Jump to content

అత్యాధునికంగా అక్కడ.. తీసికట్టుగా ఇక్కడ


Peruthopaniemundhi

Recommended Posts

హైదరాబాద్‌

అత్యాధునికంగా అక్కడ.. తీసికట్టుగా ఇక్కడ

తెలంగాణ పోలీస్‌.. ఈ పేరు చెబితే చాలు.. అత్యాధునికమైన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరి కదలికా గమనించే లక్షల సీసీ కెమెరాలు, స్మార్ట్‌ పోలీసుస్టేషన్లు, సరికొత్త వాహనాలు, సైబర్‌నేరాలు, మాదకద్రవ్యాలు అరికట్టేందుకు ప్రత్యేక విభాగాలు టక్కున గుర్తుకొస్తాయి.

అదే ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగం పేరు చెబితే వైకాపా ప్రత్యర్థులు, ప్రతిపక్షాలపై రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు, అక్రమ కేసులు, అరెస్టులు, ప్రశ్నించే, హక్కుల కోసం నినదించే గొంతుల అణచివేతలే కళ్లముందు మెదులుతాయి. నాలుగేళ్ల వైకాపా పాలనలో పోలీసింగ్‌ మొదలుకొని వసతులు, సీసీ కెమెరాల ఏర్పాటు వరకూ అన్నింటిలోనూ రివర్స్‌లో నడుస్తోంది. తెలంగాణ పోలీసు సాంకేతిక హంగులు, మౌలిక వసతులు సమకూర్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంటే ఏపీ పోలీసు మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. జగన్‌ ప్రభుత్వం కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటుచేయలేదు సరికదా.. గతంలో ఉన్నవీ తగ్గించేసింది. కొత్త వాహనాలు కొనకపోవడంతో పాతవాటితోనే పోలీసులు నెట్టుకురావాల్సి వస్తోంది. నాలుగేళ్లుగా ఒక్క పోలీసు ఉద్యోగాన్నీ భర్తీచేయలేదు. రాష్ట్రవిభజన తర్వాత తెదేపా హయాంలో మొదటి అయిదేళ్లలో అభివృద్ధి విషయంలో ఏపీ పోలీసు శాఖ తెలంగాణ పోలీసు విభాగంతో పోటాపోటీగా ప్రయాణించింది. అదే వేగం, అదే చొరవ కొనసాగించి ఉంటే ఏపీ పోలీసు విభాగం ఈ పాటికే అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకుని మెరుగుపడేది. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక మొత్తం రివర్స్‌ అయ్యింది. గత నాలుగేళ్లుగా ప్రతిపక్ష పార్టీలను వేధించటానికే పోలీసు శాఖను వినియోగించుకుంటున్న జగన్‌ ప్రభుత్వం.. ఏపీ పోలీసు విభాగం బలోపేతంపై కనీస స్థాయిలోనూ దృష్టిసారించట్లేదు. ఏపీలో ఉన్నది 95% రాజకీయ పోలీసింగే. వైకాపా నేతలు చెప్పినట్లు నడుచుకుంటేనే ఇక్కడ అధికారులు, సిబ్బంది తమ స్థానాల్లో కొనసాగుతారు. లేదంటే శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే.

తొలి అయిదేళ్లలోనే మంచి రోజులు

రాష్ట్ర విభజన తర్వాత తెదేపా హయాంలో మొదటి అయిదేళ్లలో ఏపీ పోలీసు శాఖకు పెద్ద ఎత్తున మౌలిక వసతులు సమకూరాయి. తెదేపా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. రూ.150 కోట్లతో రెండు విడతల్లో పోలీసు వాహనాలు కొనుగోలు చేసింది. మంగళగిరిలో పోలీసు ప్రధాన కార్యాలయం, టెక్‌ టవర్‌ నిర్మించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యాధునిక ప్రమాణాలతో మోడల్‌ పోలీసుస్టేషన్లను నిర్మించింది. రెండు విడతల్లో పోలీసు నియామకాలు చేపట్టింది. రాష్ట్రస్థాయి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. వైకాపా వచ్చాక అలాంటి చర్యలేవీ లేకుండా పోయింది.


