేసరికి ఆలస్యం అయిపోయింది’’.

బ్రిటిష్ దోచుకెళ్లిన సంపద ఎంత?Image copyrightGETTY IMAGES

పండిన పంటలో అస్థిపంజరాలు

అనుకున్నట్టే పంట సమయానికి బాగా పండింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. 1769లో సంభవించిన అలాంటి కరువే 175 ఏళ్ల తర్వాత తూర్పు బెంగాల్లో మళ్లీ వచ్చింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా 1943 నవంబర్ 16న ప్రచురించిన ఒక కథనం ప్రకారం: తూర్పు బెంగాల్‌లో చాలా ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది, 500 ఏళ్ల తర్వాత ఇక్కడ పంటలు బాగా పండాయి. కానీ ఆ పంటల్లో గొంతు ఎండిపోయి మరణించిన వారి అస్థిపంజరాలు కనిపిస్తున్నాయి.

ఆనాటి కరువు పరిస్థితి గురించి రచయిత సాహిర్ లూధియాన్వీ ఒక కవిత రాశారు..

50 లక్షల శరీరాలు, గొంతు ఎండిన ఎముకల గూళ్లు

నిజాం-ఎ-జర్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి.

నిశ్శబ్దంగా ఉన్న పెదాలతో, మూసుకుపోతున్న కళ్లతో

ప్రతి పాలకుడికీ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాయి.

కరువు ప్రకృతి విపత్తుల్లోకి వస్తుంది. అందులో ఈస్టిండియా కంపెనీ తప్పేముంది? అనే సందేహం చాలా మందికి వస్తుంది. కానీ ప్రసిద్ధ తత్వవేత్త విల్ డ్యూరంట్ ఆ కరువు గురించి ఇలా చెప్పారు.

"భారతదేశంలో వచ్చిన భయంకరమైన కరువులకు ప్రధాన కారణం దారుణమైన దోపిడీ, సంతులనం లేని దిగుమతులు, సరిగ్గా కరువు కాలంలో భారీ పన్నులు వసూలు చేయడం."

"ఆకలితో అలమటిస్తున్న పేదలు భారీ పన్నులు చెల్లించలేకపోయారు. కానీ ప్రభుత్వం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారి నుంచి కూడా క్రూరంగా పన్నులు రాబట్టింది" అని విల్ తెలిపారు.

ఆహారం కోసం క్యూలో కరువు బాధితులుImage copyrightGETTY IMAGES

ఒక చిన్న కంపెనీ అంత బలంగా ఎలా మారింది? ఒక దేశంలోని కోట్ల మందిని జీవన్మరణ సమస్యలోకి ఎలా నెట్టగలిగింది?

1498లో వాస్కోడిగామా దక్షిణ మూలల నుంచి భారత్‌ను సముద్ర మార్గం ద్వారా ఐరోపాకు జోడించాడు. తర్వాత దశాబ్దాలపాటు వేధింపులు, బెదిరింపులు, అల్లర్ల ద్వారా భారత వ్యాపారులపై పోర్చుగీసువారు పైచేయి సాధించేలా చేశాడు. తర్వాత మెల్లమెల్లగా వారు భారత్‌పైనే పట్టు సాధించారు.

వారు చూపించిన మార్గంలోనే డచ్ వారు కూడా తమ ఫిరంగులు, నౌకాదళంతో భారతదేశంలోకి అఢుగుపెట్టారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. ఈ దేశాలు భారత చరిత్రనే తలకిందులు చేశాయి.

భారతదేశంలో జరుగుతున్నదంతా ఇంగ్లండ్ ఓపిగ్గా గమనించింది. అయినా అలాంటి సమయంలో ఎందుకు వెనక్కుతగ్గాలి అనుకుంది. అంతే క్వీన్ ఎలిజబెత్ ఆ రెండు దేశాల అడుగుజాడల్లో 1600 డిసెంబర్‌లో భారత్‌లో ఈస్టిండియా కంపెనీని స్థాపించింది. ఆసియా దేశాలతో వ్యాపారానికి పూర్తి హక్కులను పొందింది.

