southyx Posted November 24, 2022 Report Share Posted November 24, 2022 వైకాపా నేతల.. అరాచక పర్వం ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా నాయకులు, కార్యకర్తల అరాచకం పరాకాష్ఠకు చేరుతోంది. సామాన్య జనం భరించలేనంత స్థాయిలో అకృత్యాలు ఉంటున్నాయి. వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు, బెదిరింపులు ఊరూవాడా విస్తరిస్తున్నాయి. అడ్డుగా ఉన్నవారిని అంతం చేయడం, ఎదురు తిరిగిన వారిపై కక్ష సాధించడం.. ఇదే పని అన్నట్లుగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. Updated : 25 Nov 2022 03:12 IST ఈ చావులకు బాధ్యులు వైకాపా నాయకులే అధికార పార్టీ నాయకులు.. కార్యకర్తల వేధింపులతో బలవన్మరణాలు అడ్డుగా ఉంటున్నారని ప్రత్యర్థుల హత్యలు బాధితుల్లో దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలే అధికం ఈనాడు, ఈనాడు డిజిటల్-అమరావతి, న్యూస్‌టుడే యంత్రాంగం ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా నాయకులు, కార్యకర్తల అరాచకం పరాకాష్ఠకు చేరుతోంది. సామాన్య జనం భరించలేనంత స్థాయిలో అకృత్యాలు ఉంటున్నాయి. వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు, బెదిరింపులు ఊరూవాడా విస్తరిస్తున్నాయి. అడ్డుగా ఉన్నవారిని అంతం చేయడం, ఎదురు తిరిగిన వారిపై కక్ష సాధించడం.. ఇదే పని అన్నట్లుగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వీరి వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు బలవన్మరణాలకు యత్నించారు. దళితులు, గిరిజనులు, సామాన్యుల భూములను వైకాపా నేతలు కబ్జా చేస్తున్నారు. చివరికి శ్మశాన వాటికలనూ వదలట్లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఎక్కడ చూసినా వైకాపా నాయకుల అకృత్యాలు, ఆగడాలే కనిపిస్తున్నాయి. వారి పదఘట్టనల్లో నలిగిన బాధితుల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో వైకాపా నాయకుల అరాచకాలకు హద్దే లేదు. వాటిలో ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి నవంబరు 21 మధ్య 113 రోజుల వ్యవధిలో జరిగిన ఘటనల్లో మచ్చుకు కొన్నింటిని ‘ఈనాడు’ పరిశీలించింది. బాధితుల్లో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలే అధికం. వైకాపా నాయకుల అరాచకాలపై కొన్నిచోట్ల కేసులే నమోదు కాలేదు. మరికొన్ని ఘటనల్లో కేసు నమోదైనా అరెస్టుచేయలేదు. ఇంకొన్నింటిలో కీలక నిందితుల్ని కేసు నుంచి తప్పించారు. అది భూమి కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇదేం అరాచకమని అడిగేవారు కావచ్చు.. విషయం ఏదైనా.. వారి కన్నుపడితే చాలు.. కాటేస్తారు. వారి ముందు ఎవరైనా తలవంచాల్సిందే, కాదంటే తలలు తెగిపడుతున్నాయి. ఆ నాయకుల వేధింపులకు ఎందరు అమాయకులు బలవన్మరణాలకు పాల్పడ్డారో! అధికారం చేపట్టిన మూడున్నరేళ్లలో వైకాపా సాగించిన అరాచక రాజ్యానికి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలు. కాదనలేని కటిక నిజాలు. హత్యలు, హత్యాయత్నాలు, భూకబ్జాలతో పాటు.. కార్యాలయాలు, అన్నక్యాంటీన్లపై దాడులు, కూల్చివేతల వంటి దారుణాలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. 