కొత్త వాహనాల్లేవు... పాతవే దిక్కు

జగన్‌ ప్రభుత్వం పోలీసులకు కొత్త వాహనాలు సమకూర్చకపోవటంతో వారు పాతవాటితోనే నెట్టుకొస్తున్నారు. వైకాపా అధికారం చేపట్టాక గతేడాది మార్చిలో దిశ పేరిట గస్తీ కోసం ద్విచక్ర వాహనాలను, 163 కార్లను పోలీసు శాఖకు ఇచ్చింది. అవి మినహా పోలీసుల కోసం వాహనాలేవీ కొనలేదు. తెదేపా హయాంలో 2015లో రూ.100 కోట్లతో 2,422 వాహనాలు, 2018లో రూ.50 కోట్లతో 1,400 వాహనాలను కొన్నారు. అవీ లేకపోతే ఏపీ పోలీసు విభాగం ఇప్పుడు చాలా ఇబ్బంది పడేది. ప్రస్తుతం ఏపీ పోలీసు శాఖ వద్ద 9,753 వాహనాలున్నాయి.


అధునాతన వాహనాలతో తెలంగాణ పోలీసు పరుగులు

డొక్కు జీపులు.. వేగం లేని ఎస్కార్ట్‌ బండ్లు.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఇదీ పోలీసు వాహనాల పరిస్థితి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అధునాతన హంగులతో కూడిన వాహనాలు వచ్చాయి. ఇప్పటివరకు కొత్తగా వెయ్యికి పైగా పెట్రోలింగ్‌ కార్లు.. 2100కు పైగా బ్లూకోల్ట్స్‌ వాహనాలను సమకూర్చుకున్నారు.


ఉన్న వ్యవస్థలనైనా సద్వినియోగం చేసుకోలేక

నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ దిశగా అవసరమైన అధునాతన సాంకేతిక వ్యవస్థలను వేటినీ ఈ నాలుగేళ్లలో వైకాపా ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. గత ప్రభుత్వహయాంలో ఏర్పాటుచేసిన వ్యవస్థలనైనా సద్వినియోగం చేసుకోవట్లేదు. తెదేపా హయాంలో సీఎంవోలోనే రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ పేరిట రాష్ట్రస్థాయి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి వాటిని ఈ కేంద్రానికి అనుసంధానించారు. సీసీ కెమెరాల్లో వచ్చే దృశ్యాలను ఓ భారీ వీడియోవాల్‌పై చూస్తూ నిరంతరం పర్యవేక్షించేవారు. నేర నియంత్రణ, నేరాల ఛేదన, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు విపత్తుల సమయంలో ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, వివిధ సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఇది బాగా ఉపయోగపడేది. మంగళగిరిలో నిర్మించిన టెక్‌టవర్‌కు రాష్ట్రంలోని అన్ని పోలీసు యూనిట్లలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల్ని అనుసంధానించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఇక్కడి నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. సాంకేతిక అస్త్రాల ఆధారంగా నేరగాళ్ల కట్టడికి అవసరమైన వ్యూహాల రూపకల్పన, దర్యాప్తులో అత్యుత్తమ సాంకేతిక పద్ధతుల వినియోగంపై నిరంతర అధ్యయనం, నేరగాళ్ల సమగ్ర సమాచార నిరంతర విశ్లేషణ ఇక్కడ జరిగేలా ఏర్పాట్లుచేశారు. వైకాపా ప్రభుత్వం వాటిని మరింతగా అభివృద్ధి చేస్తే సాంకేతికంగా ఏపీ పోలీసు విభాగం మరింత మెరుగుపడి ఉండేది. కానీ అభివృద్ధి మాట దేవుడెరుగు.. ఉన్న వ్యవస్థలనూ సద్వినియోగం చేసుకోవట్లేదు.


