Jump to content

ఇక్కడ చదవలేం బ్రో..


Peruthopaniemundhi

Recommended Posts

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత చదువులను గాలికొదిలేసింది. నాణ్యమైన విద్య లేకపోవడం.. ప్రైవేటులో పోస్టుగ్రాడ్యుయేషన్‌ (పీజీ) కోర్సులకు బోధన రుసుముల చెల్లింపు నిలిపివేయడంతో వాటిలో చేరేవారే లేకుండా పోయారు.

రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలస పోతున్న విద్యార్థులు
ప్రైవేటులో పీజీ కోర్సులకు బోధన రుసుముల చెల్లింపు నిలిపివేత
ప్రభుత్వ వర్సిటీల్లో మారని కోర్సులు.. భర్తీకాని అధ్యాపక ఖాళీలు
ఎంటెక్‌, పీజీ ప్రవేశాల్లో దారుణంగా క్షీణత  
డీఎస్సీలు లేక బీఈడీ చదివేవారే కరవు
నాణ్యమైన ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల వైపు యువత చూపు
ఈనాడు - అమరావతి

ఇక్కడ చదవలేం బ్రో!

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత చదువులను గాలికొదిలేసింది. నాణ్యమైన విద్య లేకపోవడం.. ప్రైవేటులో పోస్టుగ్రాడ్యుయేషన్‌ (పీజీ) కోర్సులకు బోధన రుసుముల చెల్లింపు నిలిపివేయడంతో వాటిలో చేరేవారే లేకుండా పోయారు. సీటు ఇస్తాం రండి.. అని పిలిచినా ముందుకు వచ్చేవారు కనిపించడం లేదు. ఈ ఏడాది పీజీ దరఖాస్తుల కోసం ఉన్నత విద్యామండలి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహిస్తోందంటే దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులే లేరు. మరోపక్క సిలబస్‌లో మార్పు చేయకపోవడం.. ఉపాధి కల్పించే కోర్సులు ప్రవేశపెట్టకపోవడంతో వర్సిటీల్ల్లో చేరేందుకూ యువత ముందుకు రావడం లేదు. ఒకప్పుడు క్యాంపస్‌లో సీటు సాధించడం గొప్పగా భావించే పరిస్థితి నుంచి ఇప్పుడు సీట్లు ఖాళీగా ఉండే దుస్థితి ఏర్పడింది. రెండేళ్లపాటు కష్టపడి, పీజీ పూర్తి చేసినా ఉద్యోగాలు లభించవనే ఉద్దేశంతో రాష్ట్రంలో చదవకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంటెక్‌ పరిస్థితి సైతం అధ్వానంగా మారింది. ఎంటెక్‌లో ప్రవేశాలు పొందుతున్న వారి కంటే ఎంఎస్‌కు విదేశాలకు వెళ్లే వారే అధికంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు. దీంతో బీఈడీ చదివేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదు. ఇంజినీరింగ్‌లోనూ ప్రతిభావంతులు బయటకు వెళ్లిపోతున్నారు. ఈఏపీసెట్‌లో 100లోపు ర్యాంకులు సాధిస్తున్న వారు ఐఐటీ, ఎన్‌ఐటీలు, ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. జేఎన్‌టీయూ-కాకినాడ, జేఎన్‌టీయూ-అనంతపురం వంటి వాటిలో సీట్లు వచ్చినా కొందరు వాటిని రద్దు చేసుకుంటున్నారు.

మారని కోర్సు.. అందని ఫీజు..

ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు ప్రభుత్వం బోధన రుసుముల చెల్లింపు నిలిపివేసింది. దీంతో సొంతంగా ఫీజులు చెల్లించి, ఉన్నత విద్య చదివే వారి సంఖ్య తగ్గింది. చదువు, వసతికి అయ్యే వ్యయాన్ని భరించలేక పేదలు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. సాధారణ పీజీ కోర్సుల సిలబస్‌ను కాలానుగుణంగా మార్పు చేయడం లేదు. కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఆర్ట్స్‌ కోర్సుల్లో చదివినా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తున్నాయి. అలాంటి వాటిలో సీట్లు లభించడమూ కష్టంగా ఉంది. కానీ, రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సీటు ఇస్తామన్నా చేరేవారు లేరు. ప్రభుత్వ విధానాలే దుస్థితికి కారణంగా నిలుస్తున్నాయి.

* పీజీ చదివే ఎస్సీ, ఎస్టీలకు బోధన రుసుములు చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం వీటిని తీసుకోవడం లేదు. దీంతో ఎస్సీ, ఎస్టీలు ప్రైవేటులో పీజీ చేయాలనుకున్నా ఇబ్బంది పడుతున్నారు.

* 2022-23లో పీజీ కోర్సుల్లో 44,463 సీట్లు ఉండగా.. కేవలం 16,252 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది దరఖాస్తులను పెంచేందుకు సామాజిక మాధ్యమాల్లో ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. కోర్సులను మార్చాల్సిన విశ్వవిద్యాలయాలు పిల్లలు చేరడం లేదని కొన్ని కోర్సులను మూసేస్తున్నాయి. ఎంఏ చరిత్ర, పొలిటికల్‌ సైన్సు, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లాంటి కోర్సుల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఎంబీఏ, ఎంసీఏల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎంబీఏలో దాదాపు సగం సీట్లు మిగిలిపోతున్న పరిస్థితి ఉంది.

విదేశాల్లో చదివేందుకే..

రాష్ట్రంలో ఎంటెక్‌ చదివే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. వారికంటే విదేశాల్లో ఎంఎస్‌కు వెళ్తున్న వారే అధికంగా ఉన్నారు. విదేశీ ఎంఎస్‌తో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడంతో అక్కడికి వెళ్లిపోతున్నారు. ఎంటెక్‌కు బోధన రుసుముల చెల్లింపు పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఇది ప్రవేశాల పైనా ప్రభావం చూపింది. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో కలిపి ఏటా సరాసరిన 5-6 వేల మంది ఎంటెక్‌ ప్రవేశాలు పొందుతుండగా.. విదేశాలకు వెళ్లే వారి సంఖ్య 15 వేలకు పైగా ఉంది. ఎంటెక్‌ చేసే వారిలోనూ ఎక్కువ మంది డీమ్డ్‌, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

* ఎంటెక్‌ చదివే వారు తగ్గిపోవడంతో బీటెక్‌లో అధ్యాపకుల సమస్య ఏర్పడింది. విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్‌తో కళాశాలలు సెక్షన్లు పెంచుతున్నా బోధించే వారు దొరకడం లేదు. కొన్ని కళాశాలలు బోధనను అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చేస్తున్నాయి. కొన్నిచోట్ల ఆన్‌లైన్‌లో బోధన చేయిస్తున్నారు. ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉన్న వారిని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఎక్కువ జీతాలకు తీసేసుకుంటున్నాయి.

ఉద్యోగం లేని విద్య ఎందుకని!

ఉపాధ్యాయ విద్య బీఈడీ కోర్సులో చేరే వారే లేకుండాపోయారు. ఒకప్పుడు భారీ డిమాండ్‌ ఉన్న బీఈడీ, డీఈడీ కోర్సులు అనామకంగా మారాయి. ఈ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు గడిచినా ఒక్క నియామక ప్రకటన విడుదల చేయలేదు. పని చేస్తున్న వారినే హేతుబద్ధీకరణతో మిగులుగా తేల్చింది. ఈ లెక్కన భవిష్యత్తులోనూ నియామకాలు చేపట్టే పరిస్థితి లేదు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాలు లేని కోర్సులెందుకంటూ ఎవ్వరూ చేరడం లేదు. చివరికి ఒడిశా, అస్సాం రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో యాజమాన్యాలు కళాశాలలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఈడీలో 37,367 సీట్లు ఉంటే 3,231 మాత్రమే భర్తీ అయ్యాయి. పరిస్థితి ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