113 రోజుల్లో పరిశీలించిన ఘటనలు 47 వీటిలో ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనారిటీలు బాధితులుగా ఉన్న ఘటనలు 30 (63.83%) ఎస్సీలు 11 ఎస్టీలు 2 బీసీలు 16 మైనారిటీలు 1 మిగిలిన ఘటనల్లో ఇతరవర్గాల వారు బాధితులు 15.11.2022 రెండు నెలల్లోనే అన్నాచెల్లెళ్ల ఆత్మహత్య ఆప్యాయతకు మారుపేరుగా ఉన్న వీరిద్దరూ అన్నాచెల్లెళ్లు. బహుమతిగా ఇచ్చిన స్థలంపై వైకాపా నేతలు కన్నేయడంతో.. వారి వేధింపులు తాళలేక రెండు నెలల తేడాలో కడియాల సోమేశ్వరరావు, అచ్చియమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ గోవిందపురంలో జరిగిన ఈ ఘటన అందరితో కన్నీరు పెట్టించింది. స్థలం విషయంలో వైకాపా నేతల వేధింపులు తాళలేక సోమేశ్వరరావు సెప్టెంబరు 9న బలవన్మరణానికి పాల్పడ్డారు. సోదరులు అచ్చియమ్మకు ఇచ్చిన రెండు సెంట్ల స్థలాన్ని ఉడా లే అవుట్‌లో ఖాళీస్థలంగా గుర్తించామని, 15 రోజుల్లోగా ఖాళీచేయాలని అధికారులతో నవంబరు 2న వైకాపా నేతలు నోటీసులు ఇప్పించారు. దాంతో ఆమె నవంబరు 15న వ్యవసాయబావిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. సోమేశ్వరరావు ఆత్మహత్యకు వైకాపా నాయకులే కారణమని ఫిర్యాదు చేసినా అప్పట్లో వారిపై కేసు పెట్టలేదు. అచ్చియమ్మ మరణానికి బాధ్యులైన వైకాపా నాయకుల్ని నిందితులుగా పేర్కొంటూ కేసు పెట్టారుగానీ.. ఒక్కరినీ అరెస్టు చేయలేదు. హత్యలు... 19.9.2022 పులివెందుల నియోజకవర్గం దిద్దేకుంటకు చెందిన తెదేపా నాయకుడు పెద్ద సోమప్పగారి పరమేశ్వరరెడ్డి హత్యకు గురయ్యారు. వైకాపా నాయకులపై బాధితుడి కుటుంబీకులు ఫిర్యాదుచేశారు. కీలక నిందితులైన హరినాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి, జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయలేదని, వేరే వారిని నిందితులుగా చేర్చారని బాధితుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 22.10.2022 గుంటూరు జిల్లా పొన్నూరువాసి, దళితుడైన అంజి బర్నబాస్‌ను కొందరు అపహరించి, హత్యచేశారు. వైకాపా ఎమ్మెల్యే కిలారు రోశయ్య అనుచరులు, వైకాపా నాయకులు నన్నపనేని వీరయ్యచౌదరి, కొఠారు వెంకటరమణల ప్రమేయంతోనే తన భర్త హత్యకు గురయ్యారని మృతుడి భార్య నందిని అప్పట్లో ఆరోపించారు. హత్య ఘటనలో వారి ప్రమేయంపై ఆధారాల్లేవని పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యలు 20.8.2022 కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని దళిత యువకుడి బలి రూ.20 లక్షలు అప్పుచేసి చెరువులో చేపలు పెంచితే.. వాటిని పట్టుకోనివ్వకుండా వైకాపా సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్, శ్రీశైలం ట్రస్టు బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరుడు సురేష్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటూ జిల్లా ఎస్పీకి లేఖ రాసి నెల్లూరు జిల్లా కావలికి చెందిన దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్ (36) ఆత్మహత్య చేసుకున్నారు. తన తల్లితో కలిసి జగదీశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని లేఖలో వాపోయారు. * కొన్ని రోజులు రిమాండులో ఉన్న నిందితులు బెయిలుపై బయటకొచ్చారు. జగదీశ్వర్‌రెడ్డి శ్రీశైలం బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. 22.10.2022 బెదిరింపులు భరించలేక దళిత ఆక్వా రైతు ఆత్మహత్య వైకాపా నాయకుడు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ ఉపాధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ, ఆయన సోదరుడు గంగాధర్, ఎస్సై కిరణ్ కుమార్‌ల బెదిరింపులు భరించలేకపోతున్నానని లేఖ రాసి దళిత ఆక్వా రైతు బూరగ నాగేశ్వరరావు (37) ఆత్మహత్య చేసుకున్నారు. నాగేశ్వరరావు వద్ద పనిచేసే సురేష్ పక్షులను బెదరగొట్టేందుకు నాటు తుపాకీ పేలుస్తూ గాయపడ్డారు. అతనికి రూ.10 లక్షలు చెల్లించాలని సత్యనారాయణ, గంగాధర్ కలిసి... నాగేశ్వరరావును బెదిరించారు. అంత ఇవ్వలేననటంతో అదే రోజు రాత్రి ఎస్సై కిరణ్‌కుమార్.. నాగేశ్వరరావును పోలీసు స్టేషన్‌కు పిలిచి బెదిరించి, కొట్టారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. * సత్యనారాయణ మినహా మిగిలిన వారిని అరెస్టు చేశారు. తర్వాత సత్యనారాయణ పోలీసులకు లొంగిపోయారు. ఎస్సై కిరణ్‌కుమార్ ఇటీవల బెయిలుపై విడుదలయ్యారు. మిగతావారు రిమాండులో ఉన్నారు. ‘నా భర్త చావుకు కారణమైన ఎస్సైకి నెల రోజుల్లోపే బెయిలు ఇచ్చేశారు. మిగతా నిందితులూ బయటకొచ్చేస్తామని చెబుతున్నారు..’ అని నాగేశ్వరరావు భార్య సౌదామిని వాపోయారు. 3.8.2022 కార్పొరేటర్ వేధింపులతో.. సీఎంకు లేఖ రాసి... గుంటూరు వైకాపా కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి వేధిస్తున్నారంటూ సీఎం జగన్‌కు లేఖ రాసి గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన స్థిరాస్తి వ్యాపారి చెన్నంరాజు గిరిధరవర్మ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. వెంకటరెడ్డిపై ఎలాంటి చర్యలూ లేవు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు 15.9.2022 గుడివాడ వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పీఏ లక్ష్మోజీ వేధిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదుచేస్తే తిరిగి నీపైనే కేసు పెట్టాల్సి ఉంటుందని బెదిరించారని వాలంటీరు లలిత వాపోయారు. 22.8.2022 అనంతపురం జిల్లా గుత్తిలో దళితుడైన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గోపీనాథ్‌పై వైకాపా నాయకుడు ఉమర్, ఆయన కుమారుడు మైను కలిసి దాడిచేసి దుర్భాషలాడారు. 21.8.2022 అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వెలిగొండలో కుళాయికి మంచినీరు రాలేదని ప్రశ్నించినందుకు దళితుడైన చిన్నయన్నప్ప కుటుంబంపై వైకాపా నాయకులు దాడిచేశారు. 25.10.2022 ‘మీరంతా వైకాపాలో చేరితేనే మంచినీళ్లు అందిస్తాం. లేదంటే ట్యాంకర్లు తెప్పించుకోండి’ అని దళితులను మార్కాపురం మండలం కోలభీములపాడు సర్పంచి చిట్టిరెడ్డి సుబ్బారెడ్డి బెదిరించారు. 7.11.2022 వైకాపా నాయకుడు శంకర్‌తో కలిసి అటవీ అధికారులు, పోలీసులు వేధిస్తున్నారంటూ పల్నాడు జిల్లా బీరవల్లిపాయకు చెందిన గిరిజనుడు శీలం నాగరాజు ఆత్మహత్యకు యత్నించారు. 18.11.2022 అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పాతచెదుళ్లలో దళితుడైన రమేష్ కుటుంబంపై వైకాపా నాయకుడు, సర్పంచి శ్రీనివాసులురెడ్డి వీరంగం సృష్టించారు. 20 ఏళ్లుగా రమేష్ కుటుంబం ఆధీనంలో ఉన్న స్థలానికి జేసీబీతో వెళ్లి అలజడి సృష్టించారు. భూ కబ్జాలు... 14.11.2022 శ్మశానాలనూ వదల్లేదు ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని మల్లికార్జుననగర్, బాలిరెడ్డినగర్ ప్రాంత గిరిజనులకు శ్మశానవాటిక కోసం సర్వేనంబరు 105లో 4.30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. వైకాపా నాయకుడు చాన్‌బాషా నకిలీ పట్టాతో వాటిని ఆక్రమించారు. అంత్యక్రియల కోసం వెళ్లిన గిరిజనులపై మారణాయుధాలతో దాడిచేశారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లతో కేసు నమోదుచేసినా, అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే చాన్‌బాషాను పోలీసులు అరెస్టు చేయట్లేదని గిరిజనులు వాపోతున్నారు. హైకోర్టును ఆశ్రయించారని... రాత్రికి రాత్రే విధ్వంసం అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డేపాళ్యానికి చెందిన 12 మందికి ఒక్కొక్కరికీ రెండేసి సెంట్ల చొప్పున 2013లో అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. వారు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వైకాపా నాయకుల ప్రోద్బలంతో ఆ స్థలంలో అంగన్‌వాడీ కేంద్రం, విలేజ్ క్లినిక్ భవనాలు నిర్మించాలని అధికారులు నిర్ణయించి.. స్థలాల్ని ఖాళీచేసి వెళ్లిపోవాలని పేదలపై ఒత్తిడి తెచ్చారు. బాధితులు అక్టోబరు 21న హైకోర్టును ఆశ్రయించారు. నవంబరు 11న విచారణ జరుగుతుందనగా.. 