దేశంలోనే అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

 

హైదరాబాద్‌లో రూ.600 కోట్లతో అత్యాధునిక రాష్ట్రస్థాయి పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నిర్మించారు. దేశంలో మరెక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. ఇందులో అయిదు టవర్లు ఉంటాయి. తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని సీసీ కెమెరాలనూ ఈ కేంద్రం నుంచే పర్యవేక్షించొచ్చు. లక్ష కెమెరాల్లో నమోదయ్యే దృశ్యాల్ని చూడగలిగే సామర్థ్యం గల భారీ వీడియోవాల్‌ ఉంది. దాదాపు 10 లక్షల సీసీ కెమెరాల ఫీడ్‌ను నిక్షిప్తం చేసేందుకు అనువుగా బెల్జియం, జర్మనీ నుంచి తెప్పించిన 30 పెటాబైట్ల సర్వర్లు ఇక్కడ ఉన్నాయి. కృత్రిమమేథను వినియోగించి దృశ్యాలను విశ్లేషించే ఎనలిటికల్‌ సాఫ్ట్‌వేర్‌ ఉంది. వరదల్లాంటి అత్యవసర పరిస్థితుల్లో అన్ని శాఖలూ ఇక్కడే సమీక్షించొచ్చు.


మాదకద్రవ్యాలు.. సైబర్‌ నేరాల నియంత్రణ పట్టదు

 

గంజాయి సాగు, వినియోగం, సరఫరా, రవాణాకు ఏపీ కేంద్రంగా మారింది. 2021లో ఏపీలో పట్టుకున్నంత గంజాయి మరే రాష్ట్రంలోనూ స్వాధీనం చేసుకోలేదని ఎన్‌సీబీ (నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో) నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఆ ఏడాదిలో 7,49,761 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంటే అందులో 2,00,588 కిలోలు (26.75%) ఏపీలోనే పట్టుబడింది. అయినా వీటి మూలాల్లోకి వెళ్లి అరికట్టే చర్యల్లేవు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఈ బాధ్యతలు చూస్తున్నా.. మాదకద్రవ్యాలను అరికట్టే ప్రత్యేక విభాగాలు లేవు. రాష్ట్రంలో సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రుణయాప్‌లు, ఆన్‌లైన్‌ గేమ్‌ల బారిన పడి సామాన్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళలపై సైబర్‌ వేధింపులు ఎక్కువయ్యాయి. అయినా వాటిని అరికట్టడంపై శ్రద్ధ లేదు. సీఐడీలోని సైబర్‌ నేరాల విభాగమైతే... ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిని వేధించేందుకు, వారిపై అక్రమ కేసులు బనాయించేందుకే పరిమితమైంది.


సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల ఆటకట్టించేందుకు ప్రత్యేక విభాగాలు

సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించేందుకు.. మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా టీఎస్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కోటిక్‌ బ్యూరోలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ నుంచి సైబర్‌ నేరాల బాధితులు 1930కి ఫోన్‌ చేస్తే జీపీఎస్‌ ఆధారంగా సైబర్‌ సెక్యూరిటీ కాల్‌సెంటర్‌కే ఫోన్‌ వస్తుంది. అలాగే 100కు ఫోన్‌ చేసి సైబర్‌ నేరాల గురించి ఫిర్యాదు చేసినా ఈ బ్యూరోకే చేరేలా అనుసంధానించారు. 130 మంది నిపుణులైన సిబ్బంది ఈ బ్యూరోలో పనిచేస్తున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాల్ని విశ్లేషించేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌.. ర్యాన్సమ్‌వేర్‌ దాడుల్ని నియంత్రించేందుకు సెక్యూరిటీ సెంటర్‌.. నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లను గుర్తించి అప్రమత్తం చేసేందుకు థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి.