కానీ తర్వాత రోజుల్లో ఆ రెండు యూరోపియన్ దేశాలూ చేయలేని ఒక పనిని ఆంగ్లేయులు చేశారు. కేవలం యుద్ధాల కోసమే మొత్తం శక్తినంతా ఖర్చు చేసుకోలేదు. వీలైనంత వరకూ దౌత్య సంబంధాలపైనే దృష్టి పెట్టారు. ఈస్టిండియా కంపెనీకి మూసుకుపోయిన తలుపులను మళ్లీ తెరిపించేందుకు థామస్ రో లాంటి అనుభవజ్ఞులైన రాయబారులను భారతదేశానికి పంపించారు.

మొఘలుల నుంచి ఆదేశాలు రాగానే ఆంగ్లేయులు భారతదేశ తీరంలోని వివిధ నగరాల్లో ఒక్కొక్కటిగా తమ వ్యాపార స్థావరాలు స్థాపించడం ప్రారంభించారు. వాటిని ఫ్యాక్టరీలుగా పిలిచేవారు. ఈ ఫ్యాక్టరీల్లో మసాలా దినుసులు, పట్టు, ఇతర వస్తువుల వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపారంలో వారికి కళ్లుచెదిరే లాభాలు వచ్చాయి. కానీ ఆ లాభాలు వారిని వ్యాపారం కంటే మరింత ముందుకెళ్లేలా చేశాయి.

బ్రిటిష్ దోచుకెళ్లిన సంపద ఎంత?Image copyrightFRANCIS HAYMAN/NATIONAL PORTRAIT GALLERY, LONDON చిత్రం శీర్షికరాబర్ట్ క్లైవ్ ముందు మీర్ జాఫర్

విభజించు-పాలించు

ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇతర యూరోపియన్ దేశాలకు మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. ఒకరి సరుకులను ఇంకొకరు దోచుకోవడానికి ఎంతకైనా తెగిస్తుండేవారు. దాంతో ఆంగ్లేయులు కూడా తమ ఫ్యాక్టరీల్లో భారీగా స్థానిక సిపాయిలను భర్తీ చేయడం ప్రారంభించారు. తర్వాత కొద్దికాలంలోనే ఫ్యాక్టరీలు కోటలుగా మారాయి, కంటోన్మెంట్లు అవతరించాయి.

కంపెనీ సైనిక బలగాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే అందులోని అధికారులు స్థానిక రాజ్యాల మధ్య ఉన్న గొడవల్లో తలదూర్చడం ప్రారంభించారు. ఒక రాజు కోసం తమ సిపాయి దళాలను పంపించే ఆంగ్లేయులు, మరో నవాబు తన శత్రువులపై పైచేయి సాధించడానికి ఫిరంగులను అందించేవారు. ఇంకొకరికి అత్యవసర పరిస్థితుల్లో భారీగా ధనం అప్పుగా ఇచ్చేవారు. అలా రాజ్యాలను విభజిస్తూ, చిచ్చుపెడుతూ తమ పట్టును తీరప్రాంతాలనుంచి మెల్లమెల్లగా దూర ప్రాంతాల వరకూ పెంచుకున్నారు.

దేశమంతటా వ్యాపిస్తూ వచ్చిన ఆంగ్లేయుల ప్రయాణం 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంతో కీలక మలుపు తీసుకుంది. ఆ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీలో క్లర్క్ అయిన రాబర్ట్ క్లైవ్. తన మూడు వేల మంది సిపాయిలతో, 50 వేల మంది సైన్యంతో వచ్చిన బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ఓడించాడు.

రాబర్ట్ క్లైవ్, బెంగాల్ నవాబును ఎలా ఓడించాడో 'మొతాలాయె పాకిస్తాన్' పుస్తకంలో వివరించారు. ఈ కథలో మనం ఫలితాలను మాత్రమే గుర్తుంచుకుంటే చాలు. యుద్ధానికి 18 సంవత్సరాల ముందు నాదిర్ షా దిల్లీ సంపదను ఎలా ఇరాన్ చేర్చాడో, సరిగ్గా అలాగే ప్లాసీ తర్వాత క్లైవ్ కూడా సిరాజుద్దౌలా దగ్గర శతాబ్దాల నుంచి కూడబెట్టిన ఖజానాను ఉన్నది ఉన్నట్టే సముద్రంలో సిద్ధంగా ఉన్న పడవల్లో నింపి లండన్ చేర్చాడు.

