Jump to content

🕉🌺 ఆధ్యాత్మికం🌺🕉 @aadyaatmikam360°: రేపు కృష్ణాష్టమి – కృష్ణ జయంతి


afacc123

Recommended Posts

🕉🌺 ఆధ్యాత్మికం🌺🕉 @aadyaatmikam360°:
రేపు కృష్ణాష్టమి – కృష్ణ జయంతి
 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


కృష్ణాష్టమి విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ


సింహ మాసం కృష్ణపక్షంలో అష్టమి తిధి రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమిని జరుపుకుంటాము. కానీ వాస్తవంగా ద్వాపర యుగం చివరలో ఈ
సింహ మాసం చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసంలో కృష్ణావతారం జరిగింది అని కల్పతరువు అనే గ్రంథంలో బ్రహ్మ వాక్యం.

తధా భాద్రపదే మాసి
కృష్ణాష్టమ్యాం కలే:పురా
అష్టావింశతి తమే జాత:
కృష్ణో సౌ దేవకీ సుత:

అని కల్పతరువు వాక్యము. కలియుగం కంటే ముందు అనగా ద్వాపర యుగం చివరలో భాద్రపద అష్టమి నాడు దేవకీ పుత్రుడుగా శ్రీహరి అవతరించాడు. ఇది 28వ ద్వాపర యుగము అప్పుడు సింహ మాసం భాద్రపద మాసంలో ప్రవర్తించినది. సూర్య సంచారం , గ్రహ సంచారాన్ని బట్టి కలియుగం వచ్చిన తరువాత సింహ మాసం శ్రావణ మాసంలోకి ప్రవర్తించినది. ఇప్పటికీ కొన్ని సార్లు కృష్ణాష్టమి భాద్రపద మాసంలో ప్రవర్తిస్తుంది. ఈ కృష్ణాష్టమి అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి జన్మాష్టమి , మరొకటి కృష్ణ జయంతి. అందులో కేవలం
అష్టమి ఉంటే జన్మాష్టమి అంటారు.

యే న కుర్వంతి జానంత: కృష్ణ జన్మాష్టమీ వ్రతం
తే భవంతి నరాప్రాజ్ఞ వ్యాలా వ్యాఘ్రాస్త కాననే
దివావా యదివా రాత్రౌ నాస్తి చేత్‌ రోహిణీ కలా
రాత్రి యుక్తాం ప్రకుర్వీత విశేషేణ ఇందు సంయుతాం
శ్రావణ బహుళే పక్షే కృష్ణ జన్మాష్టమి వ్రతం
న కరోతి నరో యస్తు భవతి క్రూర రాక్షస:

అని భవిష్య పురాణ వాక్యం. అనగా తెలిసి కూడా కృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించని వారు అరణ్యంలో సర్పములు , పులులుగా జన్మిస్తారు
అనేది స్కాంద పురాణ వాక్యం. పగలు కానీ , రాత్రి కానీ రోహిణి అంశ కూడా లేనపుడు ఈ కృష్ణాష్టమి వ్రతం రాత్రి పూట ఆచరించాలి అనేది బ్రహ్మాండ పురాణ వాక్యం. ఇక శ్రావణ కృష్ణ పక్షంలో అష్టమి నాడు కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించని వారు క్రూర స్వభావం గల రాక్షసుడిగా పుడతారని భవిష్య పురాణ వచనం. ఇలా రోహిణి నక్షత్రం లేకుండా కేవలం అష్టమి అయినచో జన్మాష్టమి అంటారు. రోహిణితో కూడిన అష్టమిని కృష్ణ జయంతి అంటారు.

కృష్ణాష్టమ్యాం భవేద్యత్ర
కలఇకా రోహిణీ యదీ
జయంతీ నామ సాప్రోక్త
ఉపోష్యాసా ప్రయత్నత:

అని అగ్ని పురాణ వచనం

అష్టమీ కృష్ణ పక్షస్య
రోహిణీ ఋక్ష సంయుతా
భవేత్‌ ప్రౌష్ట పదేమాసి
జయంతీ నామ సాస్మృతా

అనేది విష్ణు ధర్మంలో విష్ణు రహస్య వచనం.