పోలీసు ఎకాడమీయే ఏర్పాటు చేయలేని దుస్థితి

కొత్తగా నియమితులైన ఎస్సైలు, డీఎస్పీలు, ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్తలు, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, ఇతర పోలీసు అధికారులకు అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ఎకాడమీ (అప్పా) ఇప్పటికీ ఏపీకి పూర్తిస్థాయిలో సమకూరలేదు. అనంతపురంలోని పోలీసు శిక్షణ కేంద్రాన్నే అప్పాగా మార్చి ప్రస్తుతం అక్కడే శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ రాష్ట్రస్థాయి ఎకాడమీకి సరిపడా మౌలిక వసతులు, సదుపాయాలు లేవు. అయినా కొత్తగా అప్పాను నెలకొల్పాలన్న ధ్యాసే జగన్‌ ప్రభుత్వానికి లేదు.


ఈవ్‌టీజింగ్‌కు ముకుతాడేది?

 

రాష్ట్రంలోని ప్రధాన సమస్యల్లో ఈవ్‌టీజింగ్‌ ఒకటి. రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, ప్రజారవాణా వాహనాల్లో యువతులు, మహిళలను వేధించేవారి ఆట కట్టించేందుకు ఏపీ పోలీసు విభాగం ప్రత్యేకవిభాగాలు, బృందాల్ని ఏర్పాటుచేయలేదు. మహిళా పోలీసుల్ని మఫ్టీలో ఉంచి ఇలాంటి ఆకతాయిలను గుర్తించి పట్టుకోవటం లాంటి చర్యల్లేవు. దీంతో ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారు. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.


తెలంగాణలో షీ టీమ్స్‌

తెలంగాణలో ఆకతాయిల ఆటకట్టించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగమే షీ టీమ్స్‌. సాధారణ పౌరులతో కలిపిపోయి ఉండే షీ టీమ్స్‌ పోలీసులు మహిళలను వేధిస్తున్నవారిని గుర్తించి, అదుపులోకి తీసుకుంటారు. ఇలాంటి ప్రయోగం దేశంలోనే ప్రథమం. ఇక్కడ విజయం తర్వాత దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఇలాంటివి ఏర్పాటుచేసుకున్నాయి. ఆకతాయిలు రోడ్డెక్కాలంటేనే భయపడుతున్నారంటే షీ టీమ్స్‌ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.


పోలీసు భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధేది?

 

వైకాపా ప్రభుత్వం పోలీసు శాఖకు అవసరమైన భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన గురించి పట్టించుకోలేదు. కొత్త జిల్లాల్లో పోలీసు ప్రధాన కార్యాలయాలకు సొంత భవనాల్లేవు. పలుచోట్ల పోలీసుస్టేషన్లు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. తెదేపా హయాంలో మంగళగిరిలో పోలీసు ప్రధాన కార్యాలయాన్ని, టెక్‌టవర్లను నిర్మించారు. అత్యాధునిక హంగులతో రాష్ట్రంలో పలుచోట్ల మోడల్‌ పోలీసుస్టేషన్లను నిర్మించారు.


తెలంగాణలో అత్యాధునిక పోలీసు భవనాలు

తెలంగాణలో పోలీసుస్టేషన్లు, కార్యాలయాలు కార్పొరేట్‌ తరహాలో రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూ.704.5 కోట్లతో సిద్దిపేట, రామగుండం, వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయాలతోపాటు 24 జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మించారు. వీటిల్లో వీడియోకాన్ఫరెన్స్‌ హాళ్లు, సమావేశ మందిరాలు నిర్మించారు. హైదరాబాద్‌- సికింద్రాబాద్‌ జంటనగరాల్లో నిజాం కాలంనాటి పోలీసుస్టేషన్‌/ఏసీపీ/డీసీపీ భవనాల స్థానంలో రూ.175.68 కోట్లతో 67 కొత్త భవనాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 87 పోలీసుస్టేషన్లకు కొత్త భవనాలు ప్రారంభించారు.