5వ తేదీ రాత్రి వైకాపా నాయకులు గుడిసెలను తొలగించారు. తెల్లారేసరికి పొక్లెయిన్‌తో పునాదులు తవ్వడంతో బాధితుల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిపై ఫిర్యాదుచేసినా కేసు పెట్టలేదు. వైకాపా నేతల అంతులేని అరాచకాలు ఈనాడు, ఈనాడు డిజిటల్ - అమరావతి న్యూస్‌టుడే, యంత్రాంగం వైకాపా అధికారంలోకి వచ్చాక గడిచిన మూడున్నరేళ్లలో జరిగిన అరాచకాలకు అంతూ పొంతూ లేదు. భూముల కోసం, ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి, రాజకీయ విభేదాలతో... ఇలా పలురకాల కారణాలతో హత్యలు, దాడులు, హత్యాయత్నాలు.. ఇలా పలు రకాల అఘాయిత్యాలకు పాల్పడ్డారు. స్పష్టమైన ఆధారాలున్నా వాటిపై పోలీసులు కేసులు పెట్టలేదు, పెట్టినా వాటిలో కీలక నిందితులను చేర్చలేదు. నమోదైన కేసుల్లో చాలావరకూ కొలిక్కి వచ్చిన పాపాన పోలేదు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి... లే అవుట్ కోసం స్కెచ్చేసి.. ప్రాణాలను బలితీసి.. 14.11.2022 తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం శివారు మామిడితోటకు చెందిన కోటిపల్లి కామాక్షి కుటుంబం రోడ్డును ఆనుకుని ఉన్న రెండు సెంట్ల భూమిలో గుడిసె వేసుకుని 40 ఏళ్లుగా ఉంటోంది. వీరి పక్కనే బాదిరెడ్డి అప్పారావు ఇల్లు ఉంది. వీటిని ఆనుకుని 48 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న జిల్లా పరిషత్ భూమిలో లే అవుట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.కామాక్షి ఇల్లు తొలగిస్తే లే అవుట్‌కి అడ్డం ఉండదని పావులు కదిపిన వైకాపా నాయకులు కొత్త ఇల్లు మంజూరు చేశామంటూ నమ్మించి నాలుగు నెలల కిందట అక్కడున్న ఇంటిని తొలగించారు. మోసపోయానని గుర్తించిన కామాక్షి తన స్థలంలో టెంటు వేసుకోగా.. ఎంపీడీవో వెళ్లి దాన్ని తొలగించి, స్థలం చుట్టూ కంచె వేయించారు. దీంతో కామాక్షి, ఆమె కుమారుడు మురళీకృష్ణ ఆత్మహత్యకు యత్నించారు. ‘మా చావుకు బాదిరెడ్డి అప్పారావు, బాదిరెడ్డి భీమన్న, కిలపర్తి వీర్రాజు, యామన దుర్గారావు కారణం’ అంటూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. చికిత్స పొందుతూ కామాక్షి మృతిచెందగా, మురళీకృష్ణ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బాధితులు సెల్ఫీ వీడియోలో ప్రస్తావించిన వ్యక్తులను పోలీసులు నిందితులుగా చేర్చలేదు. అధికార పార్టీ ఒత్తిళ్లే దీనికి కారణమన్న ఆరోపణలున్నాయి. కామాక్షి, మురళీకృష్ణపై తొలుత ఆత్మహత్యయత్నం కేసు నమోదుచేశారు. కామాక్షి చనిపోయాక సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద కేసు మార్చారు. వృద్ధురాలి ప్రాణాలు తీసి.. 27.10.2022 వైకాపా నాయకులు, అధికారుల దౌర్జన్యానికి ఆనందపురం మండలం పొడుగుపాలేనికి చెందిన శినగం ఎల్లమ్మ (81) బలైపోయారు. సర్వే నంబరు 43/23లోని ప్రభుత్వ భూమిలో చాన్నాళ్ల నుంచి గ్రామస్థులు పాకలు వేసుకుని ఉంటున్నారు. 6 నెలల క్రితం స్థానిక వైకాపా నాయకులు, అధికారులు వాటిని తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. అక్కడ అంగన్‌వాడీ భవనం నిర్మించేందుకు అధికారులు పొక్లెయిన్ తీసుకొచ్చి తవ్వకాలు చేపట్టగా బాధితులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎల్లమ్మను పొక్లెయిన్ ఢీకొట్టగా తీవ్ర గాయాలపాలై ఆమె ప్రాణాలొదిలారు. ఈ ఘటనపై పోలీసుల నుంచి ఇప్పటికీ ఎలాంటి చర్యలూ లేవు. హత్యలు, హత్యాయత్నాలు 17.11.2022 తెదేపా సీనియర్ నాయకుడు పి.