కానీ తను ఎత్తుకెళ్లిన మొత్తం సంపదను క్లైవ్ రాయల్ ఖజానాలో జమ చేయలేదు. బదులుగా తన కోసం కూడా కొంత భాగం ఉంచుకున్నాడు. దాని విలువ ఈనాటి విలువతో పోలిస్తే మూడు కోట్ల డాలర్లు ఉంటుంది. ఈ డబ్బుతో క్లైవ్ బ్రిటన్‌లో ఒక భారీ భవంతిని నిర్మించాడు. చుట్టూ భూములు కొన్నాడు. వాటికి ప్లాసీ అని పేరు పెట్టాడు. అంతే కాదు, ఆయన డబ్బు పెట్టి తన కోసం, తన తండ్రి కోసం పార్లమెంటు సీటు కూడా కొన్నాడు. తర్వాత క్లైవ్‌కు సర్ టైటిల్ కూడా ఇచ్చారు.

బ్రిటిష్ దోచుకెళ్లిన సంపద ఎంత?Image copyrightAFP

'ఇంకా చాలా సంపద తెచ్చేవాడ్ని'

కానీ అదే సమయంలో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువు వల్ల ఆ ప్రాంతంలో మూడు వంతుల జనాభా చనిపోయారనే వార్తలు ఇంగ్లండ్ చేరడం మొదలైంది. దాని ప్రభావం లార్డ్ క్లైవ్‌ ఒప్పందాలపై పడింది.

అందరి వేళ్లూ లార్డ్ వైపు చూపించాయి. తర్వాత పరిస్థితి ఈస్టిండియా కంపెనీ ఒప్పందాల వరకూ వచ్చింది. ఆ కాంట్రాక్టులకు అనుమతి లభించలేదు. ఎందుకంటే ఆ కాలంలో పార్లమెంటులో నాలుగోభాగం సభ్యులు ఈస్ట్ ఇండియా కంపెనీలో భాగంగా ఉండేవారు.

చర్చ సమయంలో క్లైవ్ తన సంపద గురించి తెలివిగా చెప్పాడు. "అసలు నా చేతులను అంత ఖాళీగా ఎందుకు ఉంచానో నాకే అర్థం కావడం లేదు. వారు కావాలని అడిగుంటే నేను దీనికంటే ఎన్నో రెట్ల సంపద, బంగారం భారత్ నుంచి తెచ్చుండేవాడ్ని" అన్నాడు.

అయితే భారత్‌లో ముంచుకువస్తున్న ముప్పు గురించి, దాని ప్రభావం గురించి ఎలాగోలా క్లైవ్‌కు అర్థమైంది. ఆందోళనలో అతడు భారీగా నల్లమందు తినడం మొదలుపెట్టాడు. ఫలితంగా 1774లో తన గదిలో అంతుపట్టని స్థితిలో చనిపోయి కనిపించాడు.

క్లైవ్ ఆత్మహత్య చేసుకున్నాడా, లేక నల్లమందు ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయాడా ఇప్పటికీ తేలలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది. క్లైవ్ వ్యూహాలను అనుసరిస్తూ ఈస్టిండియా కంపెనీ ముందుకు వెళ్లిన తీరు తర్వాత కాలంలో భారతదేశ స్వాతంత్రానికి పెనుముప్పుగా మారనుందనే విషయం నిరూపితమైంది.