* రాష్ట్రంలో ప్రైవేటు డీఈడీ కళాశాలలు పూర్తిగా మూతపడ్డాయి. కొన్ని యాజమాన్యాలు పిల్లలు చేరడం లేదని స్వచ్ఛందంగా మూసేసుకున్నాయి. మరికొన్ని ప్రవేశాల్లో నిబంధనలు ఉల్లంఘించాయంటూ ప్రభుత్వం అనుమతులు నిలిపివేసింది. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో 745 డీఈడీ కళాశాలలు ఉండగా.. ఇప్పుడు వీటి సంఖ్య 20కి చేరింది. వాటిలో 14 ప్రభుత్వ కళాశాలలే.

డిగ్రీ పడిపోతోంది..

డిగ్రీ ప్రవేశాలుపడిపోతున్నాయి. గత రెండేళ్లల్లో డిగ్రీలో సరాసరిన 2.50 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. ఈసారి 1.41 లక్షల మందే చేరారు. ఎక్కువమంది గ్రామీణ విద్యార్థులే ఉంటున్నారు. కొన్ని ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలే లేవు. అధ్యాపకుల అర్హతలు, నాణ్యమైన విద్యపై తనిఖీ వ్యవస్థే లేదు. సిలబస్‌ మార్పు చేసేశాం.. ఇంటర్న్‌షిప్‌ తెచ్చేశామని గొప్పగా చెబుతున్న ఉన్నత విద్యాశాఖ దీని అమలును సరిగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.


మెరికలు బయటకే..

ఈఏపీసెట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్న విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఐఐటీ, నిట్‌, ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది ఈఏపీసెట్‌కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా.. ఈసారి ఇప్పటి వరకు 2.80 లక్షలు వచ్చాయి. మన రాష్ట్రానికి చెందిన వారు 75 వేలమంది ఈసారి తెలంగాణ ఎంసెట్‌కు దరఖాస్తు చేశారు. హైదరాబాద్‌ చుట్టూ మంచి ఇంజినీరింగ్‌ కళాశాలలు.. అక్కడే ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉండడంతో యువత అక్కడ చేరేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇక్కడ నాణ్యమైన విద్య అందకపోవడమూ ఒక కారణం. ఈఏపీసెట్‌లో 100లోపు ర్యాంకులు సాధించిన వారిలో ఒకరిద్దరు మినహా మిగతావారు కళాశాలల్లో చేరేందుకు కనీసం ఐచ్ఛికాలు కూడా నమోదు చేసుకోవడం లేదు. 10 వేల ర్యాంకులు సాధిస్తున్న వారిలోనూ ఎక్కువగా ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీలకు వెళ్లిపోతున్నారు.ఇంజినీరింగ్‌లో 1,57,979 సీట్లు ఉంటే ఈ ఏడాది 1,07,601 సీట్లు భర్తీ అయ్యాయి. కళాశాలల ఫీజులను పెంచాలని యాజమాన్యాలు కోరుతున్నా గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఒకటే ఫీజు అమలు చేస్తోంది. దీంతో నష్టాలు పెరిగిపోతున్నాయంటూ యాజమాన్యాలు నాణ్యమైన విద్యపై దృష్టిపెట్టడం లేదు. బోధన రుసుములను సకాలంలో చెల్లించడం లేదు. ఈ ఏడాది బీటెక్‌ నాలుగో ఏడాది చదివే విద్యార్థులకు ఇప్పటి వరకు ఒక్క త్రైమాసికం ఫీజు చెల్లించింది. మరో నెలన్నరలో చదువు పూర్తవుతున్నా ఫీజు ఇవ్వడం లేదు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...