శేషగిరిరావుపై కాకినాడ జిల్లా తునిలోని ఆయన నివాసంలో పట్టపగలే ఓ వ్యక్తి హత్యయత్నం చేశారు. భవానీ భక్తుడిలా వచ్చి కత్తితో దాడి చేశారు. ‘యనమల కృష్ణుడు, శేషగిరిపై దాడిచేస్తాం. మీరెవెరూ రావొద్దు’ అని మంత్రి దాడిశెట్టి రాజా కొన్ని రోజుల తునిలోని ఇద్దరు సీఐలను పిలిపించి చెప్పారని, ఈ హత్యాయత్నం వెనుక వారే ఉన్నారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. 03.09.2022 తెదేపా రాష్ట్రకార్యదర్శి చెన్నుపాటి గాంధీపై విజయవాడలో వైకాపా నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇనుపచువ్వతో ఆయన కన్ను పొడిచేశారు. ఈ ఘటనపై ఒక రోజంతా కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేశారు. తర్వాత కేసు పెట్టినా హత్యాయత్నం సెక్షన్లు లేవు. వైకాపా నాయకుడు వల్లూరి ఈశ్వర్ ప్రసాద్‌ను నిందితుడిగా చేర్చినా అరెస్టు చేయలేదు. మిగతా నిందితులైన గద్దె కల్యాణ్, సుబ్బు, లీలాకృష్ణ ప్రసాద్‌ను అరెస్టు చేసినా కోర్టులో గాయం నివేదిక సమర్పించకపోవటంతో న్యాయస్థానం వారి రిమాండు తిరస్కరించింది. 07.11.2022 శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురానికి చెందిన కొట్ర దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రిపై వారి కుటుంబానికే చెందిన వైకాపా నాయకుడు కొట్ర రామారావు హత్యాయత్నం చేశారు. ట్రాక్టర్‌తో కంకరమట్టిని వారిపై అన్‌లోడ్ చేయించి వారిని ఆ మట్టిలో కప్పేశారు. కొట్ర రామారావుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కొన్ని రోజులు రిమాండులో ఉన్న ఆయన ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. 26.09.2022 అనంతపురం జిల్లా తాడిపత్రిలో దళితుడైన కౌన్సిలర్ మల్లికార్జున ఇంట్లోకి చొరబడి ఆయనపైన, ఆయన తల్లి, సోదరిపైనా దాడిచేశారు. కేసులో హత్యాయత్నం సెక్షన్లు పెట్టలేదు. నిందితులనూ అరెస్టు చేయకుండా నోటీసులిచ్చి వదిలేశారు. 19.10.2022 కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కున్నూరుకు చెందిన తెదేపా నేత కురవ సిద్ధన్న (46)ను వైకాపా వర్గీయులు వేట కొడవళ్లతో దాడిచేసి చంపారు. సర్పంచి ఎన్నికల్లో సిద్ధన్న తన తల్లి లచ్చమ్మను పోటీలో నిలిపారు. తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన వైకాపా వర్గీయులు ఆయన్ను చంపేశారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులు రిమాండులో ఉన్నారు. పార్టీ కార్యాలయం కోసం దళితుడి భూమిపై కన్ను 22.10.2022 అనకాపల్లి జిల్లా శంకరం రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 28లో దళితుడైన జల్లూరి భీమన్నకు 50 ఏళ్ల క్రితం ప్రభుత్వం 2 ఎకరాలు ఎసైన్ చేసింది. ఈ భూమిలో జీడితోటలు సాగు చేసుకునేవారు. హుద్‌హుద్ తుపానుకు తోటలు ధ్వంసమైపోయాయి. అప్పటి తహసీల్దార్ వెబ్‌ల్యాండ్‌లో దాన్ని ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. దీనిపై భీమన్న కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్పటికే కొందరు అక్కడ కొంత భూమి ఆక్రమించి, కల్యాణ మండపం కట్టేశారు. మిగతా భూమి వైకాపా కార్యాలయ నిర్మాణానికి అనువుగా ఉందని, దాన్ని ఇచ్చేయాలని కొందరు నాయకులు వారిపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై ‘కార్యాలయం కట్టుకుంటాం.. తప్పుకో’ శీర్షికన ఈనాడులో కథనం ప్రచురితమైంది. ఆ తర్వాత భీమన్న వారసులను వైకాపా