నాలుగేళ్లలో ఒక్క పోస్టూ భర్తీచేయలేదు

ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని రాబోయే నాలుగేళ్ల పాటు భర్తీచేస్తామని 2020 అక్టోబరులో చెప్పిన సీఎం జగన్‌.. ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ ఇవ్వలేదు. 6,511 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం గతేడాది నవంబరులో నోటిఫికేషన్‌ జారీచేసినా ఇప్పటికీ దానికి మోక్షం కలగలేదు. ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలు విడుదలై ఆరు నెలలు గడుస్తున్నా, అర్హులకు ఇప్పటివరకూ దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన 1.53 లక్షల మందికి నిరీక్షణ తప్పట్లేదు. మరోవైపు ఏపీ పోలీసుశాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం 17,385 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెదేపా హయాంలో 2016లో 5,348 పోస్టులు భర్తీచేశారు. 2018లో 3,137 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి నియామక ప్రక్రియ మొత్తం 2019 ఫిబ్రవరికే పూర్తిచేసింది. అప్పట్లో ఎన్నికల కోడ్‌ రావటంతో ఫలితాల వెల్లడి నిలిచిపోయింది. జగన్‌ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లో ఈ ఫలితాలు విడుదల చేసి అప్పట్లో అర్హత సాధించిన వారికి పోస్టింగులిచ్చారు. అది మినహా ఈ నాలుగేళ్లలో ఒక్క పోలీసు ఉద్యోగమూ భర్తీచేయలేదు.


45 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు

 

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పోలీసు శాఖ తన బలగాన్ని గణనీయంగా పెంచుకొంది. 2015లో 9,281, 2018లో 18,428 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసింది. 2022లో 17,516 పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నెలలోనే తుది ఫలితాలు విడుదల చేయనున్నారు. దీంతో కలిపితే తెలంగాణలో మొత్తంగా 45,225 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసినట్లవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో 90 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు.


తెలంగాణలో 2,82,558 సీసీ కెమెరాలు

 

తెలంగాణలో పది లక్షలకు పైగా సీసీ కెమెరాలున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2,82,558 సీసీ కెమెరాలున్నాయి. 2021లో సర్ప్‌షార్క్‌ సంస్థ సర్వే ప్రకారం ప్రతి చదరపు కిలోమీటరుకు 480, ప్రతి వెయ్యి జనాభాకు 30 చొప్పున సీసీ కెమెరాలతో హైదరాబాద్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. 2020లో కంపేర్‌టెక్‌ సంస్థ చేసిన సర్వే ప్రకారం అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ ప్రపంచంలోనే 16వ స్థానంలో ఉంది. 2022లో సీసీ కెమెరాల ద్వారానే తెలంగాణలో 18,234 కేసులు ఛేదించారు.


ఏపీలో  14,770 మాత్రమే

రాష్ట్రంలో 2021 జనవరి 1 నాటికి 20,968 సీసీ కెమెరాలు ఉండగా.. 2022 జనవరి 1 నాటికి వాటి సంఖ్య 14,770కు తగ్గిపోయింది. ఏడాదిలో 6,198 సీసీ కెమెరాలు తగ్గిపోయాయి. బీపీఆర్‌డీ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. గత తెదేపా ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాటినీ సరిగ్గా నిర్వహించట్లేదు. పాడైనవాటికి మరమ్మతులు చేయట్లేదు. ఫలితంగా వేల కెమెరాలు మూలకు చేరాయి. విశాఖపట్నంలో 2,900 సీసీ కెమెరాలే ఉండగా 400కు పైగా పనిచేయట్లేదు. విజయవాడలో 2,500 కెమెరాలకు దాదాపు 600 పడకేశాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. బీపీఆర్‌డీ గణాంకాల ప్రకారం తెలంగాణలో ఉన్న సీసీ కెమెరాలతో పోలిస్తే ఏపీలో ఉన్నవి 5 శాతమే. నేరగాళ్ల కదలికలు పసిగట్టడానికి, కేసుల ఛేదనకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. అయినా జగన్‌ ప్రభుత్వానికి ఆ ధ్యాసే లేదు.

Link to comment
Share on other sites

police laku raashtra abhivruddhi ki sambandham enti? recuirt chesukoni jeethaalu ivvaka povadam kanna recruit chesukoka povadame better kada?CCTVs ki alternative gaa volunteers ni pettaam kada? vaaalle maaaku CCTV lu, kaavalsindi record chesi maaku pampishtaaru.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...