శ్రావణ బహుళ అష్టమి కానీ భాద్రపద బహుళ అష్టమి కానీ రోహిణీ నక్షత్రంతో ఒక కలా మాత్రం ఉన్నా దాన్ని జయంతి అంటారు. ఆనాడు తప్పకుండా ఉపవాసం చేయాలి. ఈ రోహిణి నక్షత్రం పగలు , రాత్రి ఉంటే ఉత్తమం , కేవలం రాత్రి ఉంటే మధ్యమం , పగలు ఉంటే అధమం ఈ విధంగా అష్టమి నాడు రోహిణి నక్షత్రం ముహూర్త కాలం ఉన్నా , కలా (12 సెకెండ్లు) మాత్రం ఉన్నా ఆ రోజు కృష్ణ జయంతిగా వ్రతాన్ని అనుష్ఠించి ఉపవసించాలి అనేది వసిష్ఠ సంహితా వచనం. ఆ రోజు అర్థరాత్రి చంద్రోదయ కాలంలో రోహిణీ యోగం ఉన్నట్లైతే ఆ సమయంలో స్నానం చేసి పవిత్రులై పూజాది వ్రతములు చేయవలెను. ఉదయం నుంచి ఉపవసించవలెను. అర్థ రాత్రి బ్రాహ్మణులను , పురోహితులను , బంధువులను పిలుచుకుని కృష్ణ జన్మోత్సవం జరుపుకోవాలనేది విష్ణుధర్మ వచనం.

శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజునాడు పగలు గానీ రాత్రి కానీ రోహిణీ ఏ మాత్రం ఉన్నా లేదా భాద్రపదంలో ఉన్నా ఆనాడు కృష్ణ జయంతి జరుపుకొనవలెనని పురాణ వచనం. సూర్యోదయం కంటే ముందు స్నానం ఆచరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అర్చా మూర్తులకు పంచామృతాది ద్రవ్యములతో అభిషేకం జరిపించి విశేషమైన అలంకారం చేసి శక్తి కొలది పక్వాన్నములు చేసి అవన్నీ నివేదన చేసి కృష్ణావతార రహస్యాలు ఆ పగలంతా విని రాత్రి కాగానే స్వామిని ఊయలలో పరుండబెట్టి యశోదామాత విగ్రహాన్ని కూడా ఊయలలో పెట్టి సూతికా ఉత్సవం జరుపుకోవాలి. ప్రతి వర్షం కృష్ణ జయంతి లేదా కృష్ణ జన్మాష్టమి వ్రతం ఆచరించని స్త్రీ లేదా పురుషులు సర్పములుగా పుట్టెదరని స్కాంద పురాణం మధన రత్న కల్పంలో తెలుపబడింది. జన్మాష్టమి వ్రతాన్ని తాము స్వయంగా చేసినా ఇతరులతో చేయించినా వారి ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది. వారు ఆచరించే అన్ని కార్యములు విజయవంతం అవుతాయి. ఈ జయంతి వ్రతం నిత్య వ్రతం , కామ్య వ్రతం , నిష్కామ వ్రతం అని మూడు విధాలుగా ఉంటుంది. రాజులు యుద్ధంలో జయం కోసం , జ్ఞానులు ముక్తి కోసం ఈ వ్రతం చేస్తారు.

ధర్మ మర్థంచ కామంచ
మోక్షంచ మునిపుంగవా
దధాతి వాంఛితా నర్ధాన్‌
యే చాన్యే ప్యతి దుర్లభా

అనగా ధర్మమును , అర్థమును , కామమును , మోక్షమును కోరిన వాటిని వేటినైనా అతి దుర్లభములైనా జన్మాష్టమి , జయంతి వ్రతం ఆచరించిన వారికి పరమాత్మ ప్రసన్నుడై ఇస్తాడు.

ఒకవేళ రోహిణీ నక్షత్రం అష్టమి తరువాత ఉంటే అనగా నవమి నాడు వచ్చినచో లేదా ముందురోజే వచ్చినచో జయంతి ఉత్సవం జరపాలి కానీ జన్మాష్టమి జరపాల్సిన అవసరం లేదు. రోహిణీ నక్షత్రం ఉన్నరోజు ఉపవాసం చేయాలి. అలా ఉపవసించి వ్రతం చేసిన వారికి మూడు జన్మల పాపం తొలగిపోతుంది. అర్థరాత్రి రోహిణీ యోగం ఉన్నచో ఆనాడు చేసిన వ్రతం మూడు జన్మల పాపాన్ని పోగొడుతుంది. ఈ కృష్ణాష్టమి రోహిణీ బుధవారం ఈ మూడు కలిసిన యోగం ఎంతో పుణ్యాత్ములకు మాత్రమే లభిస్తుంది. జయంతి నామ శర్వరీ అనుప్రమాణంతో జయంతి అనగా రాత్రి అని అర్థం.

బ్రహ్మాండ పురాణానుసారం రాత్రి పూట రోహిణీ ఉన్నపుడు జయంతి వ్రతం చేయాలని వచనం. అలాగే ‘అష్టమి పూర్వ విద్ధాంతు నకార్య’ అని విష్ణు ధర్మ ప్రమాణాన్ని బట్టి సప్తమితో కూడిన అష్టమి నాడు ఈ వ్రతం ఆచరించరాదు. నవమితో కూడిన అష్టమి నాడే ఆచరించాలి. ఆరోజే రోహిణీ నక్షత్రం బుధవారం కూడా కలిసి ఉన్న యోగం నూరు సంవత్సరాలకు ఒకసారైనా దొరకదు. కృష్ణాష్టమి , కృష్ణ జయంతి వ్రతములను ఆచరించిన వారు లభించిన ప్రేత తత్వాన్ని నశింప చేసుకుంటారు.

కృష్ణం ధర్మం సనాతనం

పవిత్రాణాయ సాధూనాం
వినాశయ చతుష్కృతాం
ధర్మ సంస్థాప నార్ధాయ
సంభవామి యుగేయుగే

అని ఉద్ఘోషించిన పరమ దయాళువు శ్రీకృష్ణ పరమాత్ముడు. సజ్జన రక్షణను దుష్టజన శిక్షణకు ధర్మ సంస్థాపనకు ప్రతి యుగంలో అవతరిస్తాడని దానికి అర్థం.

చెరసాలలో పుట్టి గోశాలలో పెరిగి గోపాల బాలకులతో గోపికలతో ఆడిపాడి తానాడిన ప్రతి ఆటలో ఒక దుష్ట సంహారాన్ని జరిపి శిష్ట రక్షణ , ధర్మ స్థాపన చేసిన వాడు శ్రీకృష్ణుడు. పూతన ఇచ్చిన విషం తాగి ఆమెకు మోక్షం ఇవ్వడంలో ఏ భావంతో చేసినా తనకు అర్పిస్తే చాలు మోక్షం ఇస్తాననే ఉపదేశం దాగి ఉంది. ఆమె దగ్గర ఉన్న విషం ఆమె అర్పించింది , తనకు విషం , అమృతం సమానమేనని తనకు ఇవ్వాలనే భావనే ముఖ్యమని వైరంతో ఇచ్చినా ప్రేమతో ఇచ్చినా తాను మోక్షమే ఇస్తానని ప్రకటించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు.

శ్రీకృష్ణుడు తనను చంపడానికి వచ్చిన వారందరికీ మోక్షం ఇచ్చాడు. తన భక్తులకు అపకారం చేస్తున్న కాళియుని శిక్షించి దూరంగా పంపాడు. వర్షాధిపతిని తానేనని తానే వర్షింప చేస్తానన్న ఇంద్రుని అహంకారాన్ని గోవర్థన పర్వతంతో , సృష్టికర్తను తానేనన్న బ్రహ్మ అహంకారాన్ని
గోవత్సల రూపంతో తొలగించిన వాడు శ్రీకృష్ణుడు.

రామావతారంలో తన మోహన సౌందర్యానికి మోహించి భార్యలుగా ఉందామని కోరుకున్న ఋషులను , అప్సరసలను , దేవతా స్త్రీలను గోపికలుగా , 16 వేల మంది భార్యలుగా అవతరింప చేసి వారి కోరికకు అనుగుణంగా ప్రవర్తించి వారిని రక్షించాడు శ్రీకృష్ణుడు. ఏ ప్రాణికైనా పెద్ద ఆపద కోరిక తీరకపోవడమే , అది ఆహారం , విహారం , వస్త్రాలు , ఆభరణాలు ఏమైనా సరే. కుచేలుడు కోరకున్నా సంపద ఇచ్చాడు కృష్ణుడు అదే అకృరుడు కోరినా ఆపద తొలగించలేదు. తనను నమ్ముకున్న వారిని బాధిస్తున్న కంసాదులను సంహరించాడు. 18 సార్లు జరాసంధుని సైన్యాన్ని అంటే 384 అక్షౌహిణుల సైన్యాన్ని బలరాముడుతో కలిసి సంహరించి నిజమైన భూ భారాన్ని తగ్గించాడు కృష్ణుడు.

పాండవులను చేరదీసి కౌరవుల అధర్మాన్ని , రాజ్య కోరికను పెంపొందింప చేసి సకల లోకాలకు ఉపకరించే గీతోపనిషత్‌ను అందించి 18
అక్షౌహిణుల కౌరవ , పాండవ సైన్యాన్ని అవతరింప చేసి భూ భారాన్ని తొలగించిన వాడు శ్రీకృష్ణడు. అధర్మం తన వారు చేసినా ఇతరులు చేసినా పక్షపాత బుద్ధి లేకుండా వారిని నిర్మూలిస్తానని తనకు ‘తన’ ‘పర’ అన్న బేధం లేదని ధర్మమే తన స్వరూపం , అధర్మం తన పృష్ట భాగం అని ఉపదేశించడానికి తన వంశాన్ని కూడా నిర్మూలించి పరిపూర్ణంగా భూ భారాన్ని , అధర్మాన్ని తొలగించి అన్న మాట ప్రకారం ధర్మాన్ని స్థాపించి అవతారాన్ని ముగించిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.

కావున ‘కృష్ణ ధర్మం సనాతనం’ అని ఋషుల వచనం. ఆ సనాతన ధర్మాన్ని సాక్షాత్కరించుకుని సేవించుకుని తరిద్దాం.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...