నాయకుడు ఒకరు పిలిపించి ‘వార్త రాయిస్తావా? ఆ భూమి నీదెలా అవుతుంది’ అని బెదిరించారు. బాధితులు కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదుచేయగా ఆయన విచారణకు ఆదేశించారు. వైకాపా కార్యాలయం కోసం ఆ స్థలాన్ని పరిశీలించలేదని ఆ ఫిర్యాదును అధికారులు మూసేశారు. ప్రస్తుతం ఆ భూమి భీమన్న వారసుల చేతిలోనే ఉంది. కూల్చివేతల పర్వం 04.11.2022 గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో రహదారి విస్తరణ పేరిట జనసేన, తెదేపా సానుభూతిపరులు, కార్యకర్తలకు చెందిన 53 ఇళ్లు, ప్రహరీలు కూల్చేశారు. గ్రామానికి వెళ్లే దారులు ఇరుగ్గా ఉన్నా పట్టించుకోని అధికారులు.. ఆర్టీసీ బస్సు కూడా రాని ఉళ్లో దారి విస్తరిస్తామంటూ ఇళ్లను కూల్చేశారు. జనసేన ప్లీనరీ నిర్వహణ కోసం స్థలం ఇచ్చినందునే కక్ష కట్టి కూల్చివేతలు చేపట్టారని బాధితులు ఆరోపించారు. కూల్చివేతలు జరిగి 15 రోజులు దాటిపోతున్నా ఇప్పటికీ రహదారి విస్తరణ పనులు ప్రారంభం కాలేదు. 15.11.2022 నంద్యాల జిల్లా డోన్‌లో తెదేపా నాయకుడు మురళీకృష్ణగౌడ్ వెంచర్‌కు రక్షణగా నిర్మించిన గోడను కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులు కూల్చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు డోన్ పర్యటన సందర్భంగా ఇటీవల మురళీకృష్ణగౌడ్ ఇంటికి వెళ్లారు. ఆ అక్కసుతోనే పదేళ్లుగా ఉన్న రక్షణ గోడను అధికారులు ఇప్పుడు ఉన్నపళంగా కూల్చేశారని మురళీకృష్ణగౌడ్ వాపోయారు. తమకు రెండు రోజుల సమయం ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధమని తేలితే తామే పడగొడతామని చెప్పినా అధికారులు వినలేదు. 20.11.2022 తాను డిమాండు చేసిన డబ్బు ఇవ్వలేదన్న కోపంతో శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో 11వ వార్డు కౌన్సిలర్ వాజీదా భర్త, వైకాపా నాయకుడు నూరుల్లా... కళావతమ్మ కుటుంబానికి చెందిన ఇంటిని, ఇమాంబీ కుటుంబానికి చెందిన షెడ్డును అర్ధరాత్రి వేళ పొక్లెయిన్‌తో కూల్చేయించారు. 08.11.2022 విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతిగృహాలకు సమీపంలో ఉన్న 16 దుకాణాలను జీవీఎంసీ అధికారులు అర్ధరాత్రి వేళ కూల్చేశారు. ముందుస్తు నోటీసులు ఇవ్వకుండానే అక్కడున్న దుకాణాలన్నింటినీ నేలమట్టం చేశారు. బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ మరోచోట దుకాణాలు ఏర్పాటు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. దాడులు-దౌర్జన్యాలు 29.10.2022 ప్రభుత్వాన్ని విమర్శించారని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన జనసేన కార్యకర్త మారిశెట్టి శ్రీనివాసరావుపై వైకాపా నాయకులు దాడిచేసి, తిరిగి ఆయనపైనే ఫిర్యాదు చేశారు. దీంతో ఆందోళనకు లోనైన శ్రీనివాసరావు ఆత్మహత్యకు యత్నించారు. ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు తనపై దాడి చేశారని శ్రీనివాసరావు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు కులం పేరుతో దూషించారంటూ వైకాపా మద్దతుదారు కారంశెట్టి విజయరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు పెట్టిన పోలీసులు, అతని ఫిర్యాదుపై కొర్లకుంట వెంకటేశ్వర్లు, నాగేమల్లేశ్వరరావులను 4, 5వ నిందితులుగా చేర్చారు. ఈ రెండు కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది. శ్రీనివాసరావు ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ‘నాపై వైకాపా నాయకులు దాడిచేసి మూడు వారాలు గడుస్తున్నా ఎవరినీ అరెస్టు చేయలేదు. డీఎస్పీ విచారించలేదు’ అని ఆయన వాపోయారు. 21.10.2022 శ్రీకాకుళం జిల్లా టెక్కలి జనసేన కార్యాలయంపై 30 మంది దుండగులు దాడి చేశారు. విలువైన సామగ్రి ధ్వంసం చేశారు. ఘటన జరిగి నెల రోజులవుతున్నా ఇప్పటివరకూ పోలీసులు నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేయలేదు. వైకాపా కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారంటూ కొందరు అనుమానితుల పేర్లతో జనసేన నాయకుడు కణితి కిరణ్‌కుమార్ పోలీసులకు అదేరోజు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఇంకా సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించాలని పోలీసులు చెబుతున్నారు. 18.11.2022 కృష్ణాజిల్లా పెడనలో మంత్రి జోగి రమేష్‌ను ఉద్దేశించి గోడపత్రికలు అంటిస్తున్నారంటూ జనసేన కార్యకర్తలపై మంత్రి అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో వైకాపా నాయకులతో పాటు జనసేన వారిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. 25.08.2022 కుప్పంలో తెదేపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్ వద్దనున్న ఫ్లెక్సీలను చించేసి, తెదేపా నాయకుడు రవిచంద్రబాబుపై వైకాపా నాయకులు దాడి చేశారు. పోలీసులు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకే వత్తాసు పలుకుతున్నారంటూ వైకాపా ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్దకు వెళ్లడానికి తెదేపా కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిపై లాఠీఛార్జీ చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు పీఏ మనోహర్, తెదేపా కార్యకర్త రాజుతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. తర్వాత అదే నెల 30న అన్నక్యాంటీన్ వద్ద ఏర్పాటుచేసిన షెడ్డును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వైకాపా నాయకుల ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందని తెదేపా నాయకులు ఆరోపించారు. చర్యలే లేవు: తేలికపాటి సెక్షన్లతో నిందితులపై కేసు నమోదు చేశారు. తర్వాత వారిపై ఎలాంటి చర్యలూ లేవు. వైకాపా అరాచకానికి మరికొన్ని తార్కాణాలివి 13.08.2022 భర్త, కుటుంబీకులతో కలిసి వెళ్తున్న ఓ మహిళా వైద్యురాలితో విశాఖ జిల్లా పెందుర్తి వైకాపా ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ అనుచరుడు మనోహర్ అసభ్యంగా ప్రవర్తించాడు. కత్తితో పొడుస్తానని బెదిరించాడు. 02.08.2022 మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెదేపా కార్యకర్త మాటూరి నాగరాజుపై అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నంగినారపాడులో వైకాపా కార్యకర్తలు దాడిచేశారు. 07.08.2022 గుడివాడలోని ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో పర్వతనేని జగన్మోహన్‌రావు శతజయంతి వేడుకలకు హాజరైన గుత్తా శివరామకృష్ణపై వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు దాడికి పాల్పడ్డారు. 12.08.2022 ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో ప్రభుత్వ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలపై వైకాపా నాయకుల్ని ప్రశ్నించినందుకు కృష్ణారెడ్డి అనే వ్యక్తిపై దాడి చేశారు. తిరిగి అతనిపైనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 12.08.2022 వైకాపా నాయకులు చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పెందుర్తి మండలం జెర్రిపోతులపాలేనికి చెందిన తెదేపా కార్యకర్త గల్లా శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలని వేడుకున్నారు. 