ఆ సమయంలో మొఘలులు తమ అసమర్ధత, విదేశీయుల దాడులతో చాలా బలహీనం అయిపోయారు. ఆంగ్లేయుల పలుకుబడి అంతకంతకూ పెరుగుతుంటే చూస్తూ ఉండడం తప్ప అడ్డుకోలేకపోయారు. ప్లాసీ యుద్ధం జరిగిన అర్థ శతాబ్దంలోనే ఈస్టిండియా కంపెనీలో ఉన్న సిపాయిల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. వారు బెంగాల్ నుంచి బయటికొచ్చి భారతదేశంలోని ఇతర ప్రాంతాలపై కూడా తమ పట్టు బిగించారు.

బ్రిటిష్ దోచుకెళ్లిన సంపద ఎంత?Image copyrightGETTY IMAGES చిత్రం శీర్షికసిక్కులతో ఆంగ్లేయుల యుద్ధం

కంపెనీ భృతిపై ఆధారపడ్డ మొఘల్ చక్రవర్తులు

దేశంలో మొఘల్ బాద్షాల పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే.. 1803 ప్రారంభంలో దిల్లీ సింహాసనంపై ఉన్న మొఘల్ చక్రవర్తి షా ఆలం, ఈస్టిండియా కంపెనీ ఇచ్చే భృతిపై ఆధారపడ్డాడు. ఒకప్పుడు మొఘల్ బాద్షా జహంగీర్ ముందు బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రో మోకాళ్లపై వంగి ఒప్పందం చేసుకుంటే, అదే మొఘల్ పాలకులు ఇప్పుడు ఈస్టిండియా కంపెనీలో ఒక క్లర్కు ముందు మోకరిల్లి మొత్తం బెంగాల్ అధికారాన్ని అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బ్రిటిష్ ప్రభుత్వానికి బదులు ఒక కంపెనీ ఇంత కథ నడిపించిందంటే, ఆశ్చర్యంగానే ఉంటుంది. అన్ని రకాల ఎత్తుగడలూ ఉపయోగించిన ఈస్టిండియా కంపెనీ తన వాటాదారులకు అధిక లాభాలను ఆర్జించి పెట్టింది. ఈ కంపెనీ లండన్‌లోని ఒక ప్రాంతంలో ఒక చిన్న భవనంలో పనిచేస్తుండేది. దాన్ని స్థాపించిన ఒక శతాబ్దం తర్వాత కూడా దానిలో పనిచేస్తున్న శాశ్వత సిబ్బంది 35 మంది మాత్రమే.

అయినా, ప్రపంచ చరిత్రలో ఏ కంపెనీకి లేనంత బలాన్ని ఇది సంపాదించింది.

బ్రిటిష్ దోచుకెళ్లిన సంపద ఎంత?Image copyrightEDWARD DUNCAN చిత్రం శీర్షికనల్లమందు కొనుగోలు చేయనందుకు చైనా నౌకాదళాన్ని ధ్వంసం చేసిన ఈస్టిండియా కంపెనీ

నల్లమందు కొనుగోలు చేయని చైనీయులు

ఈస్టిండియా కంపెనీ చైనాకు కూడా ఇలాగే చేసింది. ఈ కంపెనీ భారత్‌లో నల్లమందు ఉత్పత్తి చేసేది. కానీ దాన్ని ఎక్కువగా కంపెనీలోని అధికారులే తినేసే వారు. నల్లమందులో ఎక్కువ భాగం చైనా తీసుకెళ్లి భారీ ధరలకు అమ్మేవారు. ద్రోహం జరుగుతోందని చైనీయులకు ఆలస్యంగా తెలిసింది. తర్వాత వాళ్లు నల్లమందు కొనలేమని ఆంగ్లేయులకు చెప్పారు.

దాంతో చైనాలో ఈస్టిండియా కంపెనీ లాభాలు తగ్గాయి. దాన్ని అది భరించలేకపోయింది. 1839లో కొన్ని ఫిరంగులను పడవల్లో చైనా పంపించింది, చైనా నౌకాదళాలను చెల్లాచెదురు చేసింది. దాంతో చైనా చక్రవర్తి తన తప్పును స్వీకరించాడు. నల్లమందు దిగుమతిపై నిషేధం ఎత్తివేయడంతోపాటు, జరిమానాగా హాంగ్‌కాంగ్‌ను కూడా బ్రిటన్‌కు అప్పగించారు. అది తర్వాత ఎప్పుడో 1997లో తిరిగి చైనా చెంతకు చేరింది.

అదే సమయంలో భారత్‌లో కూడా ఈస్టిండియా కంపెనీ దాడులు కొనసాగాయి. ఒక్కో రాజ్యాన్ని, ఒక్కో సంస్థానాన్ని సొంతం చేసుకుంటూ కంపెనీ ముందుకు కదిలింది. 1818లో మరాఠా సామ్రాజ్యం స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్ని దశాబ్దాల్లోనే సిక్కులను ఓడించి పశ్చిమ భారతదేశాన్నంతా, అంటే ప్రస్తుత పాకిస్తాన్‌ను కూడా తన పట్టులోకి తెచ్చుకుంది. ఖైబర్ నుంచి బర్మా, హిమాలయాల పర్వతాల వరకూ తన సామ్రాజ్యం స్థాపించింది.

ఇప్పుడు ఒంటె గుడారంలోకి దూరింది. వ్యాపారికి ఆశ్రయం లేకుండా చేసింది.

ఆ కథ అలా కొనసాగుతూనే ఉంది. కానీ తర్వాత ఈస్టిండియా కంపెనీని మాత్రం దురదృష్టం వెంటాడింది. 1857లో ఆ కంపెనీ తమ దగ్గరే జీతం తీసుకుంటున్న సిపాయిల నుంచే తిరుగుబాటు ఎదుర్కొంది. ఆ సమయంలో భారీగా రక్తపాతం చోటుచేసుకుంది. అదే సమయంలో వార్తా పత్రికలు ఉన్నాయి. వాటి ద్వారా ఈ గందరగోళమంతా ఇంగ్లండ్ చేరింది. ఈస్టిండియా కంపెనీ ఆగడాలు ఎంతగా పెరిగాయంటే, ప్రజల ఒత్తిడితో ఆ కంపెనీని జాతీయం చేయాలని పార్లమెంటు ఒక నిర్ణయానికి వచ్చింది. అలా భారతదేశం నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం కిందికి వచ్చింది. క్వీన్ విక్టోరియా కిరీటంలో 'అత్యంత విలువైన వజ్రం'గా మారింది.

ఆ తర్వాత కూడా ఈస్టిండియా కంపెనీ కొన్నేళ్లు అక్కడక్కడా పనిచేస్తూ వచ్చింది. కానీ అలా ఎప్పటివరకూ ఉండగలదు. చివరకు 1874 జూన్ 1న 275 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత ఆ కంపెనీ రద్దయ్యింది.

బ్రిటిష్ దోచుకెళ్లిన సంపద ఎంత?Image copyrightHERITAGE IMAGE PARTNERSHIP LTD/ALAMY చిత్రం శీర్షికలండన్‌లో ఈస్టిండియా కంపెనీ ప్రధాన కార్యాలయం

ఆచూకీ లేని ఈస్టిండియా కంపెనీ

ప్రస్తుతం లండన్‌లో ఉన్న లీడన్ హాల్ స్ట్రీట్‌లో ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీ హెడ్ క్వార్టర్ ఉండేది. అక్కడ ఇప్పుడు ఒక భారీ బ్యాంకు భవనం నిలిచింది. కంపెనీకి సంబంధించిన స్మృతులు, విగ్రహాలు, కనీసం బోర్డులు కూడా ఇప్పుడు అక్కడ కనిపించవు.

ఈస్టిండియా కంపెనీ జాడలు లేకపోయినా, దాని అరాచకాల ప్రభావం మాత్రం ఈరోజుకూ కనిపిస్తుంది. బహుశా ఒక విషయం చాలా మందికి ఆందోళన కలిగించవచ్చు. ఈ కంపెనీ పాలనకు ముందు ఔరంగజేబు ఆలంగీర్ పాలన సమయంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. ప్రపంచ మొత్తం జీడీపీలో పావు వంతు భాగం ఇక్కడిదే. ఆ సమయంలో ఇంగ్లండ్ భాగం ప్రపంచ జీడీపీలో కేవలం 2 శాతమే ఉండేది.

సారవంతమైన భూములు, అన్నిరకాల వనరులతో భారతదేశం కళకళలాడేది. ఈ దేశంలో పుట్టిన కాటన్ దుస్తులు, ముఖమల్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేది. షిప్పింగ్, స్టీల్ పరిశ్రమలో కూడా భారత్ అన్ని దేశాల కంటే ముందుండేది.

ప్లాసీ యుద్ధం తర్వాత ఆ ఘనతంతా గతంగా మారిపోయింది. 1947లో భారత్ నుంచి వెళ్లిపోయినపుడు, ఆంగ్లేయులు తమ పడవల నిండా అమూల్యమైన సంపదను నింపుకుని వెళ్తే, భారతదేశం చేతులు మాత్రం ఖాళీగా ఉండిపోయాయి.

బ్రిటిష్ దోచుకెళ్లిన సంపద ఎంత?Image copyrightCONTRABAND COLLECTION/ALAMY చిత్రం శీర్షికభారతదేశంలో ఈస్టిండియా కంపెనీకి చెందిన ఒక గోదాము

ప్రపంచంలోనే పేద దేశం

భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఒకసారి ఒక విషయం చెప్పారు.

"బ్రిటన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. 1700లో ప్రపంచంలో 22.6 శాతం సంపద ఉన్న దేశం భారతదేశం మాత్రమే. అది దాదాపు మొత్తం యూరోపియన్ దేశాల సంపదకు సమానం. కానీ అది 1952లో 3.8కి పడిపోయింది. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటన్ కిరీటంలో 'అత్యంత విలువైన వజ్రం'గా ఉన్న భారత్ ఇప్పుడు తలసరి ఆదాయం విషయంలో ప్రపంచంలో అత్యంత పేద దేశంగా మారింది".

ఇప్పుడిక అసలు విషయానికి వద్దాం. ఆంగ్లేయుల 200 ఏళ్ల దోపిడీలో భారతదేశానికి ఎంత నష్టం జరిగింది?

ఈ విషయంపై చాలా మంది ఎన్నోరకాల అంచనాలు రూపొందించడానికి ప్రయత్నించారు. వీటిలో ఆర్థికవేత్త, విలేఖరి మెహనాజ్ మర్చంట్ పరిశోధనను ప్రముఖమైనదిగా భావిస్తున్నారు. ఈ రీసెర్చ్ ప్రకారం 1757 నుంచి 1947 వరకూ ఆంగ్లేయుల వల్ల భారత్‌కు జరిగిన మొత్తం ఆర్థిక నష్టం 2015 ఫారిన్ ఎక్ఛేంజ్ ప్రకారం 30 ట్రిలియన్ డాలర్లు (ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం.. 209,422,500,000,000 రూపాయలు) అవుతుంది.

ఒక్క నిమిషం ఆగి ఈ మొత్తం ఎంతో అంచనా వేయడానికి ప్రయత్నించండి. అయితే, నాదిర్ షా మాత్రం ఒక్క దిల్లీ నుంచే కేవలం 173 మిలియన్ డాలర్ల (ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం.. 12,076,697,500 రూపాయల) దోపిడీతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

నాలుగు వందల ఏళ్ల క్రితం జహంగీర్ దర్బారులో ఉన్న ఆంగ్లేయ రాయబారికి ఒక సందేహం వచ్చింది. భారతదేశం తన చక్రవర్తిని బంగారం, వెండి, వజ్రవైఢూర్యాలతో తులాభారం వేసేంత సంపన్నమైనదా, బహుశా ఆ పట్టు సంచుల్లో రాళ్లు నింపి పెట్టారేమో అనే అనుమానం కలిగింది.

ఆ థామస్ రోను ఇప్పుడు తిరిగి ఎలాగోలా తీసుకొచ్చి ఈ అంకెలు చూపించగలిగితే, ఆయన భ్రమలు బహుశా శాశ్వతంగా దూరమైపోతాయి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...