18.08.2022 కడప నగరం ఉక్కాయపల్లిలో ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన వార్డు సచివాలయ సిబ్బందిపై వైకాపా నాయకుడు క్రాంతికుమార్‌రెడ్డి, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. 15.09.2022 కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం ఈదులమద్దాలికి చెందిన తెదేపా నాయకుడు కనుమూరి ఈశ్వరరావుపై వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు, నాయకులు బీరు, సీసాలు, కర్రలతో దాడిచేశారు. 03.09.2022 శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలానికి చెందిన వైకాపా ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వంశధార ప్రాజెక్టు ఈఈ శ్రీకాంత్ కూర్చున్న కుర్చీని కాలితో తన్ని ఆయన్ను వెనక్కి తోసేశారు. బాధిత అధికారిపైనే తిరిగి కేసులు పెడతామని బెదిరించారు. 18.09.2022 వైకాపా ఎంపీ అనుచరుడు, గుంటూరుకు చెందిన వైకాపా నాయకుడు రాజా, ఆయన అనుచరులు బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో గజ ఈతగాళ్లపై దాడి చేశారు. 13.09.2022 తిరుపతిలోని వెంకటరెడ్డికాలనీకి చెందిన పూతలపట్టు లక్ష్మీనరసమ్మ ఇంటిపై వైకాపా నాయకులు కొందరు దాడి చేసి వస్తువులు ధ్వంసం చేశారు. స్థానిక సమస్యలపై వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు ఆమెను దూషించి దాడి చేశారు. 06.11.2022 శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పురపాలక శాఖ పట్టణ ప్రణాళిక విభాగంలో అటెండర్‌గా పనిచేస్తున్న కృష్ణపై వైకాపా కౌన్సిలర్ రమణయ్య దాడికి పాల్పడ్డారు. నిబంధనలు అతిక్రమించి ఇల్లు కడుతున్న వారికి నోటీసులిచ్చినందుకు అతనిపై దాడి చేశారు. 13.09.2022 పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో నల్లబోతుల మునమ్మపై వైకాపా నాయకుడు బత్తుల చిన్న ఆంజనేయులు దాడికి పాల్పడ్డారు. మునమ్మ భర్త నరసింహరావు, ఆయన వర్గం ఓట్లు వేయకపోవటం వల్లే సర్పంచి ఎన్నికల్లో ఓడిపోయానని కక్ష పెట్టుకుని ఆంజనేయులు తమపై దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. * ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటపల్లికి చెందిన వైకాపా నాయకుడు పి.దుర్గాప్రసాద్ ఎన్టీపీసీలో పనులు చేయటానికి వచ్చిన విశ్వాస్ కన్‌స్ట్రక్షన్ సిబ్బందిపై దాడి చేశారు. 16.10.2022 నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఏపిలగుంటకు చెందిన శ్రీనివాసులు దంపతులకు చెందిన పొలం బాటను వైకాపా నాయకుడు రామకృష్ణారెడ్డి ఆక్రమించారు. దీనిపై ‘గడగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన వైకాపా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డికి ఫిర్యాదు చేసి, ఆయన కాళ్లపై పడి వేడుకున్నారు. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. 16.11.2022 అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్త ఎల్లవరానికి చెందిన పావాడా వెంకటలక్ష్మితో పాటు మరికొందరు చెరువు స్థలంలో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. వెంకటలక్ష్మి ఉంటున్న పూరిగుడిసెను వైకాపా నాయకులు అధికారులతో కూల్చివేయించారు. మిగతా ఇళ్ల జోలికి వెళ్లలేదు. ‘వైకాపా నాయకుడు కన్నూరి సత్తిబాబు లైంగికంగా కోరిక తీర్చాలని నన్ను బెదిరిస్తున్నారు. అంగీకరించలేదని కక్ష పెంచుకున్నారు. నన్ను భయపెట్టటమే కాకుండా నా గుడిసె కూల్చేయించారు. మరో నలుగురు వైకాపా కార్యకర్తలు 2నెలలుగా నరకం చూపిస్తున్నారు’ అంటూ ఆమె వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరినీ అరెస్టు